Uncategorized

ప్రగతి.. శ్రేయస్సే కూటమి ప్రభుత్వ లక్ష్యం., డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Spread the love

రాష్ట్ర ప్రగతి.. ప్రజా శ్రేయస్సే కూటమి ప్రభుత్వ లక్ష్యం

• ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్ సిక్స్ హామీలను ను అమలు చేస్తున్నాం

  • త్వరలో ప్రతి కుటుంబానికీ ఆరోగ్య బీమా
    • పల్లె పండుగ ద్వారా పెద్ద ఎత్తున గ్రామీణ రహదారుల అభివృద్ధి
    • అడవి తల్లి బాటతో మారుమూల గిరిజన గ్రామాల రోడ్లు
    • రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం
    • కూటమి పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి పరుగులు
    • 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ని దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం
    • సూపర్ సిక్స్.. సూపర్ హిట్ సభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
  • అనంతపురం, 10/9/2025,pvginox..com by PALLA VENUGOPAL )

‘రాష్ట్రం బాగుండాలి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి’ అన్న ఆకాంక్షతో కూటమి ప్రభుత్వం త్రికరణ శుద్ధితో పని చేస్తోందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్ర ప్రగతి.. ప్రజల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సూపర్ సిక్స్ హామీలను దిగ్విజయంగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు త్వరలో రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా వర్తింపచేసే పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయబోతోందని తెలిపారు. బుధవారం అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్.. సూపర్ హిట్ సభకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాధవ్ గారితో కలసి హాజరయ్యారు. ఈ సందర్భంగా సభకు విచ్చేసిన జన వాహినిని ఉద్దేశించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ..
“శివతాండవం కావ్యం రచించిన కవి శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు పుట్టిన నేల రాయలసీమ. తెలుగు భాష గౌరవం పెంచిన నేల. శ్రీ బళ్లారి రాఘవ గారు లాంటి రంగ స్థల ప్రముఖులు, శ్రీ విద్వాన్ విశ్వం గారు, శ్రీ గజ్జల మల్లారెడ్డి గారు లాంటి మహానుభావులు పుట్టిన నేల మన రాయలసీమ. కొందరు కవులు చెప్పింది– రుతువులు ఎన్నున్నా.. మా రాళ్ల సీమకు ఒకటే రుతువు. అదే కరువు రుతువు. కాలాలు ఎన్నున్నా మా రాయలసీమకు ఉన్నది ఒకటే కాలం… ఎండా కాలం. ఆ పరిస్థితులను రూపుమాపేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తోంది. రాళ్ల సీమను రతనాల సీమగా మార్చే ప్రణాళికలతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ముందుకు వెళ్తుంది. పారిశ్రామికంగా, వ్యావసాయికంగా ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకువెళ్తాము.
• అన్నింటా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాం
కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోంది. పర్యాటక రంగంలో 10 వేల కోట్ల మేర పెట్టుబడులు రాబట్టబోతున్నాం. గ్రామ స్వరాజ్య స్థాపన లక్ష్య సాధనలో భాగంగా పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు స్వీకరించిన వెంటనే 13, 326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించాం. పల్లె పండుగ ద్వారా గ్రామాల్లో 4 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 2007 కిలోమీటర్ల బీటీ రోడ్లు నిర్మాణం పూర్తి చేశాం. రైతులకు అండగా లక్షా 55 వేల నీటి కుంటలు నిర్మించాం. తద్వారా ఒక టీఎంసీ నీటిని నిల్వ చేయగలిగాం. మూగజీవాల దాహర్తి తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల నీటి తొట్టెలు నిర్మించాం. 22,518 మినీ గోకులాల నిర్మాణం చేపట్టి పాడి రైతులకు మేలు చేశాం. అడవితల్లి బాట కార్యక్రమం ద్వారా గిరిజన గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాం. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో పీఎం జన్ మన్ పథకం, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల తోపాటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రూ. 1,005 కోట్లతో 625 గిరిజన గ్రామాలను అనుసంధానం చేస్తూ 1,069 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మిస్తున్నాం. తద్వారా గిరిజన ప్రాంతాల్లో నివశించే గర్భిణి స్త్రీలకు డోలీ మోతల కష్టాల నుంచి విముక్తి కల్పించనున్నాం.

  • శాంతి భద్రతల పరిరక్షణ వ్యవహారంలో తరతమ బేధాలు చూడం
    రూ. 7,910 కోట్ల వ్యయంతో జల్ జీవన్ మిషన్ కింద 5 ప్రాజెక్టులు చేపట్టాం. అటవీ విస్తీర్ణాన్ని పెంచే లక్ష్యంతో కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు అటవీ ఏనుగుల బెడద నుంచి రక్షణ కల్పించేందుకు కర్ణాటక ప్రభుత్వ సహకారంతో నాలుగు కుంకీ ఏనుగులను రాష్ట్రానికి తీసుకువచ్చాం. శాంతి భద్రతల పరిరక్షణ వ్యవహారంలో తరతమ బేధాలు లేకుండా ముందుకు వెళ్తామని శాసన సభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. నేనూ అదే మాటిచ్చాను. ఆ మాటకు కట్టుబడి ముందుకు వెళ్తున్నాం. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉన్నప్పుడే రాష్ట్రంలోకి పెట్టుబడులు వస్తాయి. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా రాయలసీమ యువత ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా ఉన్న చోటే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా పారిశ్రామికీకరణ చేపట్టే విధంగా శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రణాళికలు రూపొందిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులో త్రికరణ శుద్దితో పని చేస్తుంది. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ విజన్ దిశగా, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ, 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మాటిస్తున్నాను” అన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాధవ్ గారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *