సంపాదన కోసం కాదు… సేవ కోసమే టీటీడీకి వచ్చా…
శ్రీవారిపై భక్తీ… భక్తులకు నిస్వార్ధమైన సేవ… ఇదే నా లక్ష్యం…
అద్భుతంగా మారనున్న అలిపిరి రూపురేఖలు
1600 కోట్ల టీటీడీ పనులకు బిల్లులు నిలిపివేత
స్విమ్స్ కారణంగా టిటిడి కి ఏటా 200 కోట్ల నిధుల భారం…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానం అమలు చేస్తే సామాన్య భక్తుల కష్టాలు తీరినట్లే…
సామాన్య భక్తులకు అనుగుణంగా వీఐపీ బ్రేక్ దర్శనం సమయం మార్పులు…
టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు
బొల్లినేని రాజగోపాల్ నాయుడు ఇంటర్వ్యూ….
(తిరుపతి, pvginox.com)
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల పుణ్యక్షేత్రం.. హిందూ ధార్మిక క్షేత్రమైన ఈ సప్తగిరులను పవిత్రంగా ప్రశాంతంగా ఉంచాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. భక్తుల మనోభావాలకు విలువనిస్తూ, శ్రీవారి కి భక్తులు సమర్పించే కానుకలను ఒక పైసా కూడా వృధా కానివ్వకుండా, దుబారా చేయకుండా, టిటిడి సంస్థను కాపాడుకుంటూ.. కొండపై సామాన్య భక్తులు ఎటువంటి కష్టాలు పడే అవకాశం లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానంతో స్వామివారి దర్శనాన్ని సామాన్య భక్తులకు గంట నుండి రెండు గంటల సమయంలోనే పూర్తయ్యే విధంగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని టిటిడి ధర్మకర్తల మండలి చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు విస్పష్టంగా ప్రకటించారు.
డబ్బు సంపాదన మీద తనకు ఏమాత్రం ఆసక్తి లేదని, సంపాదన దృష్టితో కాకుండా కేవలం సేవ చేయడానికి మాత్రమే టిటిడి కి వచ్చానని బి.ఆర్ నాయుడు వెల్లడించారు. ముఖ్యంగా టీటీడీలో నిధుల దుబారాను అరికట్టి దేవుడు సొమ్మును కాపాడాలనే లక్ష్యంతో కొన్నేళ్ల క్రితం నుంచి ఆలోచిస్తున్న తాను ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా, పైసా ఆశించకుండా టీటీడీని అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ట కాపాడేలా పనిచేస్తానన్నారు., తన సొంత మీడియా టీవీ5 ఛానెల్స్ సంస్థల్లో కూడా టీటీడీకి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేయకుండా నిలిపివేశానన్నారు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ధార్మిక సంస్థపై భక్తులలో దురభిప్రాయం ఏర్పడకుండా ఉండాలని, తిరుమల కొండపై ఏదో జరిగిపోతుందనే ఆందోళన భక్తులలో ఉండకూడదని, టిటిడి పై భక్తుల్లో పూర్తి నమ్మకం ఏర్పడేలా, భక్తుల మనోభిప్రాయాలను గౌరవిస్తూ ఈ విధమైన నిర్ణయం తీసుకున్నామన్నారు.
మాయావి దినపత్రిక ఎడిటర్ కోలా లక్ష్మీపతి అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన నిర్మొహమాటంగా సమాధానం ఇస్తూ… టీటీడీ సంస్థలో ఇంతకాలం వేళ్లూనుకున్న జాడ్యం తొలగించి, కొన్ని సంస్కరణలు ప్రక్షాళన తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుంటే… అధికార వ్యవస్థ సహకరించకుండా జాప్యం చేస్తుండడం బాధ కలిగిస్తోందన్నారు. అయితే సంస్థ ప్రయోజనాలే ముఖ్యంగా భావించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా ప్రతి అంశాన్ని చంద్రబాబుతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటున్నామని వివరించారు. టిటిడిలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ విధానం, అన్నదానంలో భక్తులకు అదనంగా వడ్డించే మసాలా వడలు ప్రవేశపెట్టే విధానంలోనూ ముఖ్యమంత్రితో మాట్లాడగానే.. అసలు ఇంతటి అద్భుతమైన ఆలోచనలు నీకు ఎలా వస్తాయి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసిన సీఎం “గో హెడ్” అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు నిర్మించాలని ముఖ్యమంత్రి స్వయంగా నా ద్వారా లేఖలు రాయించారు. తిరుపతి వేదికగా ఇద్దరు ముఖ్యమంత్రులకు నన్ను పరిచయం చేశారు. ఇలా అనేక అంశాలలో ముఖ్యమంత్రి స్వయంగా ప్రోత్సహించడం కంటే ఏం కావాలి… చెప్పండి.
సీఎం కూడా టీటీడీ పాలకమండలి, అధికార వ్యవస్థ మధ్య సమన్వయం లోపం ఉండకూడదని స్పష్టంగా చెప్పారు. పాలకమండలి చైర్మన్ నిర్ణయాలను అనుసరించి అధికారులు పనిచేయాలని వారి ముందే కుండ బద్దలు కొట్టినట్లు సీఎం స్పష్టం చేశారు. తిరుమల ఎలా ఉండాలి… భక్తులకు కష్టం రాకుండా ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి… టిటిడి నిధులు దుర్వినియోగం కాకుండా ఎలా కాపాడాలి..!? గత ఐదేళ్లలో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తూ కేటాయించిన నిధులను ఎలా కట్టడి చేయాలి..!? అనే విధంగా ఒక స్పష్టమైన విధానంతో ముందుకెళుతున్న నాకు నిజంగా.. కోపం కాస్త ఎక్కువే.. అయితే ఆ కోపాన్ని నేను ఇప్పుడు చూపిస్తే అధికారులు తట్టుకోలేరు… అందుకే.. ధార్మిక సంస్థ సాంప్రదాయాన్ని గౌరవించి నేను నా కోపాన్ని అంతటినీ కట్టిపెట్టేసా… ఎందుకంటే టీటీడీలో అభిప్రాయ భేదాలను కూడా సమన్వయ లోపంగా భావించి సంస్థపై చెడు అభిప్రాయాలు ప్రచారంలోకి వస్తున్నాయి. అలాంటి వాటికి అవకాశం ఇవ్వకూడదనుకున్నా.. అంటూ బి ఆర్ నాయుడు తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.
టీటీడీలో ఇటీవల ఆయన తీసుకున్న కొన్ని సంచలనాత్మక, కఠినమైన నిర్ణయాలు అమలు చేయనున్న అంశాలు ఆయన మాటల్లోనే…….
*** శ్రీవారి దర్శనార్థం తిరుపతి అలిపిరి వద్ద అడుగుపెడుతున్న భక్తులకు అక్కడ సర్వాంగ సుందరంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో అలిపిరి భద్రతా తనిఖీ ప్రాంతాన్ని రూపు రేఖలు మార్చేలా ఆధునికరించాలని నిర్ణయం తీసుకున్నాం..
***ఇందుకోసం బోర్డు సభ్యులు ఆనంద సాయి ఆధ్వర్యంలో ఆర్కిటెక్ చిత్రాన్ని రూపొందించాలని ఆదేశించాము.. ఆయన నివేదిక అంతగానే అలిపిరి ప్రాంతాన్ని ఆధునిక గురించి పనులు చేపడతాం…
***తిరుమలలో ఏర్పాటు చేయనున్న ఆర్టిఫిషయల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ ద్వారా రెండు గంటల్లో శ్రీవారి దర్శనాన్ని పూర్తి చేసేందుకు భక్తులకు ఫేస్ రికగ్నైజేషన్, యంత్రాలను ప్రవేశ పెట్టడం, దాదాపు కొండపై 40 కేంద్రాలను టోకెన్ల జారీ కోసం ఏర్పాటు చేయడమే కాకుండా తిరుపతి నుంచి అలిపిరి కాలినడకన నడిచి వచ్చే భక్తులకు కూడా అక్కడ ఏఐ విధానంలో దర్శన టోకెన్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నాం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే మూడు టెక్నాలజీ సంస్థలు టీటీడీని సంప్రదించాయి. ఇందులో ఒక సంస్థకే పనులు ఇవ్వాలా లేక మూడు సంస్థలను వినియోగించుకోవాలా అన్నది పరిస్థితిని బట్టి పాలకమండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం…
*** టిటిడిలో ఇప్పుడు దాదాపు 1600 కోట్ల రూపాయల వ్యయంతో జరుగుతున్న
కాంట్రాక్టు పనులకు బిల్లులు చెల్లించకుండా నిలిపి వేశాం.. అసలు ఇవన్నీ కూడా గత ప్రభుత్వం ఇష్టానుసారంగా తీసుకున్న నిర్ణయాలు.. అవసరం ఉందా లేదా అనే దిశగా వీటిపై ఇప్పుడు పునరాలోచిస్తున్నాం.. తిరుపతిలోని రెండు మూడవ సత్రాలను అనవసరంగా కూలగొట్టారు. బోర్డు సభ్యులతో ఈ పనులపై విచారణ కమిటీ వేయడం జరిగింది. వారి నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం…
***తిరుపతిలో స్విమ్స్ ఆసుపత్రి నిర్వహణ టిటిడి కి సంబంధించినది కాదు.. గత ప్రభుత్వంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అనవసరంగా ఈ నిర్వహణ భారాన్ని టిటిడి నెత్తిపై రుద్దారు. ఒకప్పుడు కేవలం 20 కోట్ల రూపాయల నిధులను టీటీడీ సిమ్స్ ఆసుపత్రికి కేటాయించేది. ఇప్పుడు 200 కోట్ల రూపాయలు కేటాయించాల్సి వస్తోంది. అందుకని స్విమ్స్ ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వమైనా లేక కేంద్ర ప్రభుత్వమైన వారి ఆధీనంలోకి నిర్వహణ బాధ్యతల్ని తీసుకోవాలి. దీనిపై పూర్తి నివేదిక కోసం విశ్రాంత ఐఏఎస్ అధికారి ఐ వి సుబ్బారావు తో కూడిన అధికారుల కమిటీని నియమించాం.
*** సంస్థకు భక్తీ ప్రచారాన్ని కోసం ఏర్పాటు చేసుకున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఇప్పుడు టిటిడి కి ఒక తెల్ల ఏనుగులా మారింది. కోట్లాది రూపాయల నిధులు మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. త్వరలోనే ఎస్వీబీసీ ఛానల్ పై ప్రత్యేక దృష్టి సారించి ప్రయోజనకరంగా తీర్చిదిద్దుతాం.
*** తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారం ముందు ఉన్న పందిరి, నాలుగు మాడ వీధుల్లో ఉన్న గ్యాలరీలో ఇటీవల ఏర్పాటు చేసిన తాత్కాలిక పందిళ్ళ స్థానంలో శాశ్వత ప్రాతిపదికన కాంట్రాక్టర్లకు అనవసరమైన అద్దెలు చెల్లించే అవసరం లేకుండా, జర్మన్ తరహా పందిళ్లు షెడ్లను టిటిడి ఇంజనీరింగ్ విభాగం ద్వారా ఏర్పాటు చేసుకునేందుకు ఆలోచిస్తున్నాం.
*** కొండపై ఉన్న 17 ప్రైవేట్ హొటళ్లలో భక్తులకు నాణ్యమైన ఆహార పదార్థాలను తక్కువ ధరలకు అందించే విధంగా కొత్త విధానాన్ని అవలంభించబోతున్నాం. ఇవన్నీ బ్రాండెడ్ సంస్థలకు అప్పచెబుతూ టీటీడీకి నామమాత్రపు అద్దెలు చెల్లించేలా , భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని తక్కువ ధరలకు విక్రయించేలా నిబంధనలు విధిస్తాం. గతంలో టీటీడీ భక్తులకు తక్కువ ధరలకు విక్రయించేందుకు కోసమే జనతా క్యాంటీన్ ను కొండపై ఏర్పాటు చేసింది. ఇప్పుడు అవన్నీ మారిపోయాయి. కాబట్టి హోటల్లో టెండర్ విధానంలో పూర్తి మార్పులు చేపడుతాం.
*** టిటిడి ఉద్యోగుల్లో పని విధానంలో పారదర్శకత తీసుకొచ్చేందుకు నేమ్ బ్యాడ్జీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. భక్తులకు జవాబు దారితనంగా టీటీడీ ఉద్యోగులు వ్యవహరించాలనే ఉద్దేశంతోనే ఈ నేమ్ బాడ్జిలు తీసుకొస్తున్నాం. అంతేకానీ వారి మీద అజమాయిషీ చేయడానికి కాదని తెలుసుకోవాలి.
*** తిరుమల కొండపై గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా అనధికారిక తట్టలు పెరిగిపోయాయి. స్థానికేతరుల పేరుతో అసాంఘిక వ్యక్తులు తిరుమలలో తిష్ట వేసుకున్నారు. అధికారికంగా టీటీడీ అనుమతించినవి 1200 షాపులు, 720 హాకర్ లైసెన్సులు, కాగా అనధికారికంగా దాదాపు 1000 తట్టలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటన్నింటిని పూర్తిస్థాయిలో తొలగించే విధంగా ప్రక్షాళన జరగాలి. అందుకోసం త్వరలో ఈవో, అదనపు ఈవో, సి వి ఎస్ ఓ, ఉన్నతాధికారులతో చర్చించి ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నాం. ఈ టాస్క్ ఫోర్సులో పంచాయతీ, రెవెన్యూ, ఆరోగ్యశాఖ, విజిలెన్స్ విభాగం, ఇంజనీరింగ్ విభాగం పోలీసులు అందరూ కలిసి టాస్క్ ఫోర్స్ గా ఏర్పడి ఈ అనధికారిక తట్టలు, ఆక్రమణలను తొలగించే కార్యక్రమాన్ని చేపడతాం.
*** శ్రీవారి ఆలయంలో ఉదయం పూట బ్రేక్ దర్శనం మధ్యాహ్నం వరకు నడుస్తోందని, ఈ కారణంగా సామాన్య భక్తులకు దర్శనం చాలా ఆలస్యం అవుతుందని అభిప్రాయాలు వెలడవుతున్నాయి. కాబట్టి దీనిపై పునరాలోచించాలని భావిస్తున్నాం. గతంలో లాగే విఐపి బ్రేక్ దర్శనాన్ని ఉదయం పూట తొందరగా ప్రారంభించి, బ్రేక్ దర్శనం టికెట్లను క్రమ బద్దీకరించి, రెండు గంటల సమయంలో గా బ్రేక్ దర్శనాన్ని పూర్తిచేసి సామాన్య భక్తులకు స్వామివారి దర్శన సమయాన్ని మరింత ఎక్కువగా కల్పించే అవకాశాన్ని కల్పించాలని ప్రయత్నిస్తున్నాం.
*** భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న శ్రీవారి సేవా వాలంటరీ వ్యవస్థను మరింత పటిష్టవంతం చేసే దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నాం. పి ఆర్ ఓ విభాగం నుండి వేరుచేసి, శ్రీవారి సేవ విభాగాన్ని సమర్థవంతంగా నడిపేందుకు ఒక డిప్యూటీ ఈవో స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించాలని భావిస్తున్నాం. ప్రస్తుతం పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీవారి సేవ వాలంటరీ వ్యవస్థ కారణంగా పని ఒత్తిడి అధికమైన పరిస్థితి గమనించాం.
*** తిరుమల తిరుపతి ఘాట్ రోడ్లు బాగానే ఉన్నప్పటికీ వాటిపై మళ్లీ రోడ్లు వేయాలని 12 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు ఆమోదించారు. అయితే వాస్తవంగా ప్యాచ్ వర్కులు తప్ప
కొత్తగా రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఘాట్ రోడ్లలో కనిపించడం లేదు. అందుకనే ఈ 12 కోట్ల రూపాయల వర్కులు చేపట్టాలా వద్దా..? అనే అంశంపై ఇంజనీరింగ్ అధికారులతో ఒక కమిటీ వేసాం. కమిటీ నివేదిక రాగానే దీనిపై ఒక నిర్ణయం అమలు చేస్తాం. అంటూ టిటిడి ధర్మకర్తల మండలి చైర్మన్ బిఆర్ నాయుడు టిటిడి అభివృద్ధి అంశాలను వివరించారు
దటీజ్ ..బి ఆర్ నాయుడు.. వెంకన్న కొలువులో ఆయన ఆశీస్సులతో అనుగ్రహంతో అనుకున్న లక్ష్యాలను సాధించాలని సర్వదా కోరుకుందాం…
