ప్రజలకు ఆర్థిక స్థిరత్వ కల్పన కూటమి ప్రభుత్వ లక్ష్యం
• రాష్ట్ర అభివృద్ధిపై సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం
• ఉపాధి హామీ పనులతో అన్నదాతల కళ్లలో వెలుగు చూడాలి
• గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది
• కూటమి ప్రభుత్వం వ్యవస్థలను పటిష్టపరుస్తూ ముందుకు వెళ్తోంది
• త్వరలో జిల్లాల్లో పర్యటనకు ప్రణాళికలు
• కొణిదెల గ్రామంలో అభివృద్ధి పనులకు సొంత ట్రస్ట్ నుంచి రూ. 50 లక్షల నిధులు
• కర్నూలు జిల్లా, పుడిచర్లలో ఫామ్ పాండ్స్ నిర్మాణానికి భూమి పూజ చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
• రాష్ట్రవ్యాప్తంగా లక్షా 55 వేల ఫామ్ పాండ్స్ నిర్మాణానికి శ్రీకారం
‘రాష్ట్ర అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. మా ప్రభుత్వంలో వ్యవస్థలను పటిష్ట పరుచుకుంటూ ముందుకు వెళ్తున్నామ’ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తే.. కూటమి ప్రభుత్వంలో గ్రామాల్లో ప్రజలకు ఉపాధి కల్పించే దిశగా ఉపాధి హామీ పనులు ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. ప్రజలకు ఉపాధి, ఆర్ధిక స్ధిరత్వం కల్పించాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి ఉండబట్టే పల్లె పండుగ విజయవంతం అయ్యిందన్నారు. గ్రామాల్లో అభివృద్ధి అంటే రైతన్న బలపడాలి. ఉపాధి హామీ పనులతో అన్నదాతల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలి. అదే కూటమి ప్రభుత్వ ఆశయం అన్నారు. త్వరలో నియోజకవర్గానికి రెండు రోజులు పర్యటించి సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తామన్నారు. కొణిదెల గ్రామ అభివృద్ధి కోసం సొంత ట్రస్ట్ నుంచి రూ. 50 లక్షలు ప్రకటించారు. శనివారం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం, పుడిచెర్లలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ భూముల్లో సేద్యపు నీటి కుంటల(ఫామ్ పాండ్స్) నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 55 వేల ఫామ్ పాండ్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి అధ్యక్ష్యతన నిర్వహించిన బహిరంగ సభను ఉద్దేశించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “గత ప్రభుత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రాజకీయ ఉపాధి పథకంగా మార్చారు. అలాంటి వాటిని ఎదుర్కోవడానికి బలమైన అధికారులను ఏర్పాటు చేశాం. పల్లె పండుగ పనుల్లో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది. కర్నూలు జిల్లాలో రూ.75 కోట్లతో 117 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించాం. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా జిల్లాలో 98 శాతం రోడ్ల నిర్మాణం పూర్తయ్యింది. రైతులు నీరు నిలవ చేసుకోగలిగితే సమస్య ఉండదు. వర్షాలు రాగానే పంట కుంటలు నిండేలా ప్రణాళికలు చేస్తాం. గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలను పటిష్టపరచిన పాపాన పోలేదు. వాటిని పూర్తిగా నిర్వీర్యం చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ కింద సొంత గ్రామాల్లోనే పనులు కల్పించాం. ఉపాధి హమీ కింద ఇప్పటి వరకు రూ. 9,597 కోట్లు ఖర్చు చేశాం. ప్రజలకు ఉపాధి, ఆర్థిక స్థిరత్వం కల్పించాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యం.
• గత ప్రభుత్వంలో లబ్దిదారులు ఎవరో కూడా తెలియకుండా చేశారు
ఈ రోజు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఎకరం 30 సెంట్ల నేలలో 6 సెంట్లలో చెరువు, రెండు సెంట్లలో గట్టు ఉండే విధంగా నిర్మిస్తున్నాం. గత ప్రభుత్వంలో ఎవరు లబ్దిదారులో కూడా తెలియనంతగా అవకతవకలకు పాల్పడ్డారు. ఈ రోజు పుడిచర్ల గ్రామానికి చెందిన రైతు శ్రీ సూర రాజన్నకు చెందిన భూమిలో ఫామ్ పాండ్ కి భూమి పూజ చేశాం. ఈ పథకం ద్వారా ఉపాధి కూలీలు లబ్ది పొందుతున్నార. గ్రామాల్లో పనులు లేక నలిగిపోతున్నవారికి ఉపాధి కల్పించేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకానికి కావాల్సిన అర్హత కష్టపడి పని చేయడమే.
• రాయలసీమను రతనాలసీమగా మార్చడమే కూటమి లక్ష్యం
రాయలసీమలో నేల స్వభావాన్ని బట్టి ఇక్కడ నీటికి కటకట ఉంటుంది. వర్షం వచ్చినా నీటిని నిల్వ చేసుకునే పరిస్థితి లేదు. శ్రీ కృష్ణ దేవరాయలవారి హయాం మాదిరి రాయలసీమ రతనాలసీమ కావాలి. అదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. సీమకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చేలోపు రైతుల సౌలభ్యం కోసం ఫామ్ పాండ్స్ నిర్మిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 55 వేల పాండ్లు మే నెలాఖరు లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మొత్తం పాండ్లు పూర్తయితే ఒక టీఎంసీ నీటి నిల్వకు అవకాశం ఉంటుంది. రైతులంతా బాగుండాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పంట పొలాల్లో సేద్యపు నీటి కుంటల ఏర్పాటును ముందుకు తీసుకువెళ్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒకే రోజు 13, 326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించాం.
శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని ప్రేరణగా తీసుకుని ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించడంతో పాటు అభివృద్ధి పనుల జాబితా తీసుకోవడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించాం. గ్రామ పంచాయతీల్లో గత ప్రభుత్వ హయాంలో జాతీయ దినోత్సవాల సమయంలో జెండా పండుగ చేయడానికి రూ. 100 నుంచి రూ. 250 వరకు ఖర్చు చేస్తే.. కూటమి ప్రభుత్వం ఆ ఖర్చుని రూ. 10 వేల నుంచి 25 వేలకు పెంచింది. పంచాయతీరాజ్ శాఖలో సమర్ధవంతమైన పాలన అందించేందుకు పునర్నియామకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నరేగా నిధుల ద్వారా గ్రామాల్లో 97.44 మంది ఉపాధి కూలీలకు వారి గ్రామాల్లోనే ఉపాధి అందించాం. రూ. 6 వేల కోట్లు నేరుగా కూలీలకు అందించి ఉపాధితోపాటు ఆర్థిక స్థిరత్వం కల్పించే దిశగా అడుగు ముందుకు వేశాం. గత ప్రభుత్వంలో ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 4 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మిస్తే.. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 8 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల కిలోమీటర్లకు పైగా సీసీ రోడ్లు నిర్మించాం. వంద మందికి పైగా నివసిస్తున్న గిరిజన గ్రామాల్లో రహదారి సౌకర్యాలు కల్పించాం. డోలీ మోతలు లేని గిరిజన గ్రామాలు చూడాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో జన్మన్ పథకం కింద విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులకు నిధులు కేటాయించాం.
ఎంపీడీవోల సమస్యలు మా దృష్టికి తెచ్చారు మీ సమస్య పరిష్కారం వెతుకుతాం. పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్.. గ్రామ సచివాలయం, ఇంజినీరింగ్ అసోసియేషన్ సమస్యలకు పరిష్కారం వెతుకుతాం. వాల్మీకి బోయ సంక్షేమ సంఘం నుంచి అర్జీ వచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. ముఖ్యమంత్రి గారితోనూ, కేబినెట్లోనూ మీ సమస్యపై మాట్లాడుతాను.
రెడ్డి సంఘం నాయకులు కర్నూలు విమానాశ్రాయానికి స్వతంత్ర సమరయోధులు శ్రీ ఉయ్యాలవాడ సరసింహారెడ్డి గారి పేరు ప్రతిపాదించారు. దాన్ని ముందుకు తీసుకువెళ్తాం. నేను కులాలు మతాల గురించి మాట్లాడితే చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. నేను ధర్మాన్ని మాత్రం బలంగా పాటిస్తాను. నా స్వధర్మాన్ని పాటిస్తాను. అన్ని ధర్మాలను గౌరవిస్తాను. గాజుల బలిజలు బీసీ డి లో చేర్చమని అడిగారు. మీకు న్యాయం జరిగేలా కృషి చేస్తాను. బుడగ జంగాలకి స్వతంత్ర్య అనంతరం కుల ధృవీకరణ కూడా లేకుండాపోయింది. వారికి న్యాయం చేస్తాం.
• అన్ని గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి స్థానిక శాసనసభ్యుల కోరిక మేరకు అభివృద్ధి పనులు ముందుకు తీసుకువెళ్తాం. పరిమితి మేరకు ప్రణాళికలు రూపొందించుకుని పూర్తి చేస్తాం. ఉపాధి హామీ బకాయిలు రెండు రోజుల్లో జమ అయ్యేలా చూస్తాం. అవసరం అయితే ఈ విషయంపై ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతాం. కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని గతంలో చెప్పాను. ఆ గ్రామ అవసరాలు తీర్చేందుకు సొంత ట్రస్ట్ నుంచి రూ.50 లక్షల నిధులు కేటాయించి సౌకర్యాలు కల్పిస్తాం. ప్రభుత్వం పథకాల ద్వారా చేయదగిన పనులు అధికారులతో మాట్లాడి పూర్తి చేస్తాం. కొణిదెల గ్రామంతోపాటు అన్ని గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తాం. ఒక్కో జిల్లాలో రెండు నుంచి మూడు రోజులు ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తాం” అన్నారు.
• తలకు పాగా చుట్టి.. గడ్డ పార చేతబట్టి
పంట పొలాల్లో సేద్యపు నీటి కుంటల (ఫామ్ పాండ్) ప్రారంభోత్సవానికి కర్నూలు జిల్లా, ఓర్వకల్లు మండలం, పుడిచర్లకు వచ్చిన ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఫామ్ పాండ్ తవ్వకానికి శ్రీకారం చుట్టారు. సొంత వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం అలవాటు ఉన్న ఆయన తలకు పాగా చుట్టి రైతుగా మారిపోయారు. గడ్డపార చేతబట్టి శంకుస్థాపనకు సిద్ధం చేసిన ప్రాంతంలో గణపతిని పూజించి కుంట తవ్వకాన్ని ప్రారంభించారు. గడ్డపారతో గుంత తవ్వి స్వయంగా మట్టిని పారతో ఎత్తి గంపలో వేశారు. ఉపాధి కూలీలతో కలసి పనిలో పాలు పంచుకోవడంతోపాటు వారందరినీ వేదిక మీదకు పిలిచి లబ్ధిదారులుగా పరిచయం చేశారు.
ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ భైరెడ్డి శబరి, పాణ్యం శాసనసభ్యురాలు శ్రీమతి గౌరు చరితారెడ్డి, నందికొట్కూరు శాసన సభ్యులు శ్రీ గిత్తా జయసూర్య, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ శ్రీ కృష్ణ తేజ, జిల్లా కలెక్టర్ శ్రీ రంజిత్ భాషా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


