Site icon pvginox

వై కా పా గంజాయి పాలన… హోమ్ మంత్రి అనిత

Spread the love

తేదీ: 03-03-2025,
అమరావతి.

గత వైసీపీ పాలనలో ఏపీ గంజాయిమయం : హోంమంత్రి వంగలపూడి అనిత

11వేల ఎకరాల గంజాయి సాగును 100 ఎకరాలకు నియంత్రించాం

గంజాయి నిర్మూలనకోసమే ప్రత్యేక ‘ఈగల్’ విభాగం

ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున 26 నార్కోటిక్ సెల్స్ ఏర్పాటు

40,088 కేజీల గంజాయి, 564 వాహనాల స్వాధీనం

గంజాయిపై 1972 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు

గంజాయి, డ్రగ్స్ అరికట్టడానికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం

స్కూళ్లు, బహిరంగప్రదేశాలలో సీసీ కెమెరాలతో గట్టి నిఘా

గంజాయి నిర్మూలనకై పంజాబ్, యూపీ విధానాల అధ్యయనం

కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నేతృత్వంలో ‘నిదాన్’ చట్టాల అమలు

విశాఖ వేదికగా అంతర్గత రాష్ట్రాల సమన్వయ సదస్సు నిర్వహిస్తాం

అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రశ్నలకు హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం

అమరావతి, మార్చి,03; గత వైసీపీ పాలనలో ఏపీ గంజాయిమయమైందని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో పంటల సాగు కన్నా గంజాయి సాగు, రవాణా ఎక్కువ జరిగిందన్నారు. 11 వేల ఎకరాల్లో జరుగుతున్న గంజాయి సాగును కూకటివేళ్లతో పెకిలించి 100 ఎకరాలకు నియంత్రించినట్లు ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 40,088 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు వాటికి సంబంధించిన 564 వాహనాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. గంజాయి సాగు, రవాణా, డ్రగ్స్ నిర్మూలనే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక ‘ఈగల్’ వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలలో భాగంగా సోమవారం ఎమ్మెల్యేలు రెడ్డప్పగారి మాధవిరెడ్డి, గల్లా మాధవి, తెనాలి శ్రావణ్ కుమార్, పళ్లా శ్రీనివాస్ తదితర సభ్యులడిగిన ప్రశ్నలకు హోంమంత్రి సమాధానమిచ్చారు. గంజాయి, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం కూటమి ప్రభుత్వం చేపడుతోన్న చర్యలను ఈ సందర్భంగా వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున 26 నార్కోటిక్ సెల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు హోంమంత్రి స్పష్టం చేశారు. ఏపీలోని ఏడు మండలాల్లోని 375 గ్రామాల్లో 20 హాట్ స్పాట్ లను గుర్తించి గంజాయి సాగును అంతమొందించినట్లు తెలిపారు. రికార్డు స్థాయిలో 46 లక్షల గంజాయి మొక్కలను వేళ్లతో సహా తొలగించడమే అందుకు నిదర్శనమన్నారు. గంజాయి సాగుకు అలవాటుపడిన కుటుంబాలను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 359 కుటుంబాలు ఇపుడు గంజాయికి బదులు ఇతర పంటలను పండిస్తున్నాయన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి గంజాయి రవాణాను అరికడుతున్నామన్నారు.

మంత్రి నారా లోకేశ్ చొరవతో స్కూళ్లలోనూ ఈగల్ కమిటీలు

హోం, ఈగల్ ఆధ్వర్యంలో అంతర్గత సమన్వయ సమావేశం కోసం స్టేట్ లెవల్ కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి అనిత తెలిపారు. డ్రై గంజాయి, లిక్విడ్ గంజాయి, గ్లూస్, వైట్నర్ వంటి మత్తు పదార్థాలపై నిఘా పెట్టామన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చొరవతో స్కూళ్లలోనూ ఈగల్ కమిటీల ఏర్పాటు చేసినట్లు ప్రస్తావించారు. బహిరంగ ప్రదేశాలు, స్కూళ్లలో గంజాయి వాడకం లేకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏపీలో ప్రభుత్వ, ప్రైవేట్ డీ ఎడిక్షన్ సెంటర్లు 44 ఉన్నాయన్నారు. జైళ్లలోనూ డీఎడిక్షన్ సెంటర్ల ఏర్పాటుకు కేంద్ర హోంశాఖ మార్గనిర్దేశం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 1972 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఈగల్ కు గంజాయి, డ్రగ్స్ పై సమాచారం అందించాలన్నారు. స్కూళ్లలో ఈగల్ టీంల ఏర్పాటు,వర్క్ షాప్ ల నిర్వహణ, సమన్వయ బాధ్యతలో ప్రజలు, ప్రతి ఎమ్మెల్యే భాగస్వామ్యం కావాలని హోంమంత్రి కోరారు. నేరాల నియంత్రణ తగ్గించడానికే గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నట్లు స్పష్టం చేశారు. డ్రోన్ టెక్నాలజీ, ఎడ్రిన్ శాటిలైట్, ప్రత్యామ్నాయాలతో గంజాయి సాగు అరికడుతున్నాం

గంజాయితో దొరికితే ఇకపై అంతే : హోంమంత్రి

కేంద్ర మంత్రిత్వ శాఖ నిదాన్ పోర్టల్ లో ఉన్న చాలా కఠినమైన నియమ,నిబంధనలను హోంమంత్రి సభ దృష్టికి తీసుకువచ్చారు. నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటా బేస్ అండ్ అరెస్టెడ్ నార్కోటిక్స్ అఫెండర్స్ (NIDAAN) పోర్టల్ లో ఒకసారి పేరు చేరితే పాస్ పోర్ట్ రాకపోవడం, ఆస్తులన్నీ జప్తు ఖాయమని స్పష్టం చేశారు. ఒక్కసారి గంజాయి కేసులో దొరికితే సమాజం నుంచి మనిషిని వెలివేసినట్లు కఠిన చట్టాలు రూపొందించారన్నారు. గంజాయి ఎంత ప్రమాదకరమో రూపొందించిన చట్టాల ద్వారా ప్రతి పౌరుడు అర్థం చేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ లోనూ గంజాయిలో పట్టుబడిన గత 25 కేసులలో 20 ఏళ్లకు పైన శిక్షను అమలు చేసిన విషయాన్ని వివరించారు. అనకాపల్లి, విజయనగరం జిల్లాలలోని కేసుల్లో ఆస్తులను సైతం జప్తు చేశారన్నారు. ఎన్డీపీసీ యాక్ట్ చాప్టర్ 5(ఎ) ప్రకారం ఆస్తుల జప్తు చట్టాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. గంజాయి ఉత్పత్తి, తయారీ, కొనుగోలు, నిల్వ, ఎగుమతి, దిగుమతి,రవాణా, సాగు, ప్రేరేపించడం, అనుమతించడం అన్నీ నేరమేనని హోంమంత్రి వెల్లడించారు. గంజాయి సాగును అరికట్టడంలో పంజాబ్, యూపీ రాష్ట్రాల చర్యలు ఆదర్శంగా ఉన్నాయన్నారు. ఇప్పటికే ఓ టీంను అధ్యయనం కోసం పంజాబ్ పంపుతున్నట్లు హోంమంత్రి సభలో తెలిపారు. ఏపీ సరిహద్దు రాష్ట్రాల డీజీపీలతో విశాఖ వేదికగా సమన్వయ సదస్సును త్వరలో నిర్వహిస్తున్నట్లు హోంమంత్రి పేర్కొన్నారు.

హోంమంత్రి అనిత సమాధానానికి ముందు డ్రగ్స్ వాడకంపై గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పలు అంశాలను శాసనసభ దృష్టికి తీసుకువచ్చారు. గంజాయి, మాదకద్రవ్యాలు, పెయిన్ కిల్లర్ల రూపంలో దొరుకుతున్న డ్రగ్స్ వాడకం గురించి మరో ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవిరెడ్డి (కడప) స్పందించారు. మెడికల్ షాపులు, కొరియర్ సర్వీసులపై నిఘాపెట్టాలని ఆమె హోంమంత్రిని కోరారు. గంజాయి సాగును కూటమి ప్రభుత్వం తగ్గించడంపై తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అభినందించారు. డ్రగ్స్ రూపం మార్చుకుని సమాజంలోకి వస్తుండడం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యూపీ ప్రభుత్వం తరహాలో గంజాయి సాగు, రవాణాను ప్రోత్సహిస్తే ఇల్లు కూలగొట్టాలని మరో ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (గాజువాక) కోరారు. డబ్బు కోసం సమాజాన్ని పెడదారిన పెడుతున్న గంజాయి కొరియర్లపై కఠిన చట్టాలు అమలు చేయాలన్నారు. వీరందరి ప్రశ్నలు, వారి నియోజకవర్గాల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై లేవనెత్తిన అంశాలకు హోంమంత్రి బదులిచ్చారు.

Exit mobile version