Uncategorized

పాకిస్థాన్ వెళ్లిపోండి.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Spread the love

పాకిస్థాన్ మీద ప్రేమ ఎక్కువైతే అక్కడికే వెళ్లిపోండి

  • సెక్యులరిజం ముసుగులో సత్యాన్ని పాతిపెట్టడం సరికాదు
  • సత్యమేవ జయతే… ఇదీ భారతదేశపు ఆత్మ
  • పహల్గాంలో ఉగ్రవాదుల దాడి దేశ సమగ్రతపై జరిగిన దాడి
  • హిందువా..? ముస్లింవా..? అని అడిగి కిరాతంగా తూటాలు దించిన ఉగ్రవాదులపై కనికరం అవసరం లేదు
  • కశ్మీర్ లో పేలిన తూటాలు దేశమంతా అలజడి సృష్టించాయి
  • షికారుకు వచ్చినట్లు వచ్చి పర్యాటకులను వేటాడి చంపడం అత్యంత హేయం
  • అతి మంచితనం కూడా దేశానికి ప్రమాదకరం
  • ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి దేశమంతా ఏకమవ్వాలి
  • కశ్మీర్ ఎప్పటికీ భారత్ అంతర్భాగమే
  • పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన జన సైనికుడు శ్రీ మధుసూదన రావు గారి కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం
  • పహల్గాం దుర్ఘటనలో అమరుడైన జనసేన క్రియాశీలక సభ్యుడు శ్రీ మధుసూదన్ గారికి నివాళులు అర్పించి, ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

‘పహల్గాంలో ఉగ్రవాదుల దాడి దేశ సమగ్రత మీద జరిగిన దాడి. కశ్మీర్ లో పేలిన తూటా ప్రకంపనలు దేశమంతా వ్యాపించాయ’ని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. షికారుకు వచ్చినట్లు వచ్చి పర్యాటకులను వేటాడి చంపడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు. హిందువా..? ముస్లింవా..? అని అడిగి కిరాతంగా తూటాలు దించిన ఉగ్రవాదులపై కనికరం అవసరం లేదని, ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడానికి దేశమంతా ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కశ్మీర్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని, భారత్‌లో ఉండి పాకిస్థాన్‌కి మద్దతుగా మాట్లాడుతున్నవారు… ఆ దేశం మీద ప్రేమ ఎక్కువైతే ఆ దేశం వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు. సోమవారం మంగళగిరి సీకే కళ్యాణమండపంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పహల్గాం అమరులకు నివాళులు అర్పించి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రదాడిలో మృతి చెందిన 26 మందికి నివాళులు అర్పించారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు కావలి వాసి శ్రీ సోమిశెట్టి మధుసూదన రావు గారి చిత్రపటానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారితోపాటు మంత్రులు, పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “పహల్గాం తీవ్రవాదుల దాడిలో చనిపోయిన 26 మందిలో ఒకరైన శ్రీ సోమిశెట్టి మధుసూదనరావు గారు జనసేన క్రియాశీలక సభ్యులు. ఉగ్రవాదం మన జనసైనికుడిని కూడా చంపేసింది. ఆ కుటుంబ పరామర్శకు వెళ్లినప్పుడు శ్రీ మధుసూదన్ గారి సతీమణి, పిల్లలు.. ఎంత ఘోరంగా చంపారో వివరించారు. ఐడీ కార్డులు చూసి మరీ హిందూవా? ముస్లిమా? అని అడిగి మరీ ప్రాణాలు తీశారు. ఈ ఘటనకు మూడు రోజుల ముందు ఆ కుటుంబం బెంగళూరు నుంచి కశ్మీర్ వెళ్లారు. శ్రీ మధుసూదన్ గారు తన సతీమణిని అరగంట ముందే – ఆయన బొట్టుపెట్టుకోమని అడిగి మరీ బొట్టు పెట్టించారు. ఆ బొట్టు పెట్టుకోవడం వల్ల హిందువు కాదని చెప్పలేని పరిస్థితుల్లో దొరికిపోయామని ఆమె ఆవేదనతో చెప్పారు. తుపాకుల శబ్దం వినబడిన తర్వాత ఆ కుటుంబం మొత్తం కింద పడుకున్నారు. శ్రీ మధుసూదన్ గారు తన కుటుంబ సభ్యులకు ఏమీ కాదు అని ధైర్యం చెబుతుండగానే ఉగ్రవాదులు తాపీగా షికారుకు వచ్చినట్టు వచ్చి వేటాడి వెళ్లిపోయారు. బూట్ల శబ్దాలు ఆగిన తర్వాత తుపాకుల శబ్దాలు వినబడ్డాయి. ఆ తర్వాత ఆమె ముఖం మొత్తం భర్త రక్తం తో నిండిపోయింది. ఆ ఘటన గురించి వింటే హృదయం ద్రవించిపోయింది. తల ఉండాల్సిన చోట తల లేదు. తలలో 40 బుల్లెట్లు దించారు. అంత క్రూరంగా చంపేశారు.

నిరాయుధులైన పర్యాటకులను ఆ ఉగ్రవాదులు చంపేశారు. ఎంత నమ్మకం ఉంటే వాళ్లంతా కశ్మీర్ వెళ్లారు. 2022, 2023 లో దాదాపు రెండు కోట్ల మంది పర్యాటకులు కశ్మీర్ వెళ్లి వచ్చారు. రాష్ట్రపతి పాలన తీసివేసిన తర్వాత పగ్గాలు తిరిగి రాష్ట్రం చేతికి వెళ్లిపోయాయి. ఆ తర్వాతే ఉగ్రవాదులు విజృంభించి చంపేశారు.

  • రాజకీయ పార్టీగా మనకు అవసరం

కశ్మీర్ కి మనకి ఎలాంటి సంబంధం లేదు అని ఎవరూ అనడానికి కుదరదు. దేశంలో ఎక్కడ ఏం జరిగినా అందుకు సంబంధించిన ప్రకంపనలు మనకి కూడా తగులుతాయి. సగటు మనిషికి దీని అవసరం లేకపోవచ్చు. ఒక రాజకీయ పార్టీగా మనకి మాత్రం అవసరం. నేను జాతీయ సమస్యల గురించి మాట్లాడితే హాస్యాస్పదంగా చూసిన వారు ఉన్నారు. మన రాష్ట్రం కూడా మన దేశంలో అంతర్భాగమే కదా. మన సరిహద్దులు భద్రంగా లేకపోతే దాని ప్రకంపనలు ఇక్కడి వరకు వస్తాయి. మయన్మార్ లో గొడవలు జరిగితే మనకి ఎందుకులే అనుకోవడానికి లేదు. అక్కడి నుంచి వచ్చిన రోహ్యింగ్యాలు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఉన్నారు. రెండు సెంట్ల భూమి ఉంటేనే దాని సరిహద్దులను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. దేశ సరిహద్దులను జాగ్రత్తగా చూసుకోకపోతే పరిణామాలు ఇలానే ఉంటాయి.

మనది మెత్తని దేశం. అయితే శ్రీ మధుసూదన్ భార్య బాధ చూసిన తర్వాత ఉగ్రవాదులపై అంత కనికరం అవసరం లేదు అనిపించింది. ఉగ్రదాదులను నిర్ధాక్షణ్యంగా ఏరిపారేయాలి. విశాఖకు చెందిన శ్రీ చంద్రమౌళి గారు విశ్రాంత ఉద్యోగి. ఐదు రోజుల పర్యటనకు కశ్మీర్ వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఉగ్రవాదం తాలూకు పంజా అన్నింటి పైనా ఉంటుంది. కశ్మీర్ ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. అందులో గుర్రాలను తీసుకువెళ్లే ఒకతను మాత్రమే ముస్లిం. మిగిలిన వాళ్లంతా హిందువులు. గుర్రాలు తీసుకువెళ్లే అతనిని కూడా.. ఉగ్రవాదులను ఎదిరించినందుకు చంపేశారని వార్తల్లో చూశాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలి. పాత్రికేయులతో సహా కొంత మంది ఒక వర్గం అంటూ లోపాయికారిగా మాట్లాడుతారు. నిజం మాట్లాడినంత మాత్రాన అది ద్వేషం అవదు. అది ఉగ్రవాదుల మీద కోపం మాత్రమే. మన దేశంలో ఇంత మంది ముస్లిం నాయకులు ఉన్నారు. ఏనాడైనా వారిపై ద్వేషం చూపామా? బాధిత కుటుంబాల బాధను అర్ధం చేసుకునే పార్టీ తరఫున మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించాను.

  • కశ్మీర్ భారత్ లో అంతర్భాగమే

1986 నుంచి 1989 మధ్య శ్రీ చిరంజీవి గారితో పాటు సినిమా షూటింగ్ లకు కశ్మీర్ వెళ్లాం. 1989 సమయంలో అప్పుడే అక్కడ ఉగ్రవాదం వేళ్లూనుకుంటోంది. 90వ దశకానికి మారణకాండ సృష్టించి అక్కడ వేలాది మందిని చంపేశారు. లక్షలాది మంది కశ్మీరీ పండిట్లు వలసపోయారు. వారి వలసలు ఆపి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితులు వచ్చేది కాదు. అప్పట్లో శ్రీనగర్ మార్కెట్ కి వెళ్తే- ఒక కశ్మీరీ పండిట్ ఇక మీరు ఇక్కడికి రాలేరు అని చెప్పారు. అప్పటి నుంచి కశ్మీర్ మండుతున్న ఓ సమస్యగానే మిగిలిపోయింది. కశ్మీర్ భారతదేశంలో భాగం. ఎప్పటికీ భారత దేశంలో అంతర్భాగంగానే ఉంటుంది. ఇదీ.. జనసేన విధానం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకూడదు. భిన్న సంప్రదాయాలు, అభిప్రాయాలు ఉండే ఒక దేశాన్ని ఏకాభిప్రాయంతో నడపాలి అంటే ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తికి ఎంతో కష్టం. అలాంటి వ్యక్తులకు మనవంతు మనం చిన్నపాటి ఊతం ఇవ్వాలి. గొడవలు సృష్టించకుండా బాధ్యతగా మాట్లాడాలి. అవసరం అయిన చోట భుజం కాయాలి. ఇది ఎన్డీఏ భాగస్వామిగా మన బాధ్యత.

  • ఎందుకు మౌనంగా ఉండాలి?

ఉగ్రవాదులు హిందువులనే లక్ష్యంగా చేసుకుని చంపారు. నేను ముస్లిం అయితే నన్ను వదిలేసేవారు. హిందువుగా పుట్టడం మేము చేసిన పాపమా? అని శ్రీ మధుసూదన్ గారి భార్య నన్ను అడిగారు. కుటుంబం మొత్తం విహార యాత్రకు వెళ్తే వారి కళ్ల ఎదుటే దారుణంగా చంపేశారు. స్వాతంత్ర్యం వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత కూడా ఇలా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. మనం పాకిస్థాన్ ని మూడు సార్లు ఓడించాం. మనకి సహనం ఎక్కువయ్యింది. మితిమీరిన మంచితనం కూడా మంచిది కాదు. వారు ఇష్టారీతిన కాల్చుకుంటూ వెళ్లిపోతుంటే మనం ఎందుకు మౌనంగా ఉండాలి. మన దేశంలో అసలు ఎంత మంది ఏ ముసుగుతో ఉంటున్నారో తెలియని పరిస్థితులు ఉన్నాయి. మన వరకు మనం పదవులు వచ్చాయా? లేదా అనే అంశం కంటే సమాజం మీద పహారా ఖాయడం ముఖ్యం. మన పరిసరాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారా అనేది ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. మన మంచితనం వల్ల ఇవాళ మన ఇళ్లలోకి వచ్చి మరీ చంపేస్తున్నారు. ఉగ్రవాదం వ్యవహారంలో మనదైన స్టాండ్ తీసుకోవాలి. ఒక ప్రాంతీయ పార్టీగా మన విస్తృతి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరకే పరిమితం అయినా మన ఆలోచనా విధానం మాత్రం జాతీయవాదం.

    • సూడో సెక్యూలరిస్టులు పద్ధతి మార్చుకోవాలి

దేశంలో యుద్ధ పరిస్థితులు రావచ్చు.. రాకపోవచ్చు.. ఆ వ్యవహారంలో ఏడు అంశాలపై కేంద్ర పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ముందుగా నీరు ఆపారు. దీనిపై కొంత మంది లీడర్లు మాట్లాడుతున్నారు. దేశంలో లౌకికవాదం ఎలా ఉంది అంటే 26 మందిని మత ప్రాతిపదికన చంపేస్తే- సోకాల్డ్ సూడో సెక్యులరిస్టులు మతం అడిగి చంపలేదు అంటున్నారు.

మన దేశం తాలూకు నినాదం సత్యమేవ జయతే. మనం సత్యాన్నే నమ్ముతాం. తప్పు అయితే తప్పు అని చెప్పాలి. ఒప్పుని ఒప్పుగా చెప్పాలి. శ్రీ మధుసూదన్ గారి భార్య అబద్దాలు చెబుతారా? కొంత మంది భారతదేశంలో కూర్చుని పాకిస్థాన్ ని ప్రేమిస్తాము అంటారు. పాకిస్థాన్ ని ప్రేమించే వారు పాకిస్థాన్ వెళ్లిపొండి. భారత దేశంపై దాడి జరిగినప్పుడు మనం మన దేశానికి నిలబడాలిగానీ… పాకిస్థాన్ కి కాదు. ఎవరి ప్రాణాలు పోయినా తిరిగి రావు. ఉగ్రదాడిలో శ్రీ మధుసూదన్ గారి ప్రాణాలు పోయాయి. ఆయన భార్యా, బిడ్డల పరిస్థితి ఏంటి? ఓ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తాము ఇలా మీడియాలో కనబడాల్సి వచ్చిందని నిష్టూరంగా మాట్లాడారు. మా మీద భరోసాతోనే కశ్మీర్ వెళ్లామని మాట్లాడుతుంటే. ఆ తిట్లు నేను తీసుకున్నాను.

    • పాకిస్థాన్ లో హిందువులు బతికే పరిస్థితి లేదు

మత ప్రాతిపదికన చంపడాన్ని మాత్రం సహించం. భారత దేశంలో సెక్యులర్ అనే పదం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 70వ దశకంలోనే మన దేశం సెక్యులర్. తర్ తన్ సే జుదా అని చెప్పి.. చెప్పి.. తుపాకులతో కాల్చేశారు. చనిపోయిన వారిని పట్టుకుని కన్నీరు కార్చాలన్నా తల లేదు. అంత క్రూరంగా చంపేశారు. ఇంకా ఉగ్రవాదులపై ఎంత సహనం చూపుతాం. పాకిస్థాన్ విడిపోయినప్పుడు జిన్నా పాకిస్థాన్ లో అందర్నీ సమంగా ఆదరిస్తామని చెప్పారు. హిందువులు దేశం విడిచి వెళ్లనవసరం లేదు అని చెప్పారు. నాడు రెండు కోట్ల మంది ఉన్న ఆ దేశంలో ఇప్పుడు లక్షల మందే ఉన్నారు. మన దేశంలో చూస్తే పాకిస్థాన్ లో ఎంత మంది ఉన్నారో అంత మంది ముస్లిం జనాభా ఉంది. హిందువులు వివక్ష చూపితే ఇంత మంది ఉండగలరా? బంగ్లాదేశ్ లో ఇటీవల హిందువుల మీద దాడులు చేస్తున్నారు. అక్కడి నుంచి మన దేశానికి శరణార్ధులు వచ్చేస్తారు. అలా వస్తే మన వారి ఉనికికి ప్రమాదం. శరణార్ధులు రావడం మన దేశానికి భారం. ఇందులో వివక్ష ఏమీ ఉండదు. హిందువులకి ఉన్నది ఒక్కటే దేశం. ఇక్కడా చంపుతుంటే ఎక్కడికి పోతారు. భారత దేశంలో కోట్లాది మంది జనాభా ఉంది. ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ మీ ప్రధాని శ్రీ మోదీకి చెప్పుకోమన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో శ్రీ మోదీ గారిని విమర్శించే వారు కూడా మద్దతుగా నిలుస్తున్నారు. దేశం మొత్తం మొదటి సారి ఏకతాటిపైకి వచ్చింది. ఉగ్రవాదం, హింసపై మనమంతా ఒకటే మాట మాట్లాడాలి.

    • పార్టీ తరఫున రూ.50 లక్షల ఆర్థిక సహాయం

ముష్కరుల దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదుల తూటాలకు బలైనవారిలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు శ్రీ సోమిశెట్టి మధుసూదన రావు గారు ఉన్నారు. పోయిన ప్రాణాలు తీసుకురాలేము కానీ ఆ కుటుంబానికి అండగా నిలబడటం మా బాధ్యత. ప్రాణానికి విలువ కట్టడం ఇష్టం లేకపోయినా ఆ కుటుంబానికి ఆర్థిక ఆసరాగా కల్పించడానికి పార్టీ తరఫున రూ.50 లక్షలు అందజేస్తాము. అలాగే క్రియాశీలక సభ్యత్వం బీమా కింద మరో రూ. 5 లక్షలు అందిస్తాము. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 10 లక్షల పరిహారం ప్రకటించింది. ఇంకా ఏమైనా అదనంగా సాయం చేయగలమో చూస్తాము. ఈ సందర్భంగా శ్రీ మధుసూదన రావు కుటుంబ సభ్యులకు ఒకటే విన్నవించుకుంటున్నాము… మీకు ఏ కష్టం వచ్చిన మేము ఉన్నామని మరిచిపోకండి. ఏ అవసరం ఉన్నా మీకు తోడుగా ఉంటాం.

    • పీడ కలను మరిచిపోవడం కష్టం

కొన్ని కొన్ని దుర్ఘటనలు మనసుపై చెరగని ముద్ర వేస్తాయి. రాత్రిపూట సరిగ్గా నిద్రపోనివ్వవు. నిద్రపోయినా పీడకలలా వెంటాడుతాయి. సింగపూర్ లో నా కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదానికి గురయ్యాడు. అప్పటి వరకు వాడితో కలసి చదువుకున్న ఒక చిన్నారి ఆ ప్రమాదంలో మరణించింది. మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. మార్క్ శంకర్ ఊపిరితిత్తుల్లోకి పొగ చేరి ఇబ్బంది పడ్డాడు. చికిత్స అనంతరం హైదరబాద్ తీసుకొచ్చాం. ఈ మధ్య ఉలిక్కిపడి నిద్ర నుంచి లేస్తున్నాడు. బిల్డింగ్ మీద నుంచి పడిపోయినట్లు కలలు వస్తున్నాయని చెబుతున్నాడు. అగ్ని ప్రమాదం నుంచి మానసికంగా ఇంకా తేరుకోలేదు. అలాంటిది కన్న తండ్రి ప్రాణాలు కళ్లెదుటే పోతే ఆ పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. పడుకుంటే నిద్రపడుతుందా..? నిద్రపట్టినా కలలో తుపాకుల శబ్ధలే వినిపిస్తాయి. ఈ దుర్ఘటన నుంచి మానసికంగా బయటకు రావడం చాలా కష్టం. ఈ సందర్భంగా ఉగ్రవాదులకు ఒకటే చెబుతున్నాం. ఇది వరకు భారతదేశం కాదు. కొత్త భారతదేశం ఇది. మీ ఇష్టానికి వచ్చి కాల్చి చంపేస్తాం అంటే ఊరుకునే పరిస్థితి లేదు. పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మనం ఏదొక రూపంలో ప్రాణాలు కోల్పోతాం. అది దేశం‌కోసం అయితే… మన‌ మరణానికి ఒక అర్ధం ఉంటుంది’’ అని అన్నారు.

    • జనసేన పార్టీ బాధ్యతగా మూడు రోజుల సంతాప దినాలను చేసింది: శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్

ఈ సందర్భంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ.. “భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా పహల్గం దాడి ఘటన జరిగిన వెంటనే మూడు రోజుల సంతాప దినాలను జనసేన పార్టీ నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు మౌన దీక్షలు, కొవ్వొత్తుల ర్యాలీలు, మానవహారాలు నిర్వహించి ఐక్యతను చాటారు. ముందు దేశం, తర్వాత రాష్ట్రం, తర్వాతే మనం అనే గొప్ప స్ఫూర్తిని అందరిలో నింపిన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి మనకు సర్వదా ఆచరణీయం. విలువలతో కూడిన రాజకీయం జనసేన పార్టీ సిద్ధాంతం. పహల్గాం దాడిలో మృతి చెందిన జనసేన క్రియాశీలక కార్యకర్త శ్రీ మధుసూదనరావు గారి కుటుంబానికి పార్టీ అండగా నిలబడుతుంది. కావలికి చెందిన ఆయన అమెరికాలో ఉద్యోగం చేసి తల్లితండ్రులకు దగ్గరగా ఉండాలని బెంగళూరుకు వచ్చేశారు. శ్రీ మధుసూదన రావు గారి తండ్రి గారు అరటి పళ్ల వ్యాపారం చేస్తుంటారు. ఇంటర్మీడియెట్ చదివే కుమార్తె, 8వ తరగతి చదివే కుమారుడు శ్రీ మధుసూదన్ గారికి ఉన్నారు. ఎంతో సుందరమైన భవిష్యత్తును ఊహించుకొని శ్రీ మధుసూదన్ గారు తన మెరిట్ తో ఉద్యోగం సంపాదించారు. అలాంటి వారికి ఇలా జరగడం బాధాకరం. పిల్లల భవిష్యత్తు విద్యా అవసరాలను పార్టీ బాధ్యత తీసుకుంటుంది. పహల్గం దాడి దేశం మీద జరిగిన దాడిగా ప్రతి ఒక్కరు ఐక్యమత్యం గా స్పందించడం గొప్ప విషయం. ఎవరిని రెచ్చగొట్టకుండా శాంతియుతంగా జాతి సమగ్రతను కాపాడేలా ఐక్యంగా కార్యక్రమాలు నిర్వహించడంలో జనసేన పార్టీ ముందుంది. తోటి జన సైనికుడికి ఘనంగా నివాళి అర్పించడంలో మనం బాధ్యతగా ముందుకు వెళ్లాం. మనకు మొదటి నుంచి విలువైన రాజకీయాలు చేయడం నేర్పించిన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనలతో ముందుకు వెళ్దాం. పహల్గాం దాడి ఘటనకు ధీటైన సమాధానం చెబుతామని గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఇప్పటికే పలుమార్లు చెప్పారు. భారతీయులపై జరిగిన ఉగ్రవాద దాడి విషయంలో భారతదేశం అంతా ఏకం కావడం మన అందరి ఐక్యతకు నిదర్శనం” అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్, శాసనమండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, శాసనమండలి సభ్యులు శ్రీ కొణిదల నాగబాబు గారు, పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గాల ఇంచార్జులు, వీర మహిళ ప్రాంతీయ సమన్వయకర్తలు, కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, జన సైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *