‘సేనతో సేనాని’ సమావేశాలతో జనసేన పార్టీకి రెట్టింపు బలం
(pvginox.com PALLA VENUGOPAL )
• భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకోవడానికి విస్తృతస్థాయి సమావేశాలు ఉపయోగపడతాయి
• ఉత్తరాంధ్రపై శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అమితమైన ప్రేమ
• కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకొని వ్యూహం రూపొందించడం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేకత
• రాష్ట్ర క్షేమం కోసం సుస్థిర పాలన ఉండాలని కోరుకున్న నాయకుడు జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు
• విశాఖపట్నంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన సేనతో సేనాని మీడియా సమన్వయకర్తలు శ్రీ కొణతాల రామకృష్ణ గారు, శ్రీ కోన తాతారావు గారు
‘కూటమి ప్రభుత్వం ఒక కుటుంబ వ్యవస్థలా కట్టుబాటుగా ముందుకు వెళుతుంది. అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు అందిస్తూ సుసంపన్న పాలన చేస్తుందని, కూటమి ప్రభుత్వ విజయాలను జనసైనికులు, వీర మహిళలు బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా… అలాగే పార్టీ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా చేపట్టడంపై జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశాల్లో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేయనున్నార’ని అనకాపల్లి శాసనసభ్యులు, సేనతో సేనాని కార్యక్రమం సమన్వయకర్త శ్రీ కొణతాల రామకృష్ణ గారు చెప్పారు. సోమవారం విశాఖపట్నంలో నిర్వహించిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీ కొణతాల రామకృష్ణ గారు మాట్లాడుతూ “వై.సి.పి. పాలనలో ఐదేళ్లపాటు అంధకారంలో ఉన్న రాష్ట్రానికి కొత్త వెలుగులు నింపడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి మార్గదర్శకంలో, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం అద్భుతంగా పాలన చేస్తోంది. తక్కువ సమయంలో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు సాధించడం చిన్న విషయం కాదు. భవిష్యత్తులో విశాఖపట్నం ఐటీ హబ్ గా మారుతుంది. ఇప్పటికే రూ. 1.70 లక్షల కోట్లతో అచ్యుతాపురం వద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్ వచ్చింది. త్వరలో నక్కపల్లి లో ఆర్సనల్ మిట్టల్ ఉక్కు పరిశ్రమ కూడా రానుంది. దీంతోపాటు ఫార్మా సెజ్ కూడా ఏర్పాటు కానున్న తరుణంలో ఉత్తరాంధ్ర ఉపాధి స్వర్గధామంగా మారనుంది. చీకట్లో మగ్గిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి వెలుగులు చూపించే ప్రక్రియలో భాగంగా కూటమి చిత్తశుద్ధిగా పని చేస్తుంది. రాష్ట్రానికి సుస్థిర పాలన ఉంటే, అభివృద్ధి అద్భుతంగా జరుగుతుందనే ఉన్నత ఆలోచనతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్యాగాలకు సిద్ధపడి మరి రాష్ట్రం కోసం కలిసి పని చేద్దాం అని చెప్పడం నాయకుడి నిబద్ధతను తెలియజేస్తుంది. జనసేన పార్టీ మొదటి నుంచి పోరాటాలను నమ్ముకున్న పార్టీ. బలమైన పోరాటాలు చేయగల సామర్థ్యం జన సైనికులు, వీర మహిళల సొంతం. మూడు రోజుల విస్తృతస్థాయి సమావేశాల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రేణులతో మమేకమై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకుని దానికి అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళికను రూపొందిస్తారు.
• ఉత్తరాంధ్ర అంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన అభిమానం
శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే విపరీతమైన అభిమానం. ప్రతి సందర్భంలోనూ ఆయన ఆ విషయాన్ని వెల్లడిస్తూనే ఉంటారు. ఉద్ధానమ్ కిడ్నీ బాధితుల సమస్యను అంతర్జాతీయంగా తీసుకువెళ్లి మరి అక్కడ అద్భుతమైన ఆరోగ్య వసతులను తీసుకురావడంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారే ప్రధాన భూమిక పోషించారు. 2019 ఎన్నికల్లో జనసేనకు ఓటమి తర్వాత కూడా ఆయన మొదట ఉత్తరాంధ్ర వేదికగానే పోరాటం మొదలు పెట్టారు. ఇసుక సమస్యపై లక్షలాది మంది కూలీలతో కవాతు చేసి అప్పటి వైసిపి ప్రభుత్వాన్ని నిద్ర నుంచి మేల్కొలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఢిల్లీ వెళ్లి అడ్డుకున్న నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఉత్తరాంధ్ర సమస్యల సాధనకు, ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు తీసుకురావడంలో, ఉత్తరాంధ్ర సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ముందుంటారు. జనసేన పార్టీ మూడు రోజులపాటు నిర్వహించబోయే విస్తృతస్థాయి సమావేశాలకు కూడా విశాఖను వేదికగా చేయడం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరాంధ్ర అంటే ఎంత అభిమానమో చాటి చెబుతుంది. ఈ మూడు రోజులు సమావేశాలు పార్టీ మరింత బలోపేతం కావడానికి, భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి” అన్నారు.
• సమావేశాలకు పక్కాగా ఏర్పాట్లు: శ్రీ కోన తాతారావు గారు, మీడియా కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్
“ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో 30వ తేదీ నిర్వహించబోయే సభకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జర్మన్ షెడ్లను స్టేడియంలో వేసే ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. విశాఖ నగరం అంతా సేనతో సేనాని కార్యక్రమం శోభ ఉట్టిపడేలా సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖ వేదికగా నిర్వహించబోయే ఈ మూడు రోజుల సమావేశాలు పార్టీకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇటు పాలనలో అటు తన వ్యక్తిగత వృత్తిలో మరోవైపు పార్టీ మీద దృష్టి పెడుతున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి పని తీరు స్ఫూర్తిదాయకం. ఆయన కృషికి తగినట్లుగా ప్రతి జన సైనికుడు, వీర మహిళ పార్టీ కోసం పునరంకితం కావాలి” అన్నారు.
ఈ సమావేశంలో మీడియా కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు శ్రీమతి కిరణ్ ప్రసాద్, శ్రీ తిప్పల వంశీ, డా.మర్రివేముల శ్రీనివాస్, శ్రీ తిప్పల రమణారెడ్డి, శ్రీ దూలం గోపి, శ్రీ బి.వి.కృష్ణయ్య, శ్రీ చదరం నాగేశ్వరావు, శ్రీ మంగా ఈశ్వర్, శ్రీ బేతు చైతన్య, శ్రీ బంటు రవి పాల్గొన్నారు.
