వ్యక్తిగత అజెండాలు వదిలిపెట్టాలి… ప్రజా సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యం

Spread the love
  • క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలి
  • శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు, పార్టీ సిద్ధాంతాలు ముఖ్యం
  • సామాన్య కార్యకర్త కూడా అత్యున్నత స్థానానికి ఎదిగే అవకాశం జనసేనలో  ఉంది
  • జనసేనలో చేరికల కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు
  • జనసేనలో చేరిన పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, నందిగామ నియోజక వర్గాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు

‘జనసేన పార్టీలో కొత్తగా చేరే వారు క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలి. ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చే వారు వారి వ్యక్తిగత అజెండాలు వదిలిపెట్టి, ప్రజా సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాల’ని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు దిశా నిర్దేశం చేశారు. సోమవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, నందిగామ నియోజక వర్గాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు జనసేనలో చేరారు. వీరికి శ్రీ నాగబాబు గారు కండువాలు వేసి సాదరంగా స్వాగతించారు.

ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ “శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు, పార్టీ సిద్ధాంతాలు మనందరికి ముఖ్యం. అందుకు అనుగుణంగా ముందుకు వెళ్దాం. అవసరంలో ఉన్న వారికి సేవ చేయాలని శ్రీ పవన్ కల్యాణ్ గారు నేర్పించిన బాటలో నడవాలి. స్వప్రయోజనాల కోసం పార్టీని, రాజకీయాలను ఉపయోగించుకోవద్దు. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఏం చేసినా చెల్లుతుందనే భావన పెట్టుకోవద్దు. జనసేనలో నాతో పాటు ఎంతో మంది నాయకులు పదేళ్లుగా పార్టీలో పని చేస్తున్నారు.శ్రీ పవన్ కళ్యాణ్ గారు అప్పచెప్పిన బాధ్యతలు నిర్వర్తించడం, పార్టీ బలోపేతం కోసం పని చేయడం మినహా స్వప్రయోజనాలను ఎన్నడూ ఆశించలేదు. సామాన్య కార్యకర్త కూడా అత్యున్నతమైన స్థానానికి ఎదిగే అవకాశం జనసేనలో ఉంది” అన్నారు.

శాసనమండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు మాట్లాడుతూ “దేవుడి అభిషేకానికి కొందరు కాలువల నుంచి, ఇంకొందరు నదుల నుంచీ జలాలు తీసుకువెళ్తారు. ఏ నీరు తీసుకువెళ్లినా దేవుడికి అభిషేకించిన అనంతరం అది తీర్థంగా మారుతుంది. ఇతర పార్టీల నుంచి జనసేన పార్టీలో చేరే కార్యకర్తలు కూడా మన సిద్ధాంతాలను అనుసరించి ప్రజలకు చేరువవుతారు. ప్రజల కోసం నిలిచిన సామాన్యులకి ఇక్కడ మంచి అవకాశాలు లభిస్తాయి. జనసేన పార్టీ బలోపేతం కోసం పని చేసే ప్రతీ కార్యకర్తకు గుర్తింపు, గౌరవం ఉంటుందనడానికి నిదర్శనం నేనే. పాత్రికేయుడిగా ఉన్న నేను పార్టీలోకి వచ్చాను. ఇప్పుడు లెజిస్లేటివ్ కౌన్సిల్లో విప్ స్థాయికి రావడానికి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు, పార్టీ నేతలు అండగా ఉంటూ ప్రోత్సాహమే కారణం” అన్నారు.  జనపార్టీ అధికార ప్రతినిధి, టిడ్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను గారు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నారు.

  • శ్రీ నాగబాబు గారు సమక్షంలో జనసేనలో భారీ చేరికలు..

చిత్తూరు జిల్లా పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజక వర్గాలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, వివిధ కార్పొరేషన్, మార్కెట్ యార్డు, విద్యాలయ, దేవాలయ కమిటీలకు చెందిన చైర్మన్ లు, డైరెక్టర్లు, మాజీ జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్, వైసీపీ జిల్లాస్థాయి నాయకులు, యువజన విభాగం నాయకులు, వ్యాపారస్తులు జనసేన పార్టీలో చేరారు. పీలేరు ఇంఛార్జి శ్రీ బి.దినేష్, నందిగామ. పుంగనూరు, చంద్రగిరి పి.ఓ.సి.లు  శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి, శ్రీ సిరివేలు గంగాధర్, శ్రీ దేవర మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *