Site icon pvginox

అమరావతిపై దుస్ప్రచారం తగదు

Spread the love

అమరావతి పై దుష్ప్రచారం తగదు : సదస్సులో నిపుణుల అభిప్రాయం

(విజయవాడ, ఆగస్టు 28 :pvginox)


అమరావతిపై జరుగుతున్న తప్పుడు ప్రచారం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఆటంకం కలిగిస్తోందని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. గురువారం విజయవాడలోని శ్రీరామ ఫంక్షన్ హాల్‌లో సి.ఆర్. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో “అమరావతిపై అబద్ధపు ప్రచారం – భావప్రకటన స్వేచ్ఛ” అనే అంశంపై సదస్సు జరిగింది.

ఈ సందర్భంగా ప్రధాన వక్తగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ టీ. సునీల్ చౌదరి మాట్లాడుతూ –
భారత రాజ్యాంగం ఇచ్చిన భావప్రకటన స్వేచ్ఛతో పాటు దానికి సంబంధించిన బాధ్యతలను కూడా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. అబద్ధపు వార్తల ద్వారా సమాజంలో విద్వేషాలు రాకూడదని, పత్రికా రంగంలో విలువలను నిలబెట్టుకోవడం అత్యంత ముఖ్యమని సూచించారు. ముట్నూరి కృష్ణారావు, నార్ల వెంకటేశ్వరరావు, సి. రాఘవాచారి, ఎబికె ప్రసాద్ వంటి ప్రముఖులు పాటించిన విలువలు నేటి జర్నలిజంలో మరిచిపోతున్నాయన్న ఆవేదన వ్యక్తం చేశారు.

సభకు అధ్యక్షత వహించిన సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ మాట్లాడుతూ –
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని అవసరం ఏర్పడిందని, అప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదన్నారు. అయితే 2019 తర్వాత అమరావతిపై దుష్ప్రచారం మొదలైందని, వర్షాలతో మునిగిపోయిందనే తప్పుడు ప్రచారం కూడా ఇప్పుడు కొనసాగుతోందని విమర్శించారు. “భావప్రకటన స్వేచ్ఛ” పేరుతో అబద్ధపు ప్రచారం చేయడం రాజ్యాంగ పరిమితులకు విరుద్ధమని స్పష్టం చేశారు.

నీటిపారుదల నిపుణుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ –
వర్షాలు, వరదలు సహజసిద్ధమని, కేరళ, చెన్నై, హైదరాబాదు, బెంగళూరు వంటి నగరాల్లో కూడా ఇలాంటి సమస్యలు వస్తాయని అన్నారు. అమరావతి ప్రాంతంలో వర్షపు నీటిని నిల్వ చేసుకోవడానికి ఆనకట్టలు, ప్రాజెక్టులు నిర్మించడం అవసరమని సూచించారు.

ప్రముఖ చరిత్రకారుడు పాపినేని సాయి మాట్లాడుతూ –
అమరావతికి వేల ఏళ్ల చారిత్రక ప్రాధాన్యం ఉందని, భౌద్ధ జైన సాంస్కృతిక వారసత్వాన్ని కలిగిన ఈ ప్రాంతం రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రాజధానిగా అభివృద్ధి చెందాలని అన్నారు.

అమరావతి రైతు నాయకుడు జొన్నలగడ్డ కిరణ్ మాట్లాడుతూ –
అమరావతి కేవలం రైతుల రాజధాని కాదని, యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని అని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలన్నిటినీ తట్టుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో చరిత్రకారులు, రైతు నాయకులు, జర్నలిస్టులు, జేఏసి ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Exit mobile version