
చివరి ఉగ్రవాదిని ఏరివేసే వరకు ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగాలి
• పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి భారత్ దీటైన జవాబు చెప్పింది
• ఉగ్రవాదంపై పోరాటంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి యావత్ జాతి మద్దతిస్తుంది
• క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి పౌరుడూ బాధ్యతగా వ్యవహరించాలి
• సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారం పోస్టులు పెట్టవద్దు
• భారత సైన్యాన్ని కించపరచినా… దేశ సమగ్రతకు విఘాతం కలిగేలా పోస్టులుపెడితే కఠిన చర్యలు
• కాంగ్రెస్ లో కొందరు నాయకులు తమ వైఖరిని మార్చుకుంటే మంచిది
• హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
‘భారతదేశ సమగ్రతను దెబ్బ తీసేందుకు ప్రయత్నించి, పహల్గాంలో 26 మంది సామాన్యులను బలిగొంటూ చేసిన ఉగ్రవాద దాడిని ప్రతి ఒక్కరం చూసాము. ఇందుకు ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ దేశం ఎదురు చూసింది. చివరి ఉగ్రవాదిని అంతం చేసే వరకు ఆపరేషన్ సిందూర్ ఆగకూడదు’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించారు. ఉగ్రవాదంపై పోరాటంలో గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు తీసుకునే ప్రతి నిర్ణయానికి ప్రతి భారతీయుడి సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. ఈ కీలక సమయంలో దేశ ప్రజలంతా ఏకతాటిపై నిలిచి, ఐక్యతను ప్రదర్శించాలన్నారు. దేశంపై జరిగిన దాడిని ప్రతి ఒక్కరు తీవ్రంగా పరిగణించాలని, భారత సైన్యం చర్యలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్ లోని ఆయన నివాసo వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్ కు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ను ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. పాక్ సైనిక కేంద్రాల జోలికి పోకుండా, సాధారణ పౌరులకు ఇబ్బందులు కలుగకుండా ఉగ్రవాద సంస్థలకు చెందిన శిబిరాలే లక్ష్యంగా భారత సైన్యం మందుకు సాగడం అభినందనీయం. క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు తీసుకునే ప్రతి నిర్ణయానికి ప్రజలంతా కట్టబడి ఉండాలి. భారతదేశ ఐక్యతను చాటాలి.
• ఉగ్ర దాడులపై బదులివ్వాలని ప్రతీ ఒక్క భారతీయుడు కోరుకున్నాడు
ఏప్రిల్ 22వ తేదీన పెహల్గాంలో ఉగ్రవాదులు మతం పేరిట మారణహోమం సృష్టించారు. 26 మంది పర్యటకులను దారుణంగా చంపేశారు. ఈ ఘటనతో దేశం మొత్తం శోకంలో మునిగిపోయింది. హిందువా? ముస్లిమా? అని అడిగి పర్యాటకులను చంపిన విధానం దారుణం. కలిమా చదవమని హిందువా, ముస్లిమా అని గుర్తించి మరీ చంపారు. ఇలాంటి ఘాతుకానికి దేశం సరైన రీతిలో బదులివ్వాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకున్నాడు. గత రాత్రి భారత సైన్యం 9 ప్రధాన ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు జరపడంతో మనం ఆపరేషన్ సిందూర్ ను మొదలుపెట్టాం. 15 నుంచి 200 కిలోమీటర్ల లోపలి వరకు భారత సైన్యం వెళ్లి, ఉగ్రవాద సంస్థలకు చెందిన శిబిరాలపై దాడులు చేసి ధ్వంసం చేయడం ఉగ్రవాదులకు భారత్ ఇచ్చిన జవాబు హర్షణీయం.
• ప్రతిసారి సహనం.. సహనం అంటూనే ఉన్నాం
కశ్మీర్ భారత దేశంలో అంతర్భాగం. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు కశ్మీరీ పండిట్స్ ని చంపేశారు. అంత్యక్రియలు చేయడానికి శ్మశానానికి తీసుకువెళ్లిన వారిని కూడా చంపేశారు. హిందువుల మీద దాడి అనాదిగా జరుగుతూనే ఉంది. సరైన సమయంలో సరైన చర్య శ్రీ మోదీ గారు తీసుకున్నారు. మన ఆర్మీ చేపడుతున్న చర్యలకు మద్దతు ఇస్తున్నాం. మేమంతా మీతో ఉన్నాం. ప్రత్యేకించి యుద్ధం సమయంలో పాకిస్థాన్ కి గట్టి పాఠం నేర్పాల్సి ఉంది. గతంలో లుంబినీ పార్క్, గోకుల్ చాట్ తదితర ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఏ ఘటన జరిగినా, ఎలాంటి ఉపద్రవం ఎదురైనా- సహనం, శాంతి అంటూనే ఇంతవరకు తెచ్చుకున్నాం. ఇప్పుడు గట్టిగా గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చింది. మితిమీరిన సహనంతో చేతులు కట్టేసిన సమస్త భారతానికి ఆపరేషన్ సిందూర్ తిరిగి వీరత్వాన్ని నింపింది.
• సెలబ్రిటీలు సైతం బాధ్యతగా వ్యవహరించాలి
శ్రీ మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అణగదొక్కేందుకు కఠిన చర్యలు తీసుకుంటోంది. మిలటరీ దళాలు యుద్ధం చేస్తున్నప్పుడు ఎవరూ, ఎక్కడా జాతీయ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదు. ఆ తరహా కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. సామాజిక మాధ్యమాల్లో బాధ్యతారాహిత్యంగా పోస్టులు పెట్టవద్దు. సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా కుక్కలా మొరగవద్దు. క్లిష్ట సమయంలో శ్రీ మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలి. త్రివిధ దళాల పోరాటాన్ని కించపరచేలా, దేశ సమగ్రతకు భంగం వాటిల్లేలా ఎవరు కామెంట్స్ చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ గారికి సూచించాను” అన్నారు.
ఈ సందర్భంగా ఒక ప్రశ్నకు సమాధానంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “దేశాన్ని సెలబ్రటీలు నడిపించడం లేదు. వారే దేశం మొత్తం గొంతుక కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వారు కూడా ఈ తరుణంగా బాధ్యతగా దేశ సమగ్రత కాపాడేలా మాట్లాడాలి.
పాకిస్థాన్ మీదా ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లిపోవాలి అనే మాట విషయంలో – పాకిస్థాన్ కి అనుకూలంగా మాట్లాడే కొద్దిమంది కాంగ్రెస్ నాయకులు అని మాత్రమే చెప్పాను. నేను చేసిన వ్యాఖ్యలకు జవాబుదారీతనంగా ఉంటాను. క్లిష్ట సమయంలో ప్రభుత్వానికి అండగా నిలబడాలి. పాకిస్థాన్ కు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నాయకులకు మాత్రమే నేను చెప్పాను. వారు తమ వైఖరి మార్చుకుంటే మంచిదే కదా.. ఇది దేశం మొత్తం చేస్తున్న యుద్ధం. ఇలాంటి సమయంలో పాకిస్థాన్ కి మద్దతుగా మాట్లాడడం తప్పు అని మాత్రమే చెప్పాను.
• ఘాజీ లాంటి సబ్ మెరైన్లు విశాఖ వరకూ వచ్చాయని గుర్తుంచుకోవాలి
ఎవరి పని వారు శ్రద్ధగా, నిబద్ధతతో జాతి ప్రయోజనాల కోసం చేసుకోవాలి. దేశాన్ని ప్రేమించాలి. ఉద్రికత్త పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తో సహా అన్ని రాష్ట్రాలూ కేంద్రానికి మద్దతుగా నిలబడతాయి. ఈ రోజు మాక్ డ్రిల్ దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఎవరికి వారు బాధ్యతతో మాట్లాడాలి. సోషల్ మీడియాలో సైతం జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఏ మాత్రం ఇష్టానుసారం మాట్లాడినా చట్ట ప్రకారం చర్యలుంటాయి. కేవలం ఇది సరిహద్దుల్లో జరుగుతున్న వ్యవహారం కాదు. ఆంధ్రప్రదేశ్ కు కూడా 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ప్రమాదం ఎటు వైపు నుంచి అయినా మన మీదకు వచ్చే అవకాశం ఉంది. గతంలో ఘాజీ లాంటి సబ్ మెరైన్లు విశాఖ తీరం వరకు వచ్చాయంటే దాని అర్థం… మనకు ప్రమాదం అన్ని వైపుల నుంచి పొంచి ఉంది. కాబట్టి ప్రజలంతా నిరంతరం అప్రమత్తంగా ఉండటం ప్రధానం. అందులోనూ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మరింత జాగ్రత్త అవసరం’’ అన్నారు.