రాజకీయ ఉనికి, పబ్లిసిటీ కోసమే ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పై తప్పుడు ఆరోపణలు
సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ వ్యాఖ్యలను ఖండించిన టిడిపి ఎన్టీఆర్ జిల్లా నాయకులు
బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలని హెచ్చరిక
దమ్ము, ధైర్యం వుంటే చేసిన ఆరోపణలు నిరూపించాలని డిమాండ్

( విజయవాడ, 31/1/2025,pvginox.com ):
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తూ ఎన్టీఆర్ జిల్లాను అభివృద్ది పథంలోకి నడిపించేందుకు నిజాయితీగా, నిబద్దత, క్రమశిక్షణలతో నిరంతరం కృషి చేస్తున్న ఎంపి కేశినేని శివనాథ్ పై కేవలం తన రాజకీయ ఉనికిని కాపాడుకోవటం కోసం, పబ్లిసిటీ కోసమే సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ తప్పుడు ఆరోపణలు చేశాడంటూ ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ, విజయవాడ అర్బన్ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు జి.వి.నరసింహరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దోనేపూడి శంకర్ చేసిన ఆరోపణలు అర్ధరహితమంటూ ఖండించారు.
ఎంపి కేశినేని శివనాథ్ పై తప్పుడు ఆరోపణలు చేసిన దోనేపూడి శంకర్ వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ, విజయవాడ అర్బన్ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు జి.వి.నరసింహరావు మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా సొంగా సంజయ్ వర్మ మాట్లాడుతూ వైసిపి నాయకుల మోచేతి నీళ్లు తాగుతూ ఎంపి కేశినేని శివనాథ్ పై చేసిన ఆరోపణలు దమ్ము, ధైర్యం వుంటే నిరూపించాలని డిమాండ్ చేశారు. రాజకీయం ఒక స్థాయిలో వున్న దోనేపూడి శంకర్ ఉచిత ఇసుక విధానం గురించి అవగాహన లేకుండా మాట్లాడటం హాస్యస్పదంగా వుందన్నారు. శంకర్ చేసిన వ్యాఖ్యలు గమనిస్తే బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తెరదీసినట్లుగా అనిపిస్తుందన్నారు. గత ఐదేళ్లలో లేని విధంగా ఎన్టీఆర్ జిల్లాలోని ఉన్నతాధికారులందరూ ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం సక్రమంగా సరఫరా అయ్యే విధంగా చూస్తున్నారని తెలిపారు.
జగన్ పాలనలో ఇసుక కొరత ఏర్పడి పేద ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అప్పుడు వైసిపి నాయకులను శంకర్ ఎందుకు నిలదీయలేకపోయాడంటూ ప్రశ్నించారు. దోనేపూడి శంకర్ రాజకీయం జీవితం అంతా ఒకరి మోచేతి నీళ్లు తాగుతూ ఆరోపణలు చేయటం అలవాటుగా మారిందని విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా అభివృద్ది కోసం నిరంతరం శ్రమించే ఎంపి కేశినేని శివనాథ్ పై ఆరోపణలు చేయటం అంటే దోనేపూడి శంకర్ రాజకీయ భవిష్యత్తుకి ప్రజలు చరమగీతం పాడే రోజు దగ్గర పడిందని హెచ్చరించారు. శంకర్ నిజమైన రాజకీయ నాయకుడైతే ఇసుక రీచ్ లకు వచ్చి తను చేసిన ఆరోపణలను నిరూపించాలి. లేకపోతే ఉచిత ఇసుక విధానం అవగాహన పెంచుకోవటంతోపాటు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్రాకర్లు, ఎడ్లబండ్ల తోటి ఇసుక ఉచితంగా తీసుకువెళ్లవచ్చునని ప్రకటించిన విషయం గుర్తు చేసుకోవాలని కోరారు.
గత ఐదేళ్లుగా దొరకని ఇసుక ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో ఉచితంగా లభిస్తుండటంతో పేద ప్రజలు సంతోషంగా వుంటే… ఉచిత ఇసుక విధానంపై దోనేపూడి శంకర్ దిగజారుడు రాజకీయం చేయటం సిగ్గుచేటన్నారు. అనుక్షణం ప్రజల సంక్షేమం కోసం, ప్రజా అభివృద్ది కోసం పాటు పాడే ఎంపి కేశినేని శివనాథ్ పై తప్పుడు ఆరోపణలు చేసిన శంకర్ ఆటలు సాగవని హెచ్చరించారు. ఒకరి మోచేతి నీళ్లు తాగుతూ జిల్లా అభివృద్ది ని చూసి ఓర్వలేక వ్యక్తిగతంగా నిందలు వేయటం సబబు కాదన్నారు.
అనంతరం విజయవాడ అర్బన్ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు జి.వి.నరసింహరావు మాట్లాడుతూ దోనేపూడి శంకర్ కి ఉచిత ఇసుక విధానం గురించి అవగాహన వుందా అంటూ సూటిగా ప్రశ్నించారు. అర్థరహితమైన ఆరోపణలు చేయటం సబబు కాదన్నారు. దోనేపూడి శంకర్ చేసిన ఆరోపణల్లో ఒక స్పష్టత లేదన్నారు. ఒకసారి ఎంపి కేశినేని చిన్ని అని, ఆ తర్వాత ఎంపి కేశినేని శివనాథ్ పేరు చెప్పుకొని అంటూ చేసిన సత్యదూరమైన ఆరోపణలు రాజకీయ ఉనికి కోసమే చేశారని అర్ధమవుతుందన్నారు.
ఒక పార్టీకి నాయకుడిగా వుంటూ స్పష్టత లేకుండా, పూర్తి సమాచారం తెలుసుకోకుండా ఎంపి కేశినేని శివనాథ్ పై ఆరోపణలు చేయటం శంకర్ రాజకీయ విజ్ఞతకు సరైనది కాదన్నారు. ఇసుక దోపిడి గత ఐదేళ్లలో జరిగిందని.. ప్రజా ప్రభుత్వంలో పేదవారికి ఉచితంగా ఇసుక లభిస్తుందని ఈ విషయం గ్రహించాలన్నారు. ఉచిత ఇసుక విధానం వల్ల భవన నిర్మాణ కార్మికులకు పని దొరుతుంది…ఇళ్లు కట్టుకునే పేదవారికి ఎంతో ప్రయోజనంగా వుందని, ఉచిత ఇసుక విధానం వల్ల పేద ప్రజలకు జరుగుతున్న మంచి కనిపించటం లేదా అంటూ ప్రశ్నించారు.
ఎంపి గా గెలవక ముందు నుంచే ఎన్టీఆర్ జిల్లాలో కేశినేని ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు చేపట్టారు. ఎంపి గా గెలిచిన తర్వాత కూడా ఆ సేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో కేశినేని శివనాథ్ ప్రజా సేవ ఎలా చేశారు. ప్రజలకు ఎలా దగ్గర అయ్యారు..గెలిచిన ప్రజల కోసం, జిల్లా అభివృద్ది కోసం ఎలా పనిచేస్తున్నారనే విషయం ఈ జిల్లాలోని ప్రజలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు అన్నారు. ఎపిలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ది పరంగా సెకండ్ ప్లేస్ వుందనే విషయం గ్రహించాలన్నారు. ఇసుక పేరుతో సొంత లబ్ధి కోసం తప్పుడు ఆరోపణలతో బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలని, మరోసారి ఇలాంటి
అర్ధరహితమైన వ్యాఖ్యలు చేస్తే కాస్త గట్టిగా సమాధానం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఎన్టీఆర్ జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.