తిరుపతి – పళని మధ్య ఆర్టీసీ సర్వీసు ప్రారంభం
- బస్సు సర్వీసు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, రవాణా శాఖ మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
- షష్ట షణ్ముఖ యాత్ర సందర్భంగా పళనిలో భక్తులకు ఇచ్చిన హామీని నెరవేర్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
తిరుపతి-పళని ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య ఆంధ్రప్రదేశ్ నుంచి నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు గురువారం ప్రారంభించారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో వేద పండితులు శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం రవాణా శాఖ మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారితో కలిసి నూతన బస్సు సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బస్సులో కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళనాడులో షష్ట షణ్ముఖ యాత్ర చేపట్టాను. యాత్రలో భాగంగా పళని కొండపై వెలసిన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నాను. ఈ సందర్భంగా అక్కడి భక్తులు పళని నుంచి తిరుపతికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తోందని, రెండు, మూడు బస్సులు మారాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తమిళనాడు స్టేట్ కందన్ ఛారిటబుల్ ట్రస్ట్, పళని టౌన్ సిటిజన్ ఫోరమ్ సభ్యులు శ్రీ బాలాజీ, శ్రీ సుబ్రహ్మణ్యం గారు వినతి పత్రం అందించారు. వెంటనే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్లగా… ఆ మురగన్ ఆశీస్సులతో అరగంటలోనే అనుమతి లభించింది.
• 505 కిలోమీటర్లు… 680 రూపాయలు
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో తిరుపతి- పళని మధ్య రెండు లగ్జరీ బస్సులతో సర్వీసులు ప్రారంభించాం. తిరుపతి నుంచి పళనికి, పళని నుంచి తిరుపతికి ఒకే సమయంలో ఈ రెండు బస్సులు మొదలవుతాయి. 505 కిలోమీటర్ల ఈ ప్రయాణం దాదాపు 11 గంటలపాటు సాగుతుంది. తిరుపతి నుంచి రాత్రి 8 గంటల సమయంలో మొదలైన బస్సు చిత్తూరు, క్రిష్ణగిరి, ధర్మపురి మీదుగా ఉదయం 7 గంటల సమయంలో పళని చేరుకుంటుంది. అలాగే పళని నుంచి రాత్రి 8 గంటల సమయంలో మొదలైన బస్సు తిరుపతికి ఉదయం 7 గంటల సమయంలో చేరుకుంటుంది. భద్రతతో కూడిన ప్రయాణం ఇవ్వాలని ఈ సర్వీసులను ప్రారంభించాం. పెద్దలకు రూ.680, చిన్నపిల్లలకు రూ. 380గా టికెట్ ధరలు నిర్ణయించారు. ఇది కలియుగ దైవం వెంకన్న భక్తులకు, అలాగే మురగన్ ఆరాధించే భక్తులకు అనుసంధానంగా నిలుస్తుంద”ని అన్నారు.
• భక్తుల అభీష్టం మేరకు బస్ సర్వీసు : శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు రవాణా శాఖ మంత్రి
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ “తిరుపతి – పళని రెండు ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు. ఈ రెండు క్షేత్రాలను కలుపుతూ బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. భక్తుల అభీష్టం మేరకు ఈ సర్వీసును అందించడం వల్ల అందరికీ మేలు కలుగుతోంది. రెండు రాష్ట్రాల భక్తుల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పాటుకు ఇది బాటలు వేస్తుంది” అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, శాసనమండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, తిరుపతి శాసనసభ్యులు శ్రీ ఆరణి శ్రీనివాసులు గారు, ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ శ్రీ కొనకళ్ల నారాయణరావు గారు, ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ గారు, ఆర్టీసీ ఎండీ శ్రీ ద్వారకా తిరుమలరావు గారు తదితరులు పాల్గొన్నారు.



