Site icon pvginox

పిఠాపురంలో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్

Spread the love

సంక్షేమం… అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయం
• కూటమి ప్రభుత్వం సమష్టిగా పని చేస్తుంది.. ప్రజలకు ఉపయోగపడుతుంది
• అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడమే మా లక్ష్యం

కూటమి ప్రభుత్వం సమష్టిగా పని చేస్తుందని, ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళుతుందని ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి మార్గదర్శకంలో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి నేతృత్వంలో కలిసి ముందుకు సాగుతామన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం పిఠాపురం ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా ఉన్నతీకరించే పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పిఠాపురంలో 9 నెలల్లోనే రూ.100 కోట్లపైగా అభివృద్ధి పనులు ప్రారంభించాం. ఎన్నికల ప్రచార సమయంలో పిఠాపురం ప్రజల కోరిక మేరకు 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చాం. ఆ హామీని నెరవేర్చే నిమిత్తం తొమ్మిది నెలల్లోనే రూ.34 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాం. అదే విధంగా నూతనంగా రెండు కొత్త బ్లాకులు, ఓపీ వార్డు, మార్చురీ వార్డు, డయాలసిస్, బ్లడ్ బ్యాంక్, ఆధునాతన మెషీన్లు అందుబాటులోకి తీసుకురానున్నాం. ఆసుపత్రిలో నూతనంగా డెర్మటాలజీ, ఈఎన్టీ, ఆప్తమాలజీ, రేడియాలజీ, పెథాలజీ విభాగాలు ఏర్పాటు చేసి అందుకు సంబంధించి 66 కొత్త పోస్టులు మంజూరు చేశాం. ఈ ఆసుపత్రి ద్వారా పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని 3 లక్షల మంది ప్రజలతోపాటు చుట్టు పక్కల ఆరు మండలాల ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందుతుంది. గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మాట నిలుపుకొనే ప్రభుత్వం. గతంలో గొల్లప్రోలు సభలో ఇచ్చిన హామీ మేరకు, నేడు ఉప్పాడ కొత్తపల్లి మండలంలో సామాన్య ప్రజలు తక్కువ ఖర్చుతో వివాహాలు జరుపుకొనేందుకు వీలుగా రూ.2 కోట్ల అంచనా వ్యయంతో టిటిడి కళ్యాణ మండప నిర్మాణానికి శంకుస్థాపన చేశాము. నిర్మాణ పనులు వేగంగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం. ఈ కళ్యాణ మండపం ద్వారా చుట్టు పక్కల గ్రామాలలో సుమారు పది వేల కుటుంబాలకు అతి తక్కువ రుసుముతో వివాహాది శుభకార్యాలు చేసుకునే సౌకర్యం లభిస్తుంది.
ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు చేబ్రోలు గ్రామంలోని 150 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో హరికథలు, చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకునేందుకు వీలుగా రూ. 48 లక్షల అంచనా వ్యయంతో కాలక్షేప మందిరం నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. దీని ద్వారా దేవాలయానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. గొల్లప్రోలు మండలంలోని సుమారు 225 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ప్రాకార మండప నిర్మాణానికి రూ . 1 కోటి 32 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాం. దీని ద్వారా దేవాలయానికి వచ్చే వేలాది మంది భక్తులకు సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.
• ఉచిత టార్పాలిన్లతో రైతులకు అండ
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బీసీలు, కాపు వర్గాల్లోని ఈడబ్ల్యూఎస్ వర్గాల మహిళల ఆర్ధాకాభివృద్ధి కోసం ఉచిత ప్రాథమిక కుట్టు మిషన్ల శిక్షణ పథకాన్ని ప్రారంభించింది. శిక్షణకు ఎంపికైన వారికి కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నాం. ఈ పథకంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోని 3,456 మంది మహిళలకు రూ. 8.64 కోట్ల విలువైన కుట్టు మిషన్లను ఈ రోజు పంపిణీ చేశాం. అకాల వర్షాల ప్రభావం నుంచి రైతులను ఆదుకునేందుకు, పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని చిన్న, సన్నకారు రైతుల ధాన్యాన్ని రక్షించేందుకు రూ. 26 లక్షల వ్యయంతో 2 వేల టార్పాలిన్లు రైతులకు ఉచితంగా అందజేశాం. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతుల సమయాన్ని ఖర్చులను తగ్గించే లక్ష్యంతో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 50 శాతం సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను అందిస్తున్నాం. ఈ మేరకు పిఠాపురం నియోజకవర్గo పరిధిలోని రైతులకు రోటోవేటర్లు, పవర్ టిల్లర్లు, స్ప్రేయర్లు తదితర పరికరాలను పంపిణీ చేశాం. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 25 వేల ఎకరాల్లో రైతులకు మేలు చేకూరుతుంది.
• ఉపాధి పనుల ద్వారా 5 వేల మంది శ్రామికులకు ఉపాధి
పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ఉపాది హామీ పథకం ద్వారా రూ.18.02 కోట్ల విలువ గల 31 కిలోమీటర్ల పొడవైన 276 సిమెంటు రోడ్లు, రూ. 3 కోట్ల వ్యయంతో నిర్మించిన 5 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు, రూ. 8.68 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 431 గోకులాలను నేడు ప్రారంభించాము. ఈ పనుల ద్వారా సుమారు 5000 మంది ఉపాధి శ్రామికులకు పని అందించాం. ఉపాధి హామీ పథకం పనుల ద్వారా సుమారు 20 గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానం చేశాం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే మంజూరైన రూ. 21.58 కోట్ల విలువైన రహదారి పనులు త్వరితగతిన పూర్తి చేస్తాము. ఈ పనుల ద్వారా 12 గ్రామాలకు ప్రధాన రహదారుల మధ్య అనుసంధానం ఏర్పడుతుంది. గౌరవప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సకాలంలో రాష్ట్రాలకి నిధులను సమకూర్చడం వల్ల ఇన్ని రకాల అభివృద్ధి పనులు చేయగలుగుతున్నాము.

Exit mobile version