Site icon pvginox

బాధ్యతలు స్వీకరించిన ఆలపాటి..

Spread the love


(విజయవాడ, జూన్, 05,2025, pvginox)
సి. రాఘవాచారి మీడియా అకాడమి, ఆంధ్రప్రదేశ్, ఛైర్మన్ గా తనను నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుకు శ్రీ ఆలపాటి సురేశ్ కుమార్ సభా ముఖంగా ధన్యవాదాలు తెలిపారు. స్థానిక రెవిన్యూ కాలనీలో సి. రాఘవాచారి మీడియా అకాడమి కార్యాలయం లో గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

పాత్రికేయ వృత్తిలో ప్రమాణాలు మెరుగు పరచేందుకు తాను అత్యంత ప్రాధాన్యత యివ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. మీడియా విస్తృతి, సంక్లిష్టత కారణంగా యీ నిర్ణయం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. మీడియా అకాడమి ప్రాథమిక విధుల్లో ఇది ఒకటని ఆయన యీ సందర్భంగా గుర్తు చేశారు. అదేవిధంగా, “సోషల్ మీడియా” ను దృష్టిలో వుంచుకుని అవసరమైన సందర్భాల్లో నియంత్రణ చేయాల్సిన అవసరం కూడా ఉందన్నారు. సరియైన సమాచారాన్ని పొందడం లో యిది ఒక భాగమే కనుక మీడియా అకాడమి పరిధిలో లేకపోయినా, యీ విషయం పై దృష్టి సారించాల్సివుంటుందన్నారు.

అంతకుముందు తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమి ఛైర్మన్ శ్రీ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ పాత్రికేయుల సంక్షేమానికి కృషి చేయాలని ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీ సురేశ్ కుమార్ కు సూచించారు.

సి. రాఘవాచారి మీడియా అకాడమి ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీ ఆలపాటి సురేశ్ కుమార్ కు APUWJ, APWJF నేతలు ఇతర జర్నలిస్టు సంఘాల నాయకులు IJU జాతీయ కార్యదర్శి శ్రీ డి. సోమ సుందర్, హిందూ రెసిడెంట్ ఎడిటర్ శ్రీ రెడ్డప్ప, సమాచార శాఖ మంత్రి వర్యుల అదనపు పి.ఎస్. డా. అనిత, సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీమతి ఎల్. స్వర్ణ లత, జాయింట్ డైరెక్టర్ శ్రీ పి. కిరణ్ కుమార్, విశ్రాంత అడిషనల్ డైరక్టర్ శ్రీ దాసరి శ్రీనివాస్ తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి సత్కరించారు.

మీడియా అకాడమి సెక్రెటరీ శ్రీ మణిరాం నూతన ఛైర్మన్ కు స్వాగతం పలికారు. శ్రీ ఆలపాటి సురేశ్ కుమార్, సి. రాఘవాచారి మీడియా అకాడమి ఛైర్మన్ నాలుగు దశాబ్ధాలుగా పాత్రికేయ రంగం లో ఉన్నతమైన సేవలందించారన్నారు.

ఈ సందర్భంగా అవనిగడ్డ శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ ఛైర్మన్ శ్రీ సురేష్ కుమార్ ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు పాత్రికేయులు వారిని అభినందించి సత్కరించారు.

Exit mobile version