Uncategorized

పటిష్ట భావజాలం… సైద్ధాంతిక పోరాటం… జనసేన బలం

Spread the love

పటిష్ట భావ జాలం, సైద్ధాంతిక పోరాటమే జనసేన బలం

• ప్రజలకు మేలు చేసే మార్పును జనసేన కోరుకుంటుంది
• దేశ గతిని మార్చే యువ నాయకత్వాన్ని అందించడమే నా కల
• సనాతన ధర్మం అంటే సమాజంలో అందరికీ మేలు జరగాలని కోరుకోవడమే

  • దేశంలో బహు భాషలు అవసరం ఉంది
    • ఉత్తరాది, దక్షిణాది అని పదేపదే మాట్లాడటం సబబు కాదు
    • నియోజకవర్గాల పునర్విభజనపై చర్చ అవసరం
    • దేశాన్ని ముక్కలు చేసే ఆలోచనలు తప్పు
  • సెక్యూలరిజం పేరుతో ఒక్కోక్కరికి ఒక్కో న్యాయం అంటే ఎలా..?
    • జయకేతనం ఆవిర్భావ సభలో ప్రసంగించిన జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

‘‘రుద్రవీణ వాయిస్తా
అగ్నిధార కురిపిస్తా
తిరుగుబాటు జెండా ఎగురేస్తా
దుష్టపాలన నుంచి విముక్తి కలిగిస్తా’’ – అన్న తెలంగాణ ప్రజాకవి శ్రీ దాశరథి కృష్ణమాచార్య పంక్తులే జనసేనకు బలం. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని తొడలు కొట్టిన వారిని ఎదురించి వంద శాతం స్ర్టైయిక్ సాధించడమే జనసేన స్వర్ణ ప్రస్థానం. బలమైన భావజాలం, గొప్ప సిద్ధాంతాలతో ప్రయాణం మొదలుపెట్టి ప్రజలకు మేము అండగా నిలుస్తామని భరోసా నింపిన గొప్ప ధైర్యం జనసేన పార్టీదని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు అన్నారు. చాలా భయాలు, బాధ్యతలుండే సగటు మధ్య తరగతి వ్యక్తిగా ఎదిగి, ప్రజల కోసం పని చేయాలనే తలంపుతో జనసేన పార్టీని ప్రారంభించి వంద శాతం స్ట్రయిక్ రేటు సాధించడం ప్రజల ఆశీర్వాదం, దేవుడి రాత అన్నారు. తప్పును తప్పు అని, ఒప్పును ఒప్పు అని చెప్పడమే నా సిద్ధాంతం అని పేర్కొన్నారు. పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం ‘జయ కేతనం’ సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
“చాలా మంది ఢిల్లీ స్థాయి జర్నలిస్టులు పవన్ కళ్యాణ్ లెఫ్టిస్టు, రైటిస్టు, సెంట్రిస్టు అని పదేపదే రకరకాలుగా రాస్తున్నారు. నేను ఒకటే చెప్పదల్చుకున్నా. నేను చెగువేరాను ప్రేమిస్తా.. నారాయణ గురును గౌరవిస్తా. నేను లోకమాన్య బాలగంగాధక్ తిలక్ కు నమస్కరిస్తా.. జయప్రకాశ్ నారాయణ్ భావజాలం అభిమానిస్తా.. మదర్ థెరిసాకు మొక్కుతా… భగత్ సింగ్ ను గుండెల్లో పెట్టుకుంటా. నేను చెగువేరాను ప్రేమిస్తా అంటే లెఫ్టిస్టు అవ్వాల్సిన అవసరం లేదు. ఓ వైద్య విద్యార్థిగా కేవలం రోగులకు చికిత్స చేయడమే కాదు.. సమాజాన్ని కాపాడటానికి చికిత్స చేయాలనే ఉన్నత ఆశయంతో ఆయన దేశం కాని దేశం కోసం, మనుషుల కష్టాలను అర్థం చేసుకొని పోరాడారు. అది నాకు ఇష్టం. నేను మనుషుల్లో ఉండే గొప్పదనాన్ని ప్రేమిస్తా. ఆరాధిస్తా. మంచి ఎక్కుడున్నా తీసుకుంటా. అదే నా సిద్ధాంతం. భావజాలం. భిన్నమైన వ్యక్తుల్లో ఏకత్వం అనే మంచిని చూడటమే నాకు తెలుసు. జనసేన ఏడు సిద్ధాంతాలను ఎంతో మదించి పార్టీ నిర్మించుకున్నాం. వాటిని తప్పనిసరిగా పాటిస్తూ ముందుకు వెళ్తాం. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు మార్చే వాడే అయితే ఈ దశాబ్దకాల ప్రయాణం ఎలా సాధ్యం..? ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఎలా నిలబడ్డాం..?

  • రాజకీయాలు చేయాలంటే బాబాయ్ ను హత్య చేయాలా..?
    రాజకీయాలను చాలా బలంగా దేశం కోసం చేస్తాం. ప్రజల శ్రేయస్సు కోసం చేస్తాం. రాజకీయాలు చేయాలంటే తెల్లగడ్డం వేసుకొని పుట్టక్కర్లేదు. ముఖ్యమంత్రి కొడుకే అవ్వాల్సిన అవసరం లేదు. కేంద్రమంత్రి మేనమామ కావాల్సిన అవసరం లేదు. బాబాయ్ ని చంపాల్సిన అవసరం అంతకంటే లేదు. నేను నిత్య విద్యార్థిని. జ్ఞాన సముపార్జన నిత్యం చేస్తూనే ఉంటాను. ఎన్నో థియరీలు, సిద్ధాంతాలు, సామాజిక, ఆర్థిక స్థితిగతులు, సమకాలీన అంశాలను ఎన్నో పుస్తకాలను చదివే నేను సిద్ధాంతాలను రూపొందించుకున్నాను. వాటిని బలంగా నమ్ముతాను. పార్టీని ముందుకు తీసుకెళ్లడం కోసం ఎంత కష్టపడ్డానో, ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు. ఒకప్పుడు కరాటేలో అద్భుతంగా రాణించిన నేను ఇప్పుడు కనీసం నా చిన్న కొడుకును ఎత్తుకోలేని పరిస్థితిలో ఆరోగ్యం పాడయింది. రాజకీయాల్లో రెండు మార్గాలుంటాయి. ఒకటి బలంగా అధికారం కావాలనే ఆకాంక్ష అయితే, రెండోది ఆశయాలు, సిద్ధాంతాలను నమ్మి ముందుకు సాగడం ఉంటాయి. నేను రెండోది ఎంచుకున్నాను. నేను సైద్ధాంతిక రాజకీయాలను ఎంచుకున్నాను. సమాజంలో సమతుల్యత, సమభావం రావాలనే అందరిలో చైతన్యం రగిలించాలనే తపనతోనే జనసేన ముందుకు వెళ్లింది. రిజిస్టర్ పార్టీ నుంచి రికగ్జైజ్డ్ పార్టీగా ఎదిగింది.
    • మార్పు అనేది సహజం
    రాజకీయాల్లో మార్పు అనేది సహజం. ప్రజలకు మంచి జరుగుతుందని భావించినపుడు మార్పు ముఖ్యం. మనకు నీరునిచ్చే నదులే బోలెడు మార్పులతో ముందుకు సాగుతాయి. నేను మార్పు కోసం, ప్రజల బాగు కోసం రాజకీయాల్లోకి వచ్చిన వాడిని. ఓట్ల కోసం, పదవుల కోసం కాదు. ఎంజే అక్బర్ అని ఢిల్లీ జర్నలిస్టు తాను పూర్తిగా బీజేపీ వ్యతిరేక భావజాలంతో ఒక పుస్తకం కూడా రాశారు. నా మీద కూడా ఎన్నో రాశారు. అలాంటి వ్యక్తి 2014లో బీజేపీ నుంచి ఎంపీ అయ్యారు. పూర్తిగా బీజేపీని వ్యతిరేకించే ఎంజే అక్బర్ మారినపుడు నేను మంచి కోసం మారితే తప్పేంటి..? నెల్లూరులో ఉన్నపుడు నేను చాలామంది కమ్యూనిస్టులను చూశాను. వారి పిల్లలేమో క్యాపిటలిస్టులుగా కనిపించేవారు. పెద్దలు కమ్యూనిస్టులు, పిల్లలు క్యాపిటలిస్టులు కాకూడదని ఎక్కడా లేదు. మార్పు అనేది చాలా సహజం. ఎదగడానికి అయినా, దిగజారడానికి అయినా మార్పే కీలకం. నేను ఎప్పుడూ అనాలోచితంగా నిర్ణయం తీసుకోను, అడుగు వేయను. అన్ని ఆలోచించిన తర్వాతే ముందుకు సాగుతాను.
    • ఊరికి 100 మంది యువ నాయకుల్ని దేశానికి అందించాలి
    గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు 2047కు వికసిత్ భారత్ అని, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2047 స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అని లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. బలమైన దేశం తయారు కావాలంటే బలమైన నాయకత్వం కావాలి. అది భవిష్యత్తును నిర్దేశించే యువత నుంచే రావాలి. నా కల, స్వప్నం ఒకటే. 2047కు దేశానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఊరికి 100 మంది యువ నాయకత్వాన్ని అందించాలి. దీనికి అనుగుణంగా నా ప్రయాణం ఉంటుంది. దేశ విభజన సమయంలో శ్రీ వల్లభాయ్ పటేల్ గారిని ఒకరు దేశ విభజన ఎందుకు ఆపలేదు అంటే మాలో శక్తి సన్నగిల్లింది అని సమాధానం ఇచ్చారు. అంటే దేశానికి ఆలోచించే నాయకులు కావాలి. బలమైన నాయకత్వం లేకపోతే బూతులు తిట్టేవాళ్లు, నిద్రపోయే వాళ్లను ఎన్నుకోవాల్సిన దుస్థితి వస్తుంది. దాన్ని మార్చాలి. తప్పు జరిగితే ప్రజలు కూడా చైతన్యవంతులై కోపంతో రగిలిపోవాలి. వందల కోట్లు రాజకీయ నాయకులకు ఎలా వస్తున్నాయని ప్రశ్నించాలి. మీ నాయకులు వ్యక్తిగత విషయాలను మాట్లాడితే ప్రజలే నిలదీయాలి. కోపం లేని సమాజంలో మార్పు సాధ్యం కాదు.
    • నా రక్తంలోనే హిందుత్వం ఉంది
    చాలామంది అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ హిందు ధర్మ పరిరక్షకుడు అయిపోయాడు. సనాతనవాది అయిపోయాడు అని మాట్లాడుతున్నారు. వారికి చెప్పేదొక్కటే. నా రక్తంలోనే హిందుత్వం ఉంది. నేను 21 సంవత్సరాల వయసు నుంచి దీక్షలు చేస్తూ వచ్చాను. మొదటి నుంచి సనాతన ధర్మం పాటిస్తున్నవాడినే. నాకు సర్టిఫికేట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎవరి దగ్గరా ప్రూఫ్ చేసుకోవాల్సిన అగత్యం లేదు. నాకు హిందుత్వం, సనాతన ధర్మం అనేది ఓట్ల కోసం అయితే 219 ఆలయాల మీద దాడి జరిగినపుడు నేను ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టాలి కదా..? కాని నేను సంమయమనం పాటించాను. నిత్యం శ్రీరాముడిని కొలిచే మాకు రాముడు విగ్రహం తల నరికితే కోపం రాకూడదు అని చెప్పడానికి మీరెవరు..? హైదరాబాద్ లో ఓ నాయకుడు మాకు 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులందరినీ అంతం చేస్తామని చెబితే మేం మాట్లాడకూడదని చెబుతారేంటీ..? బతుకమ్మను హేళన చేస్తూ మాట్లాడితే మౌనంగా ఉండమని చెబుతారేంటీ..? మేం పూజించే పార్వతీదేవి, లక్ష్మి దేవిలను తిడతారు. అయినా ఏం అనకూడదు అంటే ఎలా..? ఆ జనరేషన్ వెళ్లిపోయింది. ఇప్పుడు మేం తప్పును తప్పు అనే చెబుతాం. అల్లాకు, జీసస్ కు ఓ న్యాయం అమ్మవారికి ఓ న్యాయం అంటే కుదరదు.
    • సనాతనం అంటే మంచి ధర్మం
    సనాతన ధర్మం పాటించిన విజయనగర రాజులు మసీదు నిర్మించారు. బంగ్లాదేశ్ ఏర్పాటుకు సనాతన ధర్మం పాటించే ఆలోచనే మూలం. పాకిస్థాన్ మొదటి లా మినిస్టర్ శ్రీ జోగింద్రనాథ్ మండల్ గారు పాకిస్థాన్ వెళ్లిన తర్వాత అక్కడ ఆయన కుటుంబం ఊచకోతకు గురైతే మళ్లీ భారతదేశానికి కాందిశీకుడిగా వచ్చి చనిపోయారు. ఒకప్పుడు పాకిస్థాన్ లో 10 నుంచి 12 శాతం మేర హిందువులు ఉంటే ఇప్పుడు అక్కడ 1 నుంచి 2 శాతానికి తగ్గిపోయారు. బంగ్లాదేశ్ లో నిత్యం హిందువులు నరకయాతన అనుభవిస్తున్నారు. కాని భారతదేశంలో ముస్లింలను, క్రైస్తవులను ఎంతో గౌరవిస్తాం. వారికి సమాజంలో సొంతవారిగా చూసుకుంటాం. ఇది సనాతన ధర్మం చూపించిన గొప్ప దారి. అంతా బాగుండాలని, అందరూ బాగుండాలని కోరుకోవడమే సనాతన ధర్మ లక్ష్యం. తిరుపతి లడ్డూ కల్తీ జరిగినపుడు కూడా నేను దోషులను పట్టుకోవాలని అన్నాను తప్ప ఇస్లాం, క్రైస్తవం గురించి మాట్లాడలేదు. ఆఖరికి కల్తీ చేసిన వారు కూడా హిందువులనే తేలింది. తప్పు జరిగినపుడు తప్పు జరిగిందని నిర్భయంగా చెబుతాం. మా మనోభావాలు గాయపడినపుడు బయటకు వచ్చి మాట్లాడతాం. దానిలో తప్పేముంది.
    • సూడో సెక్యూలరిజం వద్దు
    సెక్యూలరిజం అంటే ఎవరు తప్పు చేసిన వారిని శిక్షించడం కావాలి. ఓట్ల కోసం మాట్లాడటం కాదు. సూడో సెక్యూలరిస్టులకు అందరికీ చెబుతున్నా. ఎక్కడ తప్పు జరిగినా దాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. గోద్రాలో అల్లర్లు జరిగినపుడు దాన్ని అంతా ఖండించాలి. అలాగే కరసేవకుల రైలును తగులబెట్టినపుడు కూడా అలాగే స్పందించాలి. ఈ దేశంలో ఓట్ల కోసం కొందరు సూడో సెక్యూలరిస్టులుగా మాట్లాడటం మంచిది కాదు. జనసేన ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదు. ఎక్కడా తప్పు జరిగినా తప్పుగా చెబుతాం. ఎవరైనా సరే ఏ మతం వారు అయినా సరే మొదట తప్పు చేసిన వారికి కచ్చితంగా శిక్షించాల్సిందే. ఇదే కోరుకుంటాం. ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం ఉంటుంది. దానికోసం సెక్యూలరిజం తీసుకురావడం కరెక్టు కాదు.
    • బహు భాషలు భారతదేశానికి మంచిది
    దేశంలో అన్ని భాషలను గౌరవించాలి. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ బలం. త్రిభాష సిద్ధాంతం వద్దు.. హిందీ మాకొద్దు అనే తమిళనాడు నాయకులు వారి తమిళ సినిమాలను హిందీ డబ్ చేయడం మానుకోండి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి పని వాళ్లను తీసుకురావడం మానేయండి. డబ్బులు మాత్రం హిందీ రాష్ట్రాల నుంచి కావాలి. వారి భాషను మాత్రం మాకొద్దు అంటే ఎలా..? భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదు. సంస్కృతంలో మంత్రాలు చదవకూడదని చెబుతారు. సంస్కృతం దేవ భాష. హిందూ ధర్మంలో ఆ భాషలోనే మంత్రాలను పఠిస్తారు. ఇస్లాం ప్రార్థనలు అరబిక్ లో ఉంటాయి. కేవలం హిందువులను మాత్రమే మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడటం ఎందుకు..? భాషల మధ్య వైరుధ్యాలు సృష్టిస్తే భారతీయుల మధ్య ఐక్యత, సమాచార మార్పిడి కూడా క్లిష్టమైపోతుంది. రూపాయి మార్కును బడ్జెట్ నుంచి తొలగిస్తే రాష్ట్రానికో పద్ధతి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది దేశానికి మంచిది కాదు.
    • దేశం నుంచి విడిపోతామని ఎలా చెబుతారు..?
    ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. చర్చించుకోవాలి. అంతేగాని దేశం ఏమైనా కేకు ముక్కలాగ ప్రతిసారి దేశం నుంచి విడిపోతామని మాట్లాడతారేంటీ..? మీలాంటి వాళ్లు విడిపోతే నాలాంటి వాళ్లు కలపడానికి కోట్ల మంది వస్తారు.
    ప్రతిసారి ఉత్తరాది, దక్షిణాది అని మాట్లాడతారు. ఉత్తరాదిన కైలాసంలో శివుడు కొలువైతే, దక్షిణాదిన ఆయన బిడ్డ మురుగన్ నివాసం ఉంది. తండ్రిబిడ్డలను ఎలా వేరు చేయలేరో, దేశాన్ని అలాగే వేరు చేయలేరు. దేశం నుంచి విడగొట్టాలని మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. భాష, భావం వేరు అని దేశాన్ని విడగొట్టాలని చూస్తే సహించేది లేదు. ఒక ఇంట్లోని కుటుంబ సభ్యుల్లోనే రకరకాల మార్పులుంటాయి. అలాంటిది ఇంత భిన్నమైన దేశంలో కొన్నిమార్పులు సహజం. రాజకీయ వైరుధ్యాలను దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా మార్చకండి.
    • నియోజకవర్గాల విభజనపై చర్చకు రండి
    నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని కొందరు మాట్లాడుతున్నారు. ఇలాంటివి ఏమైనా ఉంటే పూర్తిస్థాయిలో చర్చిద్దాం రండి. ఇంకా అసలు ప్రకటన రాకముందే రాజకీయాల కోసం విషయాన్ని పెద్దగా చేయడం, లబ్ధి పొందాలని చూడటం సరికాదు. ఉన్నతమైన పదవుల్లో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలి. లేకుoటే ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ద్రవిడ ఉద్యమాన్ని ప్రారంభించిన పెరియార్ కూడా బలిజ నేత. దేశమంతటికి బలమైన భావజాలం మనల్ని కలిపి ఉంచింది. దాన్ని గుర్తుంచుకోండి.
    • జనసేనది మరపురాని ప్రయాణం
    2003లోనే నా తల్లిదండ్రులకు రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పాను. నన్ను చిన్నప్పటి నుంచి చాలా సున్నితంగా పెంచారు. నాన్న నన్ను డిగ్రీ చేస్తే ఎస్సై అవుతావని, జీవితం సెటిల్ అవుతుందని చెప్పేవారు. కాని నేను సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఎదిగాను. 2006లో పుస్తకాలను చదవడం, సమాజాన్ని అభ్యసించడం మొదలుపెట్టాను.
    అప్పట్లోనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ శ్రీ శ్రీపతి రాముడు గారు బహుజన సిద్ధాంతాల గురించి చెబుతూ, మీరు రాజకీయాల్లోకి రావాలని కోరారు. ఆయనతో తరుచూ మాట్లాడుతుంటాను. మేధావులు నాలో రాజకీయ నాయకుడ్ని చూశారు. 11 సంవత్సరాల జనసేన ప్రయాణంలో రాజకీయ శత్రువులను 11కి పరిమితం చేశాం. సగటు మనిషిగా ఉండటం, ఆలోచించడం నాకు ఇష్టం. నాలోని భావ తీవ్రత నన్ను పార్టీ పెట్టేలా చేసింది. ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన సోదర సమానులు, పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, మొదటి నుంచి నాతోనే ప్రయాణం చేసిన శ్రీ పిడుగు హరిప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జన సైనికులు, వీర మహిళలే నా బంధం. అనుబంధం. మీరే జనసేనానికి రక్త సంబంధం. బాధ్యతగా ముందుకు వెళ్దాం. 100 శాతం స్టైయిక్ రేటుతో పుట్టిన బిడ్డను జాగ్రత్తగా కాపాడుకుందాం. భవిష్యత్తు మనదే’’ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *