విలువలే జనసేన పార్టీ ఊపిరి
• నిజాయితీ గల జనసైనికులు, వీర మహిళలే పార్టీకి ఇంధనం
• పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుంది
• సమకాలీన విషయాలపై నాయకులు అవగాహన పెంచుకోండి
• సోషల్ మీడియా కుట్రలను తిప్పికొట్టాలి
• స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల విషయంలో జనసేనది బలమైన పోరాటం
• సుగాలి ప్రీతి కేసు విషయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా పోరాడారు
• జన సైనికులు కూటమి ప్రభుత్వ స్ఫూర్తిని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
• జనసేన పార్టీ కార్యనిర్వాహక వర్గ సమావేశంలో ప్రసంగించిన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
‘పాలసీ మేకర్స్ గా, లా మేకర్స్ గా ఒకే గొంతు వినిపిస్తూ ముందుకు వెళ్దాము. రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, ప్రజలకు ఏది మంచి జరిగితే దానికి కట్టుబడి జనసేన పార్టీ పని చేస్తుంది. యువత, మహిళలపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని జనసేన పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై ఒక బలమైన నిర్ణయం తీసుకునేలా చట్టసభల్లో మా పార్టీ ప్రతినిధులు మాట్లాడతారు. గత ప్రభుత్వంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జన సైనికులు, వీర మహిళలు బలంగా నిలబడ్డారు’ అని పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. గురువారం విశాఖపట్నంలో నిర్వహించిన జనసేన పార్టీ కార్యనిర్వాహక వర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు.
శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ “అప్పటి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా వాటిని అడ్డుకోగలిగారు. అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి నాయకులకు ఎదురొడ్డి విశాఖపట్నంలో పోలింగ్ స్టేషన్లలో కూర్చున్న వాళ్లను జన సైనికులు, వీర మహిళలు బయటకు రప్పించారు. అలాంటి వారికి పార్టీ కోసం నిలబడిన యువతకు ప్రాధాన్యమిస్తూ వారితో మమేకం కావాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు భావించారు. వారి అభిప్రాయాలను, సూచనలు వినాలని ఆయన భావిస్తున్నారు. ఈ మూడు రోజుల సమావేశాల్లో యువతకు ప్రాధాన్యం ఇచ్చేలా, పార్టీకి కొత్త ఉత్తేజం తీసుకొచ్చేలా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తున్నారు. ఎంతో దూరదృష్టితో రాష్ట్రం కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆలోచనలే ఈరోజు రాష్ట్రానికి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వచ్చేలా పని చేశాయి.
• స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖపట్నానికి వచ్చిన స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్నారనే వార్త బయటకు రాగానే మొట్టమొదట స్పందించిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేసి, కనీసం దీనిపై నోరెత్తకపోయినా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా గారిని కలిసి, ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయవద్దని కోరారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలువరించేలా, అఖిలపక్షం వేసి ఢిల్లీకి తీసుకువెళ్లాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో సూచించినా వైసీపీ నాయకుడు స్పందించలేదు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ కుటిల రాజకీయాలు చేస్తోంది. మొదటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బలంగా పోరాటం చేసింది జనసేన పార్టీ మాత్రమే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన ఎన్డీఏ సమావేశంలో కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని ఢిల్లీ పెద్దలను కోరారు. ముసుగులో దాక్కుని పాలన సాగించిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్ర లో మిగిలిపోయారు.
• సుగాలి ప్రీతి కుటుంబానికి మొదటి నుంచి జనసేన పార్టీ అండగా నిలిచింది
గిరిజన బాలిక సుగాలి ప్రీతి కి జరిగిన అన్యాయంపై నిజాయతీగా మొదటి నుంచి పోరాడింది జనసేన పార్టీ మాత్రమే. కర్నూలు నగరంలో రెండు లక్షల మందితో శ్రీ పవన్ కళ్యాణ్ గారు కవాతు నిర్వహించి అప్పటి ప్రభుత్వాన్ని తట్టి లేపారు. అప్పటి వైసిపి ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడంతోనే బాధితురాలి తండ్రికి అప్పటి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగo ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితురాలికి అందవలసిన సాయాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఒత్తిడితోనే అప్పటి ప్రభుత్వం ఇచ్చింది. సుగాలి ప్రీతి కుటుంబానికి 5 ఎకరాల భూమి, ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇచ్చారు. వారు అడిగిన డిమాండ్లు చాలా వరకు పూర్తి అయ్యాయి. వారు డిమాండ్ చేస్తున్న ఉద్యోగ ప్రమోషన్ అనేది సర్వీస్ రూల్స్ కి అనుగుణం ఉంటుంది. అయితే ఈ కేసుకు సంబంధించి వైసిపి హయాంలో కొన్ని సాక్షాలను తారుమారు చేశారు. సుగాలి ప్రీతి తల్లి చెబుతున్న 17 మంది అనుమానితుల డిఎన్ఏ సరిగా మ్యాచ్ కావడం లేదు.
పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకోగానే ప్రత్యేకంగా సుగాలి ప్రీతి తల్లిదండ్రులను పిలిపించుకొని మాట్లాడారు. అప్పటి డిజిపి గారితో కూడా ప్రత్యేకంగా మాట్లాడారు. హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యేకంగా కేసును చూడాలని సూచించారు. న్యాయవ్యవస్థకు కావలసింది సాక్ష్యాలు, ఆధారాలు. వాటిని ఉద్దేశపూర్వకంగా గత ప్రభుత్వ హయాంలో ధ్వంసం చేశారు. కేసుపై శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఒత్తిడి పెరుగుతున్న దృష్ట్యా అప్పటి ప్రభుత్వం బాధితురాలి కుటుంబానికి సాయం చేస్తూనే ఆధారాలు ధ్వంసం చేసింది. కచ్చితంగా సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయంపై న్యాయం జరగాలి అన్నదే జనసేన పార్టీ విధానం. దీనిలో ఎలాంటి మార్పు లేదు. ఈ కేసుకు సంబంధించి సుగాలి ప్రీతి కేసు దోషులను చట్టానికి ఎలా పట్టించాలి అన్నదానిపై న్యాయ నిపుణులతో మాట్లాడి ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తాం. ఈ కేసులో ఆ కుటుంబానికి మంచి జరగాలి, న్యాయం జరగాలి అన్నదే జనసేన పార్టీ విధానం.
• నాయకులు ప్రతి రోజూ సమకాలీన అంశాలపై మాట్లాడండి
పార్టీ నాయకులు ప్రతిరోజు రాష్ట్రంలోని సమకాలీన అంశాల పట్ల మాట్లాడాలి. విషయం గురించి తెలియకపోతే పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సంప్రదించి వివరాలు తెప్పించుకోండి. సోషల్ మీడియా వేదికగా వైసీపీ దుష్ప్రచారం నానాటికీ ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా మహిళలపై సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం అధికంగా ఉంది. దీని సమష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. జనసేన పార్టీ విలువలు గల పార్టీ. కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు తగిన ప్రాధాన్యం ఉంటుంది. అందరికీ ఒకేసారి పదవులు రావాలంటే వచ్చే పరిస్థితి లేదు. ప్రాధాన్యాలు సామాజిక వర్గాలు ఇతరత్రా అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. సంవత్సరంలోనే అన్నీ అయిపోవాలంటే ఎలా..? పార్టీని నమ్మండి.. బలంగా పని చేయండి. అందరికీ తగిన న్యాయం చేయాలన్నదే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. బలహీనవర్గాలు, మహిళలు, చేనేతలు, మత్స్యకారులు అలాగే సమాజంలోని వివిధ వర్గాల వారి సమస్యలు, అంశాల ప్రాతిపదికన ప్రతిరోజు నాయకులు మీడియాతో మాట్లాడండి. కూటమి స్ఫూర్తిని ప్రజల్లోకి జన సైనికులు, వీర మహిళలు బలంగా తీసుకువెళ్లాలి. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ ముందు ఉండాలి. ప్రజలకు మరింత చేరువ కావాలి” అన్నారు.
• పార్టీ సభ్యుల ఆలోచనలు, అభిప్రాయాలూ తెలుసుకొన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు
ఈ సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ సభ్యులు, మరి కొందరు కార్యకర్తల మనోభావాలు, అభిప్రాయాలూ తెలుసుకున్నారు. శ్రీ పవన్ కల్యాణ్ గారు రాండమ్ గా కొందరిని పిలిచి వారిని అభిప్రాయాలను తెలియచేయాలని సూచించారు. వారు చెప్పిన అంశాలపై స్పందించారు.
• రెండు తీర్మానాలకు ఆమోదం
ఈ సమావేశంలో రెండు తీర్మానాలు ప్రవేశపెట్టారు. జనసేన పార్టీకి, అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారికి తొలి నుంచి బలంగా నిలిచిన వీర మహిళలు, జన సైనికులకీ, సీట్ల సర్దుబాటును మనస్ఫూర్తిగా స్వాగతించి కూటమి విజయానికి కృషి చేసిన నాయకులకీ, 12 లక్షలకు పైగా క్రియా శీలక సభ్యత్వాలు చేయించిన క్రియా వాలంటీర్లకు, పార్టీ కోసం అభిమానంతో క్షేత్ర స్థాయిలో పని చేసున్న క్రియాశీలక కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ తీర్మానాన్ని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ టి.శివశంకర్ ప్రవేశపెట్టగా పార్టీ తెలంగాణ ఇంచార్జి శ్రీ నేమూరి శంకర్ గౌడ్ బలపరిచారు.
పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా సంస్కరణలు సంబంధించిన బాధ్యతను పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారికి అప్పగించి ఆయన తీసుకునే నిర్ణయాలను ఆమోదిస్తామని తెలుపుతూ తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు శ్రీ కొటికలపూడి గోవిందరావు ప్రవేశపెట్టగా పార్టీ పి.ఏ.సి. సభ్యుడు శ్రీ కోన తాతారావు బలపరిచారు.
