
విద్యాకుసుమాలకు ‘ప్రశంసల’ పట్టాభిషేకం
‘పది’లో మెరిసిన విద్యార్థులకు హోంమంత్రి ఘన సన్మానం
సృజన, నైపుణ్యంతోనే చిన్నారుల భవితకు వెలుగు
మంత్రి నారా లోకేశ్ సంస్కరణలతో మరింత మెరుగ్గా విద్యావ్యవస్థ
ప్రభుత్వ పాఠశాలల చిన్నారులను మరింత ప్రోత్సహించాలన్నదే ధ్యేయం
నక్కపల్లి, మే 6:
హోంమంత్రి వంగలపూడి అనిత నేతృత్వంలో విద్యాకుసుమాలకు ప్రశంసల పట్టాభిషేకం జరిగింది. ‘పది’ ఫలితాల్లో మెరిసిన విద్యార్థులను ఆమె ఘనంగా సన్మానించింది. పాయకరావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఉత్తమ ప్రతిభను గుర్తించి సత్కరించింది. నక్కపల్లిలోని హోంమంత్రి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ‘విద్యాకుసుమాల అభినందన’ కార్యక్రమం సోమవారం అట్టహాసంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోం మంత్రి వంగలపూడి అనిత, 101 మంది మెరుగైన ప్రతిభ చూపిన పదోతరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున నగదు బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో 50 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, “గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు మట్టిలో మాణిక్యాలని. ప్రభుత్వ పాఠశాలలే నిజమైన శిక్షణ మందిరాలని.. ఉపాధ్యాయులు కనిపించే దేవుళ్లు” అని పేర్కొన్నారు. తాను కూడా ఉపాధ్యాయురాలిగా తన జీవితం ప్రారంభమైన విధానాన్ని ప్రస్తావించి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. విద్యారంగం పట్ల తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అంతేగాక, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి నాయకత్వంలో విద్యావ్యవస్థలో జరుగుతున్న సంస్కరణలను హోంమంత్రి అనిత ప్రశంసించారు. విద్యార్థుల విజయంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని తెలిపారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి ప్రశ్నలకు ఉత్సాహంగా సమాధానాలిచ్చారు. విద్యార్థులందరితో కలిసి కలిసి భోజనం చేసి ఆత్మీయంగా గడిపారు. ఈ కార్యక్రమం ఉపాధ్యాయులు, విద్యార్థులలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని తెలిపారు. విద్యాకుసుమాలను గుర్తించి వారి కృషి, వారి వెనక తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కఠోర శ్రమను గౌరవించి ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని హోంమంత్రి అనిత వెల్లడించారు. ప్రతి సంవత్సరం ఈ అభినందన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సంకల్పించినట్టు ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.