Site icon pvginox

పటిష్ట భావజాలం… సైద్ధాంతిక పోరాటం… జనసేన బలం

Spread the love

పటిష్ట భావ జాలం, సైద్ధాంతిక పోరాటమే జనసేన బలం

• ప్రజలకు మేలు చేసే మార్పును జనసేన కోరుకుంటుంది
• దేశ గతిని మార్చే యువ నాయకత్వాన్ని అందించడమే నా కల
• సనాతన ధర్మం అంటే సమాజంలో అందరికీ మేలు జరగాలని కోరుకోవడమే

‘‘రుద్రవీణ వాయిస్తా
అగ్నిధార కురిపిస్తా
తిరుగుబాటు జెండా ఎగురేస్తా
దుష్టపాలన నుంచి విముక్తి కలిగిస్తా’’ – అన్న తెలంగాణ ప్రజాకవి శ్రీ దాశరథి కృష్ణమాచార్య పంక్తులే జనసేనకు బలం. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని తొడలు కొట్టిన వారిని ఎదురించి వంద శాతం స్ర్టైయిక్ సాధించడమే జనసేన స్వర్ణ ప్రస్థానం. బలమైన భావజాలం, గొప్ప సిద్ధాంతాలతో ప్రయాణం మొదలుపెట్టి ప్రజలకు మేము అండగా నిలుస్తామని భరోసా నింపిన గొప్ప ధైర్యం జనసేన పార్టీదని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు అన్నారు. చాలా భయాలు, బాధ్యతలుండే సగటు మధ్య తరగతి వ్యక్తిగా ఎదిగి, ప్రజల కోసం పని చేయాలనే తలంపుతో జనసేన పార్టీని ప్రారంభించి వంద శాతం స్ట్రయిక్ రేటు సాధించడం ప్రజల ఆశీర్వాదం, దేవుడి రాత అన్నారు. తప్పును తప్పు అని, ఒప్పును ఒప్పు అని చెప్పడమే నా సిద్ధాంతం అని పేర్కొన్నారు. పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం ‘జయ కేతనం’ సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
“చాలా మంది ఢిల్లీ స్థాయి జర్నలిస్టులు పవన్ కళ్యాణ్ లెఫ్టిస్టు, రైటిస్టు, సెంట్రిస్టు అని పదేపదే రకరకాలుగా రాస్తున్నారు. నేను ఒకటే చెప్పదల్చుకున్నా. నేను చెగువేరాను ప్రేమిస్తా.. నారాయణ గురును గౌరవిస్తా. నేను లోకమాన్య బాలగంగాధక్ తిలక్ కు నమస్కరిస్తా.. జయప్రకాశ్ నారాయణ్ భావజాలం అభిమానిస్తా.. మదర్ థెరిసాకు మొక్కుతా… భగత్ సింగ్ ను గుండెల్లో పెట్టుకుంటా. నేను చెగువేరాను ప్రేమిస్తా అంటే లెఫ్టిస్టు అవ్వాల్సిన అవసరం లేదు. ఓ వైద్య విద్యార్థిగా కేవలం రోగులకు చికిత్స చేయడమే కాదు.. సమాజాన్ని కాపాడటానికి చికిత్స చేయాలనే ఉన్నత ఆశయంతో ఆయన దేశం కాని దేశం కోసం, మనుషుల కష్టాలను అర్థం చేసుకొని పోరాడారు. అది నాకు ఇష్టం. నేను మనుషుల్లో ఉండే గొప్పదనాన్ని ప్రేమిస్తా. ఆరాధిస్తా. మంచి ఎక్కుడున్నా తీసుకుంటా. అదే నా సిద్ధాంతం. భావజాలం. భిన్నమైన వ్యక్తుల్లో ఏకత్వం అనే మంచిని చూడటమే నాకు తెలుసు. జనసేన ఏడు సిద్ధాంతాలను ఎంతో మదించి పార్టీ నిర్మించుకున్నాం. వాటిని తప్పనిసరిగా పాటిస్తూ ముందుకు వెళ్తాం. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు మార్చే వాడే అయితే ఈ దశాబ్దకాల ప్రయాణం ఎలా సాధ్యం..? ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఎలా నిలబడ్డాం..?

Exit mobile version