Uncategorized

అభివృద్ధి మా అజెండా… మంత్రి కందుల దుర్గేష్

Spread the love

గుంటూరు జిల్లా సర్వతోముఖాభివృద్ధి కి కట్టుబడి ఉన్నాం

రాష్ట్రంలో కీలకమైన గుంటూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం

ఇంచార్జి మంత్రి గా జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి

(గుంటూరు, 28/1/2025,pvginox.com )

గుంటూరు జిల్లా ఇన్ చార్జ్ మంత్రి మరియు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన మంగళవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ లోని ఎస్. ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా సమీక్షా కమిటీ సమావేశం జరిగింది.. ఈ సందర్భంగా వ్యవసాయం, అనుబంధ రంగాలు, మార్కెటింగ్, పౌర సరఫరాలు, ఉద్యాన శాఖ, మత్స్య శాఖ, పశు సంవర్ధక శాఖ, పరిశ్రమలు, స్కిల్, గృహ నిర్మాణం, వైద్య, గుంటూరు నగరపాలక సంస్థ యంటీయంసీ హౌసింగ్, డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ, మెడికల్ అండ్ హెల్త్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఆర్ అండ్ బి, విద్యా శాఖలపై మంత్రి దుర్గేష్ సమీక్షించారు. గుంటూరు జిల్లా ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తిస్థాయిలో చర్చించామని, స్పష్టమైన కార్యాచరణ రూపొందించుకొని మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో కలిసి, వారి సూచనలు పరిగణలోకి తీసుకొని జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామన్నారు.

ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్
మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు.. ఈ అంశంలో అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయము చేసుకోవాలని సూచించారు.. ప్రభుత్వ సంక్షేమ గణంకాలను ఎమ్మెల్యేలకు తెలపడం ద్వారా ప్రభుత్వం ప్రజలకు ఎంత సంక్షేమం అందిస్తుందో తెలుస్తుందన్నారు..

రెవిన్యూ, వ్యవసాయ శాఖ, బ్యాంకర్లు సమన్వయంతో వ్యవహరించాలని మంత్రి దుర్గేష్ ఆదేశించారు.. కౌలు రైతుల రక్షణ కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. త్వరలోనే ప్రభుత్వం కౌలు రైతుల కోసం కొత్త చట్టం తెస్తుందన్నారు.. కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు, రుణాల విషయంలో బ్యాంకర్లు కౌలు రైతులని ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు.. మార్చి 15 లోగా సంబంధిత సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు..

దుగ్గిరాల శుభం కోల్డ్ స్టోరేజ్ వల్ల ధాన్యం నష్టపోయిన రైతాంగానికి
నష్టపరిహారం, ప్రత్తి పంటకు మద్దతు ధరపై చర్చిస్తున్నామన్నారు.మినీ గోకులాలు, పశు ఆరోగ్య శిబిరాల పై మంత్రి మాట్లాడారు

గుంటూరు చానల్ విస్తరణ, కాలువల ఆధునీకరణ తద్వారా వ్యవసాయ రంగంలో అదనపు నీటి సౌకర్యం అంశం పై మంత్రి అధికారులతో చర్చించారు..

నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం తెచ్చిన నూతన ఇండస్ట్రీయల్ పాలసీపై అవగాహన కల్పించాలన్నారు..

మన బడి- మన భవిష్యత్ లో జరుగుతున్న పనుల పురోగతిని మంత్రి దుర్గేష్ అడిగి తెలుసుకున్నారు..

పీఎంఏవై క్రింద రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో అందించే గృహాల వివరాలను మంత్రి దుర్గేష్ అడిగి తెలుసుకున్నారు.. త్వరితగతిన ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు..

గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి లో అందుతున్న వైద్య సేవలపై మంత్రి దుర్గేష్ ఆరా తీశారు.. చాలా ప్రాంతాలనుండి వైద్యం కోసం వచ్చే పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంలో వైద్యులు కృషి చేయాలన్నారు.. బర్న్స్ వార్డ్ స్థితిగతులని అడిగి తెలుసుకున్నారు..

గుంటూరు జిల్లాలో గుంతలరహిత రోడ్ల స్థితిగతులపై మంత్రి దుర్గేష్ అధికారులను ఆరా తీశారు. జిల్లాలో 335 కి. మీ రోడ్లు(65శాతం) మేర ప్యాచ్ వర్క్ పూర్తి అయిందని ఫిబ్రవరి 15 నాటికి మిగితా పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు..గడిచిన ఐదేళ్లలో తట్టెడు మట్టి వేయలేదని మంత్రి విమర్శించారు. కొత్త రోడ్లు వేయాలంటే అవసరం అయిన నిధుల కోసం కృషి చేస్తామన్నారు..

మంత్రి నాదెండ్ల మనోహర్ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 1.48 కోట్ల తెల్ల రేషన్ కార్డులు, 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్ లు ఉన్నాయన్నారు. వీటిని అనుసంధానం చేయకపోవడం వల్ల 8 లక్షల గ్యాస్ కనెక్షన్ లు అధికంగా ఉన్నట్లు గుర్తించామన్నారు.. వచ్చే వారంలో గ్రామ, వార్డు సచివాలయాలకు ఈ బాధ్యత అప్పగించి సమస్యను పరిష్కారిస్తామన్నారు.రాష్టంలో 87 లక్షల పై చిలుకు గ్యాస్ సిలిండర్ లు లబ్ధిదారులకు అందించామన్నారు. గుంటూరు జిల్లాలో 3.83 లక్షల ఉచిత గ్యాస్ సిలిండర్ లు పంపిణీ చేశామన్నారు..అంతిమంగా ఎక్కువ మంది వినియోగదారులకు లబ్ధి చేకూర్చాలన్నదే ప్రభుత్వ ధ్యేయం అన్నారు..రేషన్ వాహనాల (MDU) విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటిని ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై చర్చిస్తామన్నారు..

ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలపై అధికారులు వర్క్ షాప్ లు నిర్వహించాలని, ప్రజలకు పథకాలపై అవగాహన కల్పించాలని ఎప్పటికప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల గురించి తెలపాలని కోరారు.. పనుల ఆలస్యానికి అధికారులు స్పష్టమైన కారణాలు చెప్పాలని ప్రజా ప్రతినిధులు వెల్లడించారు…ప్రజల జీవన ప్రమాణాలు పెంచుదామన్నారు..

గుంటూరు జిల్లా సమీక్ష సమావేశంలో రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్, ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ, కేఎస్ లక్ష్మణ రావు, మురుగుడు హనుమంత్ రావు, కల్పలతా రెడ్డి, ఏసురత్నం, కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, జేసీ భార్గవ్ తేజ్, డిఆర్వో ఖాజావలి, గుంటూరు మునిసిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *