Uncategorized
Spread the love

షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కు భూకేటాయింపులపై సమగ్ర విచారణ చేయండి

  • సత్వరమే నివేదిక ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశం
  • తిరుపతిలోని దివ్యరామం క్షేత్రంలో చెట్లు నరికేయడంపై విచారణకు ఆదేశం
  • శేషాచలంలో ఫెన్సింగ్ ధ్వంసంపైనా నివేదిక కోరిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు

షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి చెందిన భూములు శేషాచలం వైల్డ్ లైఫ్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తాయని వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలపై తక్షణం నివేదిక ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. ఈ మేరకు పీసీసీఎఫ్ కు ఆదేశాలిస్తూ విచారణ చేసి సత్వరమే నివేదిక ఇవ్వాలన్నారు. షిరిడీ సాయి కంపెనీకి కేటాయించిన భూముల్లో అటవీ భూముల క్రమబద్దీకరణ చట్టం 1980 నిబంధనలు పూర్తిగా గాలికి వదిలేశారని, అటవీ చట్టాలను పూర్తిగా ఉల్లంఘించి కేటాయింపులు జరిపారని వచ్చిన మీడియా కథనాలను ఉప ముఖ్యమంత్రివర్యులు పరిశీలించి అధికారులతో సమీక్షించారు. భూ కేటాయింపులు, సంబంధిత వివరాలు నివేదిక రూపంలో అందజేయాలని, కేటాయింపుల ప్రక్రియపైనా వివరాలు ఇవ్వాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు.
వన్యప్రాణుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి
– సామాజిక మాధ్యమాల్లో వివరాలు చూసి స్పందించిన ఉప ముఖ్యమంత్రి
తిరుపతిలోని శేషాచలం అడవులకు ఆనుకుని ఉన్న ఉపాధ్యాయనగర్ గ్రాండ్ వాల్ట్ రోడ్డులో అటవీ సరిహద్దు కంచె ధ్వంసం కావడంతో వన్యప్రాణులు దప్పిక కోసం, తిండి కోసం బయటకు వస్తూ ప్రాణాపాయ పరిస్థితిలోకి వెళ్తున్నాయని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వివరాలు చూసి ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని తిరుపతి అటవీ, బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ పరిధిలో ఉన్న ఫెన్సింగ్ కు తగిన మరమ్మతులు చేయాలని అటవీ అధికారులను ఆదేశించారు. శేషాచలం పరిధిలో మానవ ఆవాసాలకు అనుసంధానం అయిన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, నీటి తొట్టెల ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే వన్యప్రాణుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. శేషాచలం పరిధిలో ఉన్న కంచె పాడవడానికిగల కారణాలను తెలియజేయాలని ఆదేశించారు.
దివ్యారామం చెట్లు నరికేయడంపై సీరియస్
తిరుపతిలో శేషాచలం అడవుల పరిధిలో అటవీ శాఖ అత్యంత సుందరంగా నిర్మించిన దివ్యారామం క్షేత్రంలో జంగిల్ క్లియరెన్స్ సందర్భంగా చెట్లు నరికేయడంపై ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై పీసీసీఎఫ్ శ్రీ పి. చలపతిరావును విచారణ చేయాలని ఆదేశించారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *