(4/12/2025,CHITTOOR, pvginox.com by PALLA VENUGOPAL )
ప్రజలకు మరింత చేరువయ్యేలా పంచాయతీరాజ్ వ్యవస్థ
• డీడీఓ కార్యాలయాల ద్వారా సంక్షేమ, అభివృద్ధి సమన్వయం
• ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న అధికారులకు పదోన్నతులు
• సులభంగా, సత్వరంగా ప్రజలకు సేవలందించేలా ఏర్పాటు
• నూతన సంస్కరణలతో సరికొత్తగా బాధ్యతలు
• గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర పంచాయతీలకు సహాయ సహకారాలు అందుతున్నాయి
• గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో నిధులను సక్రమంగా వినియోగించే బాధ్యత తీసుకున్నాము
• చిత్తూరులో డీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించి, రాష్ట్రంలోని 77 డీడీఓ కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
‘రాష్ట్రంలో 70 శాతం గ్రామాలే ఉన్నాయి. గ్రామీణ ప్రజానీకానికి పాలనా పరంగా సులభంగా, సత్వరంగా సేవలందించాలనేది ప్రధానం. ప్రభుత్వం అందించే సంక్షేమంతో పాటు, అభివృద్ధిని గ్రామీణ ప్రజలకు పారదర్శకంగా అందించడానికి డివిజనల్ డవలప్మెంట్ (డీడీఓ) కార్యాలయాలు వారధిలా పని చేస్తాయ’ని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. పాలనను సులభతరం చేసేలా, క్షేత్రస్థాయిలో వేగంగా కార్యకలాపాలు నిర్వహించేలా ఈ కార్యాలయాలు పని చేస్తాయన్నారు. ఒకేసారి రాష్ట్రంలో 77 డీడీఓ కార్యాలయాలను ప్రారంభించడం శుభ సంకేతమని తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేలా, నూతన మార్పులతో జీవో నంబరు 57, 58ను అనుసరించి రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 77 డీడీఓ కార్యాలయాలను వర్చువల్ పద్ధతిలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చిత్తూరు నుంచి గురువారం ప్రారంభించారు. కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో నర్సీపట్నం నుంచి అసెంబ్లీ స్పీకర్ శ్రీ అయ్యన్నపాత్రుడు గారు, తెనాలి నుంచి మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, ఆత్మకూరు నుంచి మంత్రి శ్రీ ఆనం రాంనారాయణరెడ్డి గారు, టెక్కలి నుంచి మంత్రి శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు గారు, పెనుకొండ నుంచి మంత్రి శ్రీమతి సవిత గారు, పలు చోట్ల ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… ‘‘గాధీజీ మాటలే స్ఫూర్తిగా గ్రామాలను పట్టుగొమ్మలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రజా పాలనకు అనుగుణంగా సంస్కరణలు తెస్తున్నాం. గత అయిదేళ్లలో పంచాయతీరాజ్ వ్యవస్థలో జరిగిన అన్ని పరిణామాలను మదింపు చేసి, అందరూ మెచ్చేలా సరికొత్త వ్యవస్థను తీసుకొస్తున్నాం. ఏళ్ల నుంచి పంచాయతీరాజ్ వ్యవస్థలో పదోన్నతులకు నోచుకోని సిబ్బందికి కూడా ఊరట నిస్తుంది.
• స్థాయిని పెంచి.. సేవలను విస్తరించే వ్యూహం
డీడీఓ కార్యాలయాల్లో ఆర్.డి.ఒ. స్థాయి అధికారిని నియమిస్తున్నాం. ఇప్పటి వరకు కేవలం జిల్లా పంచాయతీరాజ్ అధికారి పరిధిలోనే అన్ని జరిగేవి. ఇప్పుడు స్థాయిని పెంచి, సేవల విస్తృతిని పెంచుతున్నాం. పంచాయతీరాజ్ శాఖలోని అన్ని విభాగాల డివిజనల్ అధికారులు ఈ కార్యాలయం నుంచే సేవలందిస్తారు. పౌర సేవలు విస్తృతం చేసి ప్రజలకు చేరువయ్యేందుకు ఈ మార్పు దోహదపడుతుంది. ప్రతి పంచాయతీ.. స్వతంత్రంగా వ్యవహరిస్తూ, ప్రజల అవసరాలు తీరుస్తూ, స్థానిక సంస్థల దగ్గర సాధ్యం కాని పనులకు మాత్రమే ప్రభుత్వాలపై ఆధారపడేలా బలోపేతం చేయాలన్నదే లక్ష్యం. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో చేపట్టిన ఈ సంస్కరణలతో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయడానికి డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలు బలంగా పని చేస్తాయి.
• పదోన్నతుల్లో నాన్న జీవితమే నాకు స్ఫూర్తి
నాన్న ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ నుంచి అసిస్టెంట్ కమిషనర్ స్థాయికి రావడానికి ఏళ్ల సమయం పట్టింది. పంచాయతీరాజ్ పరిధిలోనూ దశాబ్దాలుగా పదోన్నతులు లేవని నేను శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత నా దృష్టికి వచ్చింది. దీనిపై పూర్తి పారదర్శకతను పాటిస్తూ పదోన్నతులు కల్పించే బాధ్యతను తీసుకున్నాం. సుమారు 10 వేల మందికి రాజకీయాలకు అతీతంగా, సిఫార్సులు, ఒత్తిళ్లు లేకుండా పదోన్నతులు కల్పించాం. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పని చేసే అధికారుల పదోన్నతులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. వి.ఏ.ఒ.గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన వారు వి.ఏ.ఒ.గానే రిటైర్ అయిన సందర్భాలున్నాయి. గ్రూప్ -1 ద్వారా ఎం.పి.డి.ఒ. గా నియమితులైన వారు ఏళ్ల తరబడి పదోన్నతి లేకుండా ఉండేవారు. సీనియారిటీ విషయాల్లో కోర్టు కేసులు ఉండి ఎటువంటి పదోన్నతికి నోచుకోక అధికారుల్లో నిర్లిప్తత ఉండేది. దీనిని పోగొట్టడానికి అనేక పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చాం.
• ప్రజలతో మమేకం కావడం సులభం అవుతుంది
మినీ కలెక్టరేట్లుగా డీడీఓ కార్యాలయాల్లో అన్ని రకాల సేవలు అందుతాయి. డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసుల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించడం చాలా సులభం అవుతుంది. కింది స్థాయిలో జరిగే అభివృద్ధిని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. ప్రభుత్వం ఆదేశాలను త్వరితిగతిన క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు, ఫలితాలు సాధించేందుకు కార్యాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయి. దీంతో అధికారులు ప్రజలకు మధ్య మరింత దగ్గర సంబంధాలు ఏర్పడతాయి. ఇది పాలన పరంగానే ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది.
గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగిన సహాయ సహకారాలు అందిస్తోంది. అక్కడి నుంచి వచ్చే నిధులను సక్రమంగా వినియోగించే విధిని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం చేపట్టింది. ఆ క్రమంలోనే స్థానిక సంస్థల పాలనలో పలు సంస్కరణలు తీసుకువస్తున్నాము. అందులో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పాలన వ్యవహారాలను సంస్కరించాం.
• గ్రామ పాలన మరింత పటిష్టం
ప్రతి డివిజన్లో డవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోని అన్ని విభాగాలను ఈ కార్యాలయంలో ఏర్పాటు చేశాం. తద్వారా మండల పరిషత్ పాలన, గ్రామ పాలన పటిష్టంగా చేయడానికి ఉపయోగపడుతుంది. గ్రామ పంచాయతీ స్థాయిలో 7,244 క్లస్టర్లు రద్దు చేసి 13,350 గ్రామ పంచాయతీలను స్వయం పాలన సంస్థలుగా మార్చడం ద్వారా పంచాయతీలకు స్వయం నిర్ణయం అధికారం వస్తుంది. అన్ని పంచాయతీల్లో పంచాయతీ సెక్రటరీని నియమించడం పాలన సులభం అవుతుంది. 10 వేలు జనాభా దాటిన గ్రామ పంచాయతీల్లో ఒక గెజిటెడ్ ఆఫీసర్ ను పంచాయతీ డెవలప్మెంట్ అధికారిగా నియమించడం ద్వారా అధికారుల బాధ్యత పెరుగుతుంది.
• పంచాయతీల పటిష్టతకు ఐ.టి. వింగ్
ఇప్పుడున్న అయిదు గ్రేడ్ల పంచాయతీ సెక్రటరీలను మూడు గ్రేడ్లుగా తగ్గించడం వల్ల పాలనా సౌలభ్యం జరుగుతుంది. పంచాయతీ స్థాయిని బట్టి వాటిలో శానిటేషన్ వింగ్, వాటర్ సప్లయ్ వింగ్, కంట్రీ ప్లానింగ్ వింగ్, స్ట్రీట్ లైటింగ్ అండ్ ఇంజనీరింగ్ వింగ్ , రెవెన్యూ వింగ్ ఏర్పాటు చేయడానికి ఆదేశాలు ఇచ్చాం. పంచాయతీల్లో ఏ విభాగం బాధ్యతలు ఆ విభాగానికి ప్రత్యేకంగా ఉంటాయి. పంచాయతీరాజ్ సంస్థలను పటిష్టం చేయడానికి ఒక ప్రత్యేక ఐ.టి. వింగ్ ఏర్పాటు చేశాం. పంచాయతీరాజ్ వ్యవస్థలో తీసుకొస్తున్న మార్పులను అధికారులు, సిబ్బంది అందిపుచ్చుకోవాలి. ప్రజలకు పాలన మరింత చేరువ అయ్యేలా, వారి మన్ననలు చూరగొనేలా పని చేయాల’’న్నారు.
• ఇదో విప్లవాత్మక నిర్ణయం : శ్రీ అయ్యన్నపాత్రుడు గారు, శాసనసభ స్పీకర్
పంచాయతీరాజ్ వ్యవస్థ ఏళ్ల తరబడి ఒకే రకంగా ఉండిపోయింది. దీనివల్ల మారుతున్న కాలానికి తగినట్టుగా సేవలు ప్రజలకు అందడం లేదు. దీన్ని కొత్త తరహాలో తీసుకురావాలన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అద్భుతం. పదోన్నతులు పారదర్శకంగా ఇవ్వడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం.
• సంస్కరణలు అందిపుచ్చుకోవాలి : శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి
పంచాయతీరాజ్ పాలనలో తీసుకొస్తున్న సరికొత్త సంస్కరణలను అందిపుచ్చుకోవాలి. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలి. ఈ సంస్కరణలతో పంచాయతీరాజ్ వ్యవస్థ సరికొత్త పుంతలు తొక్కి, ప్రజలకు మరింత చేరువ అవుతుంది.
• ప్రత్యేక భవనాలను నిర్మించే ఆలోచన చేయాలి : శ్రీ ఆనం రాంనారాయణ రెడ్డి గారు, దేవాదాయశాఖ మంత్రి
ఇదో సరికొత్త చరిత్రకు నాంది. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఏళ్ల తరబడి నిలిచిపోయిన పదోన్నతులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పచ్చ జెండా ఊపారు. దీంతో వేలాది మందికి ఊరట కలుగుతుంది. అలాగే డీడీఓ కార్యాలయాలకు కూడా భవనాలు నిర్మిస్తే అత్యుత్తమంగా ఉంటుంది.
• విభిన్నమైన ఆలోచన.. ఉత్తమ సంస్కరణ : శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు, వ్యవసాయశాఖ మంత్రి
ఇటు అధికారులు, సిబ్బందికి తగిన పదోన్నతులు ఇచ్చి, వ్యవస్థల్లోనూ మార్పు తీసుకొచ్చే ఆలోచన అత్యున్నతమైంది. కూటమి ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు ఎల్లపుడూ ప్రయత్నం చేస్తుంటుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిరంతరం దీనిపై మదింపు చేయడం శుభపరిణామం.
• సిబ్బంది ఉత్సాహంగా ఉన్నారు : శ్రీమతి సవిత గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి
పదోన్నతుల విషయంలో పంచాయతీరాజ్ సిబ్బంది చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇదే ఉత్సాహంతో అంతా కొత్త వ్యవస్థలో మరింత బాగా పనిచేయాలి. ప్రత్యేకంగా కార్యాలయాలు నిర్మించే ఏర్పాటు చేస్తే మినీ కలెక్టరేట్ లుగా ఇవి ప్రజలకు ఉపయోగపడతాయి.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు శ్రీ గురజాల జగన్మోహన్, శ్రీ కలికిరి మురళీ మోహన్, శ్రీ ఆరణి శ్రీనివాసులు, శ్రీ అరవ శ్రీధర్, చిత్తూరు మేయర్ ఎస్.అముద, చుడా ఛైర్మన్ శ్రీమతి కటారి హేమలత, పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణతేజ, కలెక్టర్ శ్రీ సుమిత్ కుమార్, చిత్తూరు ఎస్పీ శ్రీ తుషార్ దూడీ, హస్త కళల కార్పొరేషన్ ఛైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
• వినతులు స్వీకరణ
చిత్తూరు పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయానికి గురువారం విచ్చేసిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయానికి వెలుపల ప్రజల నుంచి నేరుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు వినతులు స్వీకరించారు.
[: కూటమి నాయకుల ఐక్యతే రాష్ట్రాభివృద్ధికి మూలం
- 15 ఏళ్లు ఇదే స్ఫూర్తి కొనసాగితే అభివృద్ధి సుస్థిరమవుతుంది
- వైసీపీ పాలనలో దిగజారిన వ్యవస్థలను తిరిగి నిలబెడుతున్నాం
- క్షేత్రస్థాయిలో ప్రజల గొంతుకగా మారుదాం
- చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉంటే కలిసి మాట్లాడుకుందాం
- చిత్తూరులో కూటమి పార్టీల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమైన ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
“వర్షించని మేఘం… శ్రమించని మేధావి” ఉన్నా, లేకపోయినా ఒక్కటే. అలాగే కూటమి ప్రభుత్వానికి ఇంత బలం ఉండి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా నిష్ప్రయోజనమే అని ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో సమూల మార్పులు తీసుకురావాలనే రాష్ట్రవ్యాప్తంగా 77 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసులు ప్రారంభించామని, ఏళ్ల తరబడి ప్రమోషన్లకు నోచుకోని 10 వేల మంది పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించగలిగామని అన్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా పదోన్నతి ఎంత కీలకమో తెలుసు కాబట్టే… ఎటువంటి పైరవీలకు తావు లేకుండా అర్హతే ఆధారంగా ఉద్యోగులకు పదోన్నతలు కల్పించామన్నారు. గురువారం చిత్తూరు రెడ్డిగుంట వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసును ప్రారంభించిన అనంతరం జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఈ రోజు కూటమి ప్రభుత్వం వ్యవస్థల ప్రక్షాళనపై ఇంత బలంగా ముందుకు వెళ్తుందంటే దానికి కారణం మీ అందరి మద్దతు. మీరు ప్రభుత్వానికి అండగా నిలబడడంతోనే ఇదంతా సాధ్యమైంది.
• మన ఐక్యతే రాష్ట్రానికి బలం
కూటమిలో ఉన్న మూడు పార్టీల నాయకులకు విభిన్న భావజాలాలు ఉన్నా… మనందరం “రాష్ట్రం బాగుండాలి- అరాచకాలు ఉండకూడదు ” అనే సదుద్దేశంతో ఒక గొడుగు కిందకు వచ్చి కూటమిగా ఏర్పడ్డాం. మనలో మనకు చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్, మనస్పర్థలు ఉండటం సహజం. ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు తీరతాయి. ఆ రోజు చిన్నగా మొదలుపెట్టిన కూటమి ఈ రోజు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఎంతో బలమైన శక్తిగా మారింది. ఈ రోజు ఇంతమందికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వగలిగామంటే కారణం మనందరి ఐక్యతే. ఇదే ఐక్యతతో మరో 15 ఏళ్లు కష్టపడితే రాష్ట్రానికి సుస్థిర అభివృద్ధి సాధ్యం అవుతుంది.
• కష్టపడితేనే… ప్రతిఫలం
నేను 2008 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఏనాడు కూడా గుర్తింపు కోరుకోలేదు. సమాజంలో నిస్సహాయులైన వ్యక్తులకు అండగా నిలబడడమే నాయకుడి లక్షణం. నిస్వార్థంగా మన పని మనం చేసుకుపోతే గుర్తింపు, పదవి వాటికవే వస్తాయి. అంతే తప్ప పదవే పరామావధిగా భావించి పని చేస్తే అందలం ఎక్కడం కష్టం. ఏ వ్యక్తికి అయినా పదవి అనేది బాధ్యత తప్ప అలంకారంగా మారకూడదు.
మన జిల్లాకే తలమానికం అయిన శేషాచలం అడవులను అడ్డగోలుగా దోచేశారు. ఇప్పటి వరకు దొరికిన సంపద కేవలం 10 శాతం మాత్రమే… దొరికిన పది శాతం విలువే వేలకోట్లలో ఉంటే… ఇప్పటి వరకు దొరకని సంపద విలువ ఎన్ని వేల కోట్లు ఉంటుందో మనం అర్ధం చేసుకోవచ్చు. అలాంటి వాళ్లను మనం నిలువరించాలి. అవినీతిని అరికట్టి బలహీనుల గొంతుగా మారాలి. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన శ్రీ చంద్రబాబు గారినే రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వం అని గత పాలకులు మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేయడానికి భయపెట్టాలని చూడటం మనం చూశాం. అయినా జనసేన ఎక్కడా తగ్గలేదు. పంచాయతీ ఎన్నికల్లో ప్రాణాలకు తెగించి నిలబడ్డారు. జనసేన పార్టీ ముఖ్య లక్ష్యం సమాజంలో కోల్పోయిన ధైర్యాన్ని నింపడం. ఆ దిశగా పార్టీ అడుగులు వేస్తుంది. కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకొని మరి గుర్తింపు ఇస్తాం. గ్రామ స్థాయి నుంచి లోక్ సభ నియోజక వర్గం వరకు ఐదుగురు సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేస్తాం” అన్నారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీ గురజాల జగన్మోహన్, శ్రీ అరణి శ్రీనివాసులు, శ్రీ కె. మురళీమోహన్, శ్రీ అరవ శ్రీధర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్, శ్రీకాళహస్తి ఆలయ ఛైర్మన్ శ్రీ కొట్టే సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
• స్వచ్ఛరథాలు పరిశీలన
స్వచ్ఛాంధ్ర స్ఫూర్తిని పల్లె ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి పంచాయతీరాజ్ శాఖ ఇటీవల ప్రయోగాత్మకంగా చేపట్టిన స్వచ్ఛరథాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు. తిరుచానూరు, కరకంబాడి పంచాయతీల నుంచి తీసుకొచ్చిన స్వచ్ఛ రథాల దగ్గరకు వెళ్లి ప్రజలకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు. పొడి చెత్త, పనికిరాని వస్తువులు తీసుకొస్తే ప్రజలకు అందిస్తున్న నిత్యావసరాలను పరిశీలించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని అధికారులను అభినందించారు.
