Site icon pvginox

30 ఏళ్ళు తానే సీఎం అనుకున్నాడు… జగన్ పై డిప్యూటీ సీఎం పవన్ పంచులు

Spread the love

[29/08, 20:44] (pvginox.com by PALLA VENUGOPAL )

సైద్ధాంతిక భావజాలం నమ్మి నిస్వార్థంగా నిలబడే జన సైనికులు, వీర మహిళలు పార్టీ బలం

జనసేన పార్టీ సైద్ధాంతిక భావజాలం కలిగిన పార్టీ. ఆ భావజాలాన్ని నమ్మిన బలమైన సమూహం కలిగిన పార్టీ. జనసేన కులం పార్టీ కాదు… కుటుంబ పార్టీ కాదు. ప్రజల ఆశలను ముందుకు తీసుకెళ్లే, బలమైన ఆశయాలు కలిగిన ప్రాంతీయ పార్టీ. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తామని జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన జన సైనికులు, వీర మహిళలు, వివిధ వృత్తి, వ్యాపార, ఉద్యోగ వర్గాల ప్రతినిధులతో శుక్రవారం జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “అక్రమ మైనింగ్, ప్రకృతి విధ్వంసం, అవినీతి అనేది వైసీపీ విధానాలు అయితే, ఉద్దానం కిడ్నీ సమస్యకు పరిష్కారం, రోడ్లు బాగుపడాలి అని గుడ్ మార్నింగ్ సీఎం సార్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం జనసేన పార్టీ విధానాలు. నలుగురు మెచ్చేవి, పదిమందికి ఉపయోగపడే అంశాలనే జనసేన పార్టీ ముందుకు తీసుకువెళ్తుంది. జీవితంలో ఒడిదొడుకులు, కష్టాలు ఎదుర్కొని నిలబడితేనే ప్రకృతి సహకరిస్తుంది. ప్రకృతి సహకరిస్తేనే భగవంతుడి ఆశీర్వాదం లభిస్తుంది.
జనసేన పార్టీ భావజాలాన్ని నమ్మే మనుషుల్ని కలుపుతుంది. మీరంతా ఇదే నమ్మకాన్ని కనబరుస్తూ ఇచ్చే బలంతో మీరు ఆశిస్తున్న విధంగా జాతీయ పార్టీ స్థాయికి ఎదిగేలా పని చేస్తాం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా, సిద్ధాంతాన్ని నమ్మే సమూహం కావాలి అన్నదే నా ఉద్దేశం. ఉద్దానం కిడ్నీ సమస్య గురించి మొదట్లో నాకు తెలియదు. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఐదారుగురు యువకులు దీనిపై పోరాడేందుకు ముందుకు వచ్చి సమస్యను నాకు తెలియజేశారు. సమస్య పరిష్కారం వెతికితే ఎక్కడో దగ్గర దారి దొరుకుతుంది. కదలిక మొదట చిన్నగా ఉండొచ్చు. కానీ దానిపై పోరాటం మొదలు పెడితే అందర్నీ కదిలిస్తుంది. ఉద్దానం ప్రాంతంలో భూగర్భ జలాలు తవ్వాల్సిన లోతు కంటే చాలా లోతుగా తవ్వడంతో తాగడానికి పనికి రాని నీరు తాగడం వల్ల కిడ్నీలు వాటిని డయగ్లోసిస్ చేయలేక కిడ్నీ సమస్యలు తలెత్తాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాల లేమి తో ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఉద్దానం కిడ్నీ సమస్యను ప్రపంచానికి తెలియజేసి పాలకులను కదిలించేలా మనం పోరాడగలిగాం అంటే దానికి మూలం అయిదారు మంది యువతే. సమస్యపై పోరాడడానికి తెగువ, ధైర్యం ఉండాలి. అలాంటి సమూహాన్ని తయారు చేయాలన్నదే నా కల.
• సినిమా అభిమానాన్ని వ్యవస్థీకృతం చేయాలి
సినిమా మాధ్యమం నా బలం. కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించి పెట్టిన రంగం. సినిమాల్లో నటించకుండా ఉంటే రాజకీయంగా ఈ స్థాయికి రావడానికి నాకు సుమారు 30, 40 ఏళ్లు పట్టేది. ఇంతటి అభిమాన బలాన్ని రాజకీయంగా వ్యవస్థీకృతం చేయాలి. బయటకు రావాలంటే గతంలో అభిమానుల తాకిడి చాలా బలంగా ఉండేది. తోపులాటలు జరిగేవి. నేను రాజకీయంగా ఒక బలమైన సిద్ధాంతం నమ్మి, ఒక భవిష్యత్తు రాజకీయ వ్యూహంతో వస్తే నాకు అభిమాన బలం ఎంత అండగ నిలిచిందో, ఒక్కోసారి అదే అభిమానం అడ్డంకిగా మారింది. ఇప్పుడు సినిమా అభిమాన బలాన్ని మెల్లగా జనసేన పార్టీ రాజకీయ వ్యవస్థీకృత సైన్యంగా తయారు చేయాలి. ఇప్పుడు చాలామంది నిబద్ధత గల నాయకులుగా మారి 1000 నుంచి 10000 మందిని కదిలించే శక్తిని సంపాదించారు. ఇది మరింత పెరగాలి. మన కష్ట కాలంలోనే మనవాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు అని తెలుస్తుంది. పార్టీలోకి వచ్చిన తర్వాత పెద్దలు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పార్టీ కోసం చూపిన చొరవ, తీసుకున్న బాధ్యత బలమైనవి. నిరంతరం పార్టీ కార్యకర్తలతో నాయకులతో ఆయన మమేకమైన తీరు వేల కట్టలేనిది.
• ఎవరో ఒకరికి బాధ్యత అప్పగించడం నా ఉద్దేశం కాదు
పార్టీ సంస్థగతంగా ఎందుకు బలోపేతం చేయలేకపోతున్నాము అని చాలామంది అడుగుతారు. జనసేన పార్టీని స్వచ్ఛందంగా భుజం మీద వేసుకొని నడిపిస్తున్న వాళ్లు జన సైనికులు, వీర మహిళలే. వారు పార్టీకి ఉన్న బలం. ఎలాంటి స్వార్థం లేకుండా ఒక భావజాలాన్ని నమ్మి పార్టీని ముందుకు నడిపిస్తున్నది వారే. పార్టీ సంస్థాగతంగా ఎవర్నో ఒకరిని తెచ్చి నియమించడం నాకు ఇష్టం లేదు. పార్టీ సిద్ధాంతాలతో పదిమందిని కలిపే శక్తీ, ఎన్ని కష్టాలు ఎదురైనా పార్టీ జెండాను వదలని తెగువ ఉన్నవారితో పార్టీ నిర్మాణం జరగాలి అన్నది నా ఆకాంక్ష. అప్పుడే పార్టీ పునాదులు బలంగా ఉంటాయి. గతంలో పార్టీ మీటింగుల్లో అరుపులు, కేకలు, ఒక రకమైన ఉక్కిరిబిక్కిరి వాతావరణం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి మెల్లగా తగ్గి ఆలోచనలకు పునాది వేస్తూ ముందుకు తీసుకువెళ్లే స్థాయికి ఎదిగాం.
• జాతి ఉన్నతే జనసేన లక్ష్యం
దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ప్రతి పార్టీ ఏదో ఒక ప్రత్యేకమైన కారణంతో, తమకు అన్యాయం జరిగిందనో, తమ ప్రాంతానికి అన్యాయం జరిగిందనో పురుడు పోసుకున్నవే. జనసేన పార్టీ మాత్రం జాతి ఉన్నతిని, దేశ సంక్షేమాన్ని ఆలోచించి నెలకొల్పిన పార్టీ. నా సిద్ధాంతాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. జనసేన పార్టీ ఏడు సిద్ధాంతాలు వెంటనే పూర్తయిపోతాయి అని కాదు.. వాటి వల్ల అందరికీ మేలు జరగాలి అన్నదే కీలకం. సుదీర్ఘంగా లక్ష్యాలు ఉన్నప్పటికీ వాటిని సాధించే భావజాలం జనసేన పార్టీ సమూహానికి ఉంది. చాలామంది రాజకీయ పండితులు పార్టీ సిద్ధాంతాలు చూసి, వీటివల్ల ఓట్లు వచ్చే పరిస్థితి ఉండదని చెప్పారు. ఒక కులం ఆధారంగా లేదా మతం ఆధారంగా, ప్రజల భావోద్వేగ సమస్యను తీసుకొని సిద్ధాంతాలుగా పెడితేనే బాగుంటుందని సూచించారు. కానీ జనసేన పార్టీ ఏడు సిద్ధాంతాలు దేశం కోసం, జాతి సంక్షేమం కోసం రూపొందించినవి. ఆశలు లేకుండా ఆశయాలు నమ్ముకున్న వాడేరంగంలో అయినా ముందుకు వెళ్తాడు. పదవులు పొందిన రాజకీయ నాయకులు దాన్ని కచ్చితంగా బాధ్యతగా తీసుకోవాలి. క్షేత్రస్థాయిలోని జనసైనికులు వీర మహిళల బాధలు వినాలి. పదవి వచ్చింది అంటే అది ఒక్కరికే కాదు. ఆ పదవిని పొందడానికి వెనుక లక్షలాది జనసైనికులు, వీర మహిళల కష్టం ఉందని గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు నిలబడితే ఎవరైనా తల వంచాల్సిందే. ప్రజాస్వామ్య విలువలను కాపడటానికి జనసేన పార్టీ పాటు పడుతుంది.
• పార్టీని వదిలేయలేదు.. పాలనపై పట్టు పెంచుకున్నా
కూటమి ప్రభుత్వం రాగానే నేను జనసేన పార్టీని వదిలేశాను.. కార్యకర్తలను పట్టించుకోవడం లేదు అని రకరకాల మాటలు ప్రచారంలోకి వచ్చాయి. ప్రభుత్వ పాలనలో నాకు అనుభవం లేదు. పాలన గురించి పూర్తిగా తెలియదు. చిన్న పిల్లాడు ఈత నేర్చుకున్న విధంగా పాలనలో ప్రతి రోజు కొత్త విషయాలను తెలుసుకున్నాను. దీనికి ఎనిమిది, పది నెలల సమయం పట్టింది. అయితే ఎప్పటికప్పుడు పార్టీ పరిస్థితిని, క్షేత్రస్థాయిలో పార్టీ ముందుకు వెళ్తున్న తీరును తెలుసుకుంటున్నాను. జనసేన పార్టీకి స్థాయి, సత్తా గల బలమైన నాయకత్వం ఉండాలి. వార్డు స్థాయి నాయకుడి దగ్గర నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరకు బలమైన నాయకత్వం తయారు చేయాలి. 2008 నుంచి మొదలైన నా రాజకీయ ప్రయాణంలో ఎన్నో చూసాను. 2009లో ఒక పార్టీ ప్రయాణం ప్రారంభానికి రాష్ట్రం నలువైపుల నుంచి 18 నుంచి 20 లక్షలు మంది జనం తరలి వచ్చారు. ఆ బలం ఎందుకు వీగిపోయింది అన్న వేదన నుంచి కొత్త రాజకీయ ఆలోచన మొదలైంది. బలమైన సిద్ధాంత భావజాలం మాత్రమే రాజకీయ పార్టీని ముందుకు తీసుకువెళ్తుంది అని నమ్మాను. నేను సిద్ధాంతాన్ని ఎంత బలంగా నమ్మి, ఆచరిస్తానో అంతే బలంగా ముందుకు తీసుకువెళ్తాను. జనసేన పార్టీలో సరైన వ్యక్తులకు సరైన బాధ్యతలు అప్పగించాలి అన్నదే ఆలోచన. వార్డు సమస్య కూడా నా వరకు వచ్చింది అంటే క్షేత్రస్థాయిలో నాయకత్వం సరిగా పనిచేయలేదని అనుకోవాలి. ఏ స్థాయి సమస్యలు ఆ స్థాయి నాయకులు వెంటనే పరిష్కరించేలా దానికి దారి చూపేలా ఉండాలి. అలాంటి నాయకత్వం తయారు కావాలి.
• తప్పనిసరి పరిస్థితుల్లోనే సినిమాలు చేస్తున్నా
పోరాట యాత్రలో భాగంగా సినిమాలు మానేద్దామని భావించాను. అయితే తర్వాత నా సిద్ధాంతాలు, భావజాలాన్ని బతికించుకోవాలంటే జనసేన పార్టీ ప్రయాణం కచ్చితంగా ఉండాలి అని నిర్ణయించుకొని, పార్టీని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో సినిమాలు తప్పనిసరై చేస్తున్నాను. పది మందికి తోడ్పడాలి అంటే రాజకీయ ప్రయాణం తప్పనిసరి అని భావించి పార్టీ కోసమే సినిమాలు చేశాను. నన్ను కూడా చాలామంది నమ్మలేదు. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు గుర్తించిన తర్వాతే చాలామందికి పవన్ కళ్యాణ్ అంటే నమ్మకం వచ్చింది. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి పరిస్థితులు, అప్పటి రాజకీయ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. మన పరిస్థితులు పూర్తిగా వేరు. ప్రతి కష్టం నన్ను పలకరించింది. ఎన్నో వేదనలు, అవమానాలు, అవహేళనలు జయించి ముందుకు నడిచాను. ఈ ప్రయాణంలో ప్రతి అడుగున తోడు ఉంది జనసైనికులు, వీర మహిళలే.
• మారింది వాళ్లు… మేము కాదు
జనసేన మూల సిద్ధాంతాల వెనుక ఎంతో మేథోమధనం జరిగింది. పార్టీ ప్రారంభించి దశాబ్ద కాలం అయింది. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా నమ్ముకున్న సిద్ధాంతాలు, భావజాలాన్ని వదల్లేదు. నాకు ఎంతో ఇష్టమైన వామపక్ష నాయకుడు ‘‘తమ్మి నువ్వు మారిపోయావు. మమ్మల్ని వదిలేశావు’’ అని మాట్లాడారు. నేను మిమ్మల్ని వదిలేయలేదు. మీరే మీ సిద్ధాంతాలను వదిలేశారని చెప్పాను. మహారాష్ట్రలో స్వరాజ్యం నా జన్మ హక్కు అనే బాలగంగాధర తిలక్ నినాదం నుంచి మహారాష్ట్ర మరాఠిలదే అనే వరకు వచ్చింది. రాష్ట్రాల పునర్ విభజనకు మేము పూర్తి వ్యతిరేకం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు భాగాలుగా విభజించింది. కారణాలు ఏమైనా మార్పు చెందారు. నోరుంది, ఆర్థిక బలం ఉంది కనుక మీరు ఏం చేసినా చెల్లుబాటు అయ్యింది. మేము మాత్రం ఇంకా తిలక్ నినాదం వద్దే ఆగిపోయాము. మహారాష్ట్రలో ఎవరికైనా అన్యాయం జరిగినా మా కడుపు మండుతుంది. బంగ్లాదేశ్ లో హిందువులకు అన్యాయం జరిగినా మా కడుపు మండుతుంది. ఇదే నా చివరి రోజు అనే రాజకీయాల్లోకి వచ్చిన రోజే నిర్ణయించుకున్నా. అలానే బతుకుతున్నా. సమాజం, ప్రజలు అంటే అంత పిచ్చి ఉండబట్టే పార్టీని దశాబ్ధ కాలంగా నడుపుతున్నాను. నాలుగు దశాబ్ధాలుగా తెలుగు రాజకీయాలను గడగడలాడించిన పార్టీ నాయకుడిని జైల్లో ఉంచితే ఎవరూ రాలేదు.. మనం నిలబడ్డాం.
విశాఖలో మనల్ని నిర్బంధిస్తే ధైర్యంగా ఎదుర్కొన్నాం. మన మీద ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టే … ఆ రోజు చంటి బిడ్డను చంకలో పెట్టుకొని ఓ తల్లి మనకు అండగా రోడ్డు మీద నిలబడింది.

• ప్రజా ధనం దుర్వినియోగం చేసి రుషికొండపై భారీ భవంతులు కట్టుకున్నాడు
• అహంకారంతో నియంతృత్వ పోకడలకు పోయాడు.. అందుకే ప్రజలు సమయం చూసి బుద్ది చెప్పారు
• కూటమి ప్రభుత్వం బాధ్యతతో పాలిస్తుంటే… బురద చల్లాలని చూస్తున్నారు
• కూటమి పాలనలో ఎవరికీ అన్యాయం జరగదు
• జన సైనికులు, వీర మహిళలు కూడా బాధ్యతగా వ్యవహరించాలి
• పార్లమెంటరీ స్థాయి జన సైనికులు, వీర మహిళల ప్రత్యేక సమావేశంలో పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు

గత ముఖ్యమంత్రి రాష్ట్రానికి తానే శాశ్వత ముఖ్యమంత్రిని అనుకున్నాడు. 30 ఏళ్లు తానే పాలిస్తానని భావించి రూ. 450 కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం చేసి భారీ భవంతులు కట్టుకున్నాడు. వ్యవస్థలను దుర్వినియోగం చేసి నేను చెప్పిందే జరగాలి అన్నట్టు అహంకార పూరితంగా ప్రవర్తించాడు. చివరికి వరకు ఆ అరాచకాలన్నీ భరించిన ప్రజలు సరైన రీతిలో జవాబు చెప్పారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. అంకిత భావంతో పని చేయాల్సిన నాటి ముఖ్యమంత్రి.. వ్యవస్థలను సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని దోచేశారన్నారు. అబద్దాలతో మోసం చేద్దామనుకున్న వ్యక్తికి ప్రజలు సరైన సమయంలో, సరైన రీతిలో బుద్ది చెప్పారని తెలిపారు. జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో భాగంగా శుక్రవారం పార్టీ అధ్యక్షుల వారితో 25 పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి వచ్చిన జన సైనికులు, వీర మహిళలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ… “గత పాలకులు రుషికొండపై రిసార్టు అభివృద్ధి చేస్తున్నామని చెప్పి నిధులు దుర్వినియోగం చేశారు. రూ.12 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్ర ఖజానాలో రూపాయి లేకుండా చేశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం బాధ్యతగా పరిపాలన చేస్తుంటే ఏదో ఒకటి చెప్పి బురద చల్లాలని చూస్తున్నారు. వారు అధికారంలో ఉండగా నెల రోజుల్లో ఏడు లక్షల పింఛన్లు పెంచేశారు. వారి పార్టీ కార్యకర్తలను సైతం లబ్దిదారుల జాబితాలో చేర్చేశారు. అప్పట్లో ఈ వ్యవహారాన్ని జనసేన పార్టీ బయటకు తీసింది. కూటమి ప్రభుత్వం ఇప్పుడు నకిలీ లబ్దిదారులను వడపోస్తుంటే విమర్శలు చేస్తున్నారు. నాలుగు లక్షల దివ్యాంగుల పింఛన్లు కరెక్టు కాదు అని నిర్ధారిస్తే ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. వారు చేసిన పనులకే జనం ఛీ కొట్టారు. కూటమి ప్రభుత్వంలో అర్హత ఉన్న ఏ లబ్దిదారుడికీ అన్యాయం జరగదు. డాక్టర్ నిర్ధారించిన ప్రతి దివ్యాంగుడికీ రూ. 6 వేల పింఛన్ వస్తుంది.
• జనసేన ఎప్పుడూ బాధ్యతగానే వ్యవహరిస్తుంది
జనసేన పార్టీ ఎప్పుడూ బాధ్యతగా ప్రవర్తిస్తుంది. అందుకే జనసైనికులుగా నేడు మనమంతా తలెత్తుకు తిరుగుతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా గోతుల మయంగా మారిన రహదారుల దుస్థితిని తెలియజేసేందుకు, నిద్ర మత్తులో ఉన్న గత ముఖ్యమంత్రిని నిద్ర లేపేందుకు గుడ్ మార్నింగ్ సీఎం అని కార్యక్రమం పెడితే.. రాష్ట్రం మొత్తం గోతుల రోడ్లే ఉన్నాయని అందరికీ తెలిసింది. అధ్యక్షుల వారి పిలుపు మేరకు ప్రతి జన సైనికుడు ధైర్యంగా రోడ్ల ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. మన నాయకులు కార్యకర్తల మీద కేసులు పెట్టారు. వీర మహిళల మీద దాడులు చేసి ఇంటి నుంచి బయటకు కూడా రానివ్వకుండా ఇబ్బంది పెట్టారు. అలా చేస్తే మన బలం తగ్గిపోతుందని భ్రమపడ్డారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆ ప్రయత్నం నాడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విశాఖలో భవన నిర్మాణ కార్మికుల కోసం పోరాటం చేస్తే లక్షల్లో జనం మద్దతుగా తరలివచ్చారు. అమరావతి రైతుల కోసం జనసేన నిలబడింది. పొత్తు ఖరారు కాక ముందే ఢిల్లీ వెళ్లి బీజేపీ అధినాయకత్వాన్ని కలసి అమరావతిని కాపాడాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా తొందరపాటుగా తీసుకోరు. రాజకీయ లబ్ది కోసం మాట్లాడరు. సమస్యపై పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే మాట్లాడుతారు. నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రం చివరి వరకు నిలబడతారు. అధ్యక్షుల వారి స్ఫూర్తిని జనసైనికులతా ముందుకు తీసుకువెళ్లాలి.
శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా రికార్డు స్థాయి గ్రామ సభలు నిర్వహించి పల్లె బాట ద్వారా గ్రామాల్లో 3000 కిలోమీటర్లు సిమెంటు రోడ్లు నిర్మించారు. అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా ఏడాది కాలంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో గిరిజన ప్రాంతాల్లో సాధించిన అభివృద్ధిని ప్రజలంతా చూస్తున్నారు.
• శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానంలో మొదటి నుంచి ఉంది మీరే
ఇప్పడు మనం కూటమి భాగస్వామ్య పక్షంగా ఉన్నాం. ప్రతి అడుగులో జాగ్రత్తగా ఉండాలి. అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు చేరువ చేసే అంశంలో మనమంతా బాధ్యతగా వ్యవహరించాలి. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రస్తానంలో మీరంతా మొదటి రోజు నుంచి ఉన్నారు. పార్టీ జెండాను మోశారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. 2014 పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన్ను ఉన్నత స్థానంలో చూడాలన్న ఉద్దేశంతో పార్టీకి నిలబడ్డారు. పార్టీ బలోపేతం కోసం అహర్నిసలు కృషి చేశారు. అధికారం లేకపోయినా జనసేన పార్టీ చేసిన పోరాటాలు వర్తమాన రాజకీయాల్లో పార్టీ చేయలేదు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రానికి మెరుగైన పాలన అందించాలని, మార్పు తీసుకురావాలన్న తపనతో మీరంతా పని చేశారు. మీరు చేసిన త్యాగాలే నేడు 100 శాతం స్ట్రయిక్ రేట్ తో విజయం సాధించాం. మీ పనికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్దాం” అన్నారు.

Exit mobile version