జన సైనికులు, వీర మహిళల పోరాటమే జనసేన పార్టీకి బలం
• యువతకు జనసేన పార్టీ ప్రాధాన్యమిస్తుంది
• సోషల్ మీడియాలో మహిళలపై విపరీత పోకడలు పెరిగాయి
• దీనిపై అసెంబ్లీలో చర్చిస్తాము
• విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, సుగాలి ప్రీతి కేసుల్లో నిజాయతీగా నిలబడిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
• జనసేన పార్టీ లెజిస్లేటివ్ సమావేశం, కార్యవర్గ సమావేశ అనంతరం వీడియోతో మాట్లాడిన ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్ కుమార్
జనసేన పార్టీకి యువత బలమే ప్రధానం. వారి ఆలోచన, పోరాటపటిమే ఆయుధం. జనసేన పార్టీ రాజకీయ ప్రస్థానంలో యువత పాత్ర ప్రధానమైనదని యలమంచిలి శాసనసభ్యుడు శ్రీ సుందరపు విజయ్ కుమార్ అన్నారు. జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశాల్లో మొదటి రోజు లెజిస్లేటివ్ పార్టీ, కార్యవర్గ సమావేశాలు పూర్తయిన తర్వాత సమావేశంలో జరిగిన వివరాలను శ్రీ విజయ్ కుమార్ మీడియా వివరించారు. ఈ సందర్భంగా శ్రీ విజయకుమార్ మాట్లాడుతూ.. ” రాష్ట్ర క్షేమం, దేశం ఉన్నతి గురించి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఉంటాయి. రాష్ట్రంలో కూటమి ఏర్పాటుకు కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఉన్నత ఆలోచనలే దోహదం చేశాయి. వైసిపి ఐదేళ్ల హయాంలో చీకట్లో మగ్గిపోయిన రాష్ట్రాన్ని మళ్లీ వెలుగులోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం బలంగా ప్రయత్నిస్తుంది. దీనికి అనుగుణంగా జనసేన పార్టీ కూడా తన వంతు కృషి చేస్తుంది. పార్టీలో కీలకమైన జనసైనికులు, వీర మహిళలు కూటమి స్ఫూర్తిని, ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. ప్రజా సమస్యలు, రాష్ట్ర అంశాల పట్ల శ్రీ పవన్ కళ్యాణ్ గారు చట్టసభల్లో ఎలా మాట్లాడాలో మా పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు సూచనలు అందించారు. జనసేన పార్టీ విధానం సుస్థిరమైన పాలనతో ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని కోరుకుంటుంది.
• స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, సుగాలి ప్రీతి కేసు విషయంలో జనసేన పార్టీకి నిజాయతీతో కూడిన ప్రయాణం
సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం గురించి సమావేశాల్లో చర్చించాం. దీంతో పాటు మహిళలపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న విపరీత ధోరణి గురించి సమావేశాల్లో చర్చించాం. అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనిపై చర్చించేలా మాట్లాడుతాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయడంలో పవన్ కళ్యాణ్ గారు నిజాయతీగా ప్రయత్నం చేశారు. అధికారంలో లేకపోయినా ఢిల్లీ వెళ్లి శ్రీ అమిత్ షా గారిని కలిసి ప్రైవేటీకరణ వద్దని చెప్పిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎన్డీఏ సమావేశాల్లో దీనిపై మాట్లాడారు. వాలంటరీ రిటైర్మెంట్ లను ప్రైవేటీకరణకు ముడిపెట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుందని వైసిపి చేస్తున్న దుష్ప్రచారం ప్రతి ఒక్కరూ తిప్పి కొట్టాలి. అలాగే సుగాలి ప్రీతి కేసు విషయంలోనూ మొదటి నుంచి నిబద్ధతగా పోరాటం చేసిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. లక్షలాదిమందితో కర్నూలులో చేసిన కవాతు తర్వాత వైసిపి ప్రభుత్వం ఒత్తిడికి గురై సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు పరిహారం అందించింది. అయితే ఈ కేసులో కొన్ని కారణాలరీత్యా సాక్షాలను కావాలని అప్పటి ప్రభుత్వంలోని కొందరు ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. కచ్చితంగా సుగాలి ప్రీతి కుటుంబానికి తగిన న్యాయం చేసేలా చూడడమే జనసేన పార్టీ విధానం. పార్టీ కోసం మొదట్నుంచి కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి అని శ్రీ పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతం చేసేలా ప్రత్యేక ప్రణాళికను అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రూపొందిస్తున్నారు.” అన్నారు. సమావేశంలో శాసనమండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, శాసనసభలో ప్రభుత్వ విప్ లు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, శ్రీ బొమ్మిడి నాయకర్, శ్రీ అరవ శ్రీధర్, ఎమ్మెల్యేలు శ్రీ పత్సమట్ల ధర్మరాజు, శ్రీ పంతం నానాజీ తదితరులు పాల్గొన్నారు.
