Site icon pvginox

కొల్లేరుకు రాజకీయం….వై యస్ ఆర్ నుంచి వైస్సార్సీపీ దాకా

Spread the love

….

కొల్లేరు: వైఎస్సార్ నుంచి వైసీపీ వరకూ
• సమస్య జటిలం కావడానికి వారి రాజకీయాలే కారణం
• కొల్లేరుపై ఆధారపడ్డవారి ఉపాధినీ… కొల్లేరు పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానిదే
కొల్లేరు ప్రాంతంలో నెలకొన్న సమస్యాత్మక పరిస్థితులకు మూల కారణాలు అన్వేషించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఆపరేషన్ కొల్లేరు పేరుతో 2006లో శ్రీ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం భయానక రీతిలో నాటు బాంబులతో కొల్లేరులోని చెరువుల గట్లు పేల్చేసిన విధానం నుంచి వైసీపీ నాయకుడు కొల్లేరుకి పూర్వ వైభవం తీసుకొస్తామనే ప్రకటన వరకు జరిగిన పరిణామాలతోపాటు, 1976లో శ్రీ జలగం వెంగళరావు ప్రభుత్వం ఇచ్చిన జీవో 118, ఆ క్రమంలో హైకోర్టు, సుప్రీం కోర్టు కేసులు, తీర్పులు, 2001లో శ్రీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొల్లేరు ప్రాంతంలో చేపట్టిన అవగాహన కార్యక్రమాల గురించి తెలుసుకోవాలి.
10వ కాంటూరు ప్రకారం చూస్తే కొల్లేరు విస్తీర్ణం 2,25,250 ఎకరాలు. 5వ కాంటూరు పరిధిలోకి 77,138 ఎకరాలు వస్తుంది. 1975లో శ్రీ జలగం వెంగళరావు ప్రభుత్వం 7200 ఎకరాల్లో చెరువులు తవ్వుకొనేందుకు స్థానిక మత్స్యకారులకు అనుమతి ఇచ్చింది. అయితే కాలక్రమంలో 70వేల ఎకరాలకు పైగా అక్రమంగా తవ్వేశారు. అక్రమణలకు గురైన భూమి 56 వేల ఎకరాలకుపైగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
• సామాజిక పరిస్థితులు పరిగణించ లేదు
కొల్లేరు పర్యావరణ ధ్వంసంపై హైకోర్టులో నల్లమలై ఫౌండేషన్ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేసింది. 1999లో హైకోర్టు వారు కొల్లేరులో ఆక్వా కల్చర్ ఉండకూడదని, పట్టా భూముల్లో సైతం సంప్రదాయ చేపల వేట, వ్యవసాయం మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో నాడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ చంద్రబాబు నాయుడు కొల్లేరు ప్రాంతవాసులకు హైకోర్టు తీర్పుపై అవగాహన, చైతన్యం కలిగించే సదస్సులు నిర్వహించారు. జీవో 120 ఇచ్చి ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించారు. ఓ వైపు పర్యావరణాన్ని కాపాడుతూనే, అక్కడ ఉపాధి పొందుతున్న మత్స్యకార గ్రామాల ప్రజల భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకున్నారు. ఆ తరవాత ముఖ్యమంత్రిగా వచ్చిన శ్రీ వై.ఎస్.రాజశేఖర రెడ్డి తన రాజకీయ లెక్కలకు అనుగుణంగా 2006లో ఆపరేషన్ కొల్లేరు చేపట్టారు. కొల్లేరు ప్రాంతంలోని సామాజిక పరిస్థితులను పరిగణించలేదు. చేపల వేట, చెరువులపై ఆధారపడ్డ మత్స్యకార సంబంధిత కులాలను, వృత్తి ఆధారిత కులాల ఆర్థిక స్థితిగతులను పట్టించుకోలేదు. నాటు బాంబులను ఉపయోగించి చెరువులు ధ్వంసం చేశారు. 2006లో చేసిన ఆపరేషన్ కొల్లేరులో 25,142 ఎకరాల్లో ఆక్రమణల తొలగింపు పేరుతో సామాన్యుల భూముల్లోని చెరువులను బాంబులతో ధ్వంసం చేశారు. నిజంగా చిత్తశుద్ధితో చేస్తే ఆ తరవాత అదే ప్రభుత్వంలో వారి అనుచరులు, మరికొన్ని పార్టీలవారు తవ్వుకొన్న చెరువులపై ఎందుకు బాంబులు వేయలేదు? ఇక్కడ దెబ్బ తిన్నది ఎవరు? సమస్య ఏ విధంగా పీట ముడి పడిందో ఆలోచన చేయాలి.
• సామాజిక పరిస్థితులు పరిగణించ లేదు
రాంసార్ కన్వెన్షన్ 2002 ప్రకారం కొల్లేరు ప్రాంతంలో పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. అదే సమయంలో అక్కడ ఉన్న 122 గ్రామాల ప్రజల జీవనోపాదులను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అందులో భాగంగానే 2017లో నాటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు కొల్లేరు రిహాబిలిటేషన్ పై ఆలోచన ప్రారంభించారు. అప్పటి కేంద్ర మంత్రి శ్రీ వెంకయ్య నాయుడు సైతం రాంసార్ కన్వెన్షన్ 2002 ప్రకారం కొల్లేరు పర్యావరణం కాపాడుతూనే అక్కడి ప్రజల జీవనోపాధుల రక్షణ గురించి నాటి కేంద్ర పర్యావరణ మంత్రి శ్రీ ప్రకాష్ జవడేకర్ తో చర్చలు చేశారు.
• రెగ్యులేటర్ల నిర్మాణమని పైసా ఇవ్వలేదు
2019లో రాష్ట్రంలో పాలన చేసిన వైసీపీ ప్రభుత్వం ఏ దశలోనూ కొల్లేరు ప్రజల జీవనోపాధుల గురించి ఆలోచన చేయలేదు. పైగా ఆ పార్టీ అధినేత కొల్లేరుకు పూర్వ వైభవం తీసుకువస్తాను అంటూ ప్రకటనలు చేశారు. కొల్లేరుకు పూర్వ వైభవం అంటే రాంసార్ కన్వెన్షన్ గుర్తించిన 2 లక్షల 25 వేల ఎకరాలకు ఆ సరస్సును తీసుకురావడమా? లేదా ఆయన తండ్రి హయాంలో చేసిన విధంగా నాటు బాంబులతో చెరువులు, భూములు పేల్చడమా అనేది ఆయన స్పష్టత ఇవ్వలేదు. రూ.410 కోట్లతో నాలుగు ప్రత్యేక రెగ్యులేటర్లను నిర్మిస్తామని పైసా ఇవ్వలేదు. ఆయన సంబంధీకులు మాత్రమే అక్కడ చెరువులపై గుత్తాధిపత్యం సాధించారు.
కొల్లేరు సమస్య సంక్లిష్టం కావడంలో వైఎస్సార్ నుంచి వైసీపీ వరకూ చూస్తే ప్రతి దశలో వారి రాజకీయ అవసరాలకు ఆడిన ఆటలే కారణంగా కనిపిస్తాయి. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే సిద్ధాంతం కలిగిన జనసేన పార్టీ కొల్లేరువాసులతో వివిధ సందర్భాల్లో ఈ సమస్యపై చర్చించింది. పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కల్యాణ్ ఈ అంశంపై సమతుల్యమైన పరిష్కారం దిశగా అధికారులతో, నిపుణులతో, ఆ ప్రాంతవాసులతో చర్చిస్తున్నారు. ఒడిశాలోని చిల్కా సరస్సు విషయంలోనూ ఇటువంటి చిక్కులే ఎదురైతే అక్కడి ప్రభుత్వం అనుసరించిన విధానాలను సైతం అధ్యయనం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఎన్నో సంక్లిష్ట సమస్యలను పరిష్కరించిన అనుభవం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడుకి ఉంది. ఆయన నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కొల్లేరు సమస్యను చిత్తశుద్ధితో పరిష్కరిస్తుంది. కొల్లేరుపై ఆధారపడ్డవారి జీవనోపాధులను రక్షిస్తూనే, అక్కడి పర్యావరణాన్ని కాపాడే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకొంటుంది. రాజకీయ ఎత్తుగడలతో బాంబులతో పేల్చేసినా, పూర్వ వైభవం లాంటి పెద్ద మాటలతో… మభ్యపెట్టినా సమస్యను క్లిష్టతరం చేసి కొల్లేరు ప్రజల జీవితాలను ఇక్కట్లలోకి నెట్టింది వైఎస్సార్, ఆయన వారసుడి పాలనే. కూటమి పాలనలో అలాంటి రాజకీయ క్రీడలకు తావు లేదు. శ్రీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఉన్నది కొల్లేరు సమస్యలను తీర్చే బృహత్తర బాధ్యత మాత్రమే.

Exit mobile version