
(09/10/2025,pvginox.com By PALLA VENUGOPAL )
ఓ మత్స్యకారుడిగా ఆలోచించి సమస్యను పరిష్కరిస్తా
- తీర ప్రాంత కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం
- వంద రోజుల్లో సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తాం
- పిఠాపురం మోడల్ ను రాష్ట్రమంతటా అమలు చేస్తాం
- మూడు రోజుల్లో మళ్లీ వస్తా
- సముద్రంలోకి వెళ్లి కాలుష్య ప్రాంతం పరిశీలిస్తా
- పారిశ్రామికవేత్తలను బెదిరించే నాయకుల వలలో మత్స్యకారులు పడొద్దు
- మత్స్యకారులు వేదనతో ఒక మాట అన్నా తీసుకొనేందుకు నేను సిద్ధంగా ఉన్నా
- మాటలు చెప్పడం కాదు.. సమస్యను పరిష్కరించడంపైనే నా దృష్టి
- ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ పూర్తి చేసే బాధ్యత నాది
- ఉప్పాడ బహిరంగ సభలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
నేను ఉప ముఖ్యమంత్రిగానో, ఎమ్మెల్యేగానో ఉప్పాడకు రాలేదు. ఓ మత్స్యకారుడి బాధను అర్థం చేసుకోవడానికి వారి ఇంట్లోని సభ్యుడిగా, వారిలో ఒకడిగా వచ్చాను. నాకు మత్స్యకారులు పడుతున్న వేదన, వేట కోసం పడుతున్న యాతన తెలిసింది అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. పరిశ్రమల ద్వారా సముద్రంలో కలుస్తున్న కలుషిత జలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటే కనీసం 100 రోజుల సమయం కావాలని, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే పరిష్కారాన్ని చూపించే బాధ్యతను తాను తీసుకుంటానని వెల్లడించారు. పిఠాపురం నియోజక వర్గంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని పరిశ్రమల కలుషిత జలాలు నేరుగా సముద్రంలో కలుస్తుండటంతో జరుగుతున్న నష్టాన్ని అరికట్టేందుకు, అన్ని శాఖలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లేందుకు తగిన సమయం కావాలన్నారు. ఉప్పాడ మత్స్యకారులంతా దీనిపై చేతులు పైకి ఎత్తి అభిప్రాయం తెలియజేయాలని బహిరంగ సభలోనే రిఫెరండం కోరారు. పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడ కొత్తపల్లి గ్రామంతోపాటు చుట్టు పక్కలనున్న గ్రామాల్లో కొన్ని ఫార్మా పరిశ్రమల కాలుష్యం కారణంగా మత్స్య సంపద దెబ్బ తింటోందని, వేట కష్టం అవుతోందని గత కొద్దిరోజులుగా మత్స్యకారులు చేస్తున్న ఆందోళనల దృష్ట్యా సమస్యను పరిష్కరించేందుకు, మత్స్యకారుల వేదన వినేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారులతో మాటామంతీ కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ లో నిర్వహించారు. అనంతరం ఉప్పాడ సెంటర్లో బహిరంగసభలో ప్రసంగించారు. ఈ సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘‘పరిశ్రమలను మత్స్యకారులెవరూ వద్దు అనడం లేదు. పరిశ్రమల వల్ల వస్తున్న కాలుష్యాన్ని మాత్రమే వారు వ్యతిరేకిస్తున్నారు. ఇది మత్స్యకారులకు అభివృద్ధి మీద ఉన్న అవగాహనకు నిదర్శనం. రాష్ట్ర అభివృద్ధిలో పారిశ్రామిక ప్రగతి కీలకం. పరిశ్రమలు వస్తేనే రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. దీన్ని మనసుతో అర్ధం చేసుకున్న మత్స్యకారులకు కృతజ్ఞతలు. అయితే మత్స్యసంపదను, వారి జీవనభృతిని దెబ్బతీస్తున్న కాలుష్యాన్ని అరికట్టడంపై ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు తగిన సమయం కావాలి. తీర ప్రాంతంతో పాటు పిఠాపురం చుట్టు పక్కల ప్రాంతాల్లోకి పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం మీద కూడా ఆడిట్ చేయాలని జిల్లా అధికారులను కోరుతున్నాం. దీనిపై ఓ ప్రత్యేకమైన కమిటీ వేసి సమస్యను గుర్తించడమే కాదు.. దాని పరిష్కారాన్ని చూపేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తాం.
- సముద్రంలోకి వెళ్లి కాలుష్యాన్ని పరిశీలిస్తా
మత్స్యకారుల సమస్యపై ఏదో ఒకటి చెప్పి, చప్పట్లు కొట్టించుకొని వెళ్లిపోవడానికి నేను రాలేదు. మీలో ఒకడిగా సమస్యను వింటాను. అర్ధం చేసుకుంటాను. నా సోదర మత్స్యకారులు తమ బాధలో ఏదైనా మాట అంటే పడతాను. ప్రస్తుత కాలుష్య సమస్య ఇప్పటిది కాదు. 2005 ప్రాంతంలోనే నక్కపల్లి సెజ్ కు, ఇక్కడి పరిశ్రమల స్థాపనకు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అనుమతులు ఇచ్చారు. గతంలో పెట్టిన పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్య సమస్యను పరిష్కరించేందుకు, అసలు క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని చూసేందుకు నేరుగా ఓ పడవలో సముద్రంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. మరో రెండు, మూడు రోజుల్లో ఇక్కడకు వచ్చి సముద్రంలోకి వెళ్లి కాలుష్య సమస్యను తెలుసుకుంటాను. మత్స్యకారులు మనసున్న వారు. ఎవరికీ అపకారం చేయాలని, పొట్ట కొట్టాలని అనుకోరు. వేటకు వెళ్లేవారికి కాస్త కోపం సహజం. ఆ కోపంలో నన్ను ఏమైనా అన్నా, పడటానికి నేను సిద్ధంగానే ఉన్నాను.
అయితే పారిశ్రామిక వేత్తలను కొందరు రాజకీయ నాయకులు మత్స్యకారులను అడ్డు పెట్టుకొని బెదిరించినా, భయపెట్టినా సహించేది లేదు. మత్స్యకారులు కూడా అలాంటి వారి వలలో పడొద్దని కోరుతున్నాను. పరిశ్రమల కాలుష్యం వల్ల ఇబ్బంది పడుతున్న వారికి ఎలాంటి పరిహారం అందాలి..? దానికున్న మార్గాలను కూడా విపులంగా చర్చిస్తాం. - ఆక్వా రంగానిదీ రాష్ట్రంలో కీలకమైన స్థానం
రాష్ట్రంలో ఆక్వా రంగానిది కీలకమైన స్థానం. రూ.1.3 లక్షల కోట్ల ఆదాయం వస్తోంది. ప్రత్యక్షంగా 3.72 లక్షల మందికి, 15 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. అలాంటి ఆక్వా రంగంలోనూ కాలుష్య సమస్యలున్నాయి. గతంలో భీమవరంలో ఆక్వా పార్కు గురించి జరిగిన వివాదంలో పోలీసు కేసులు మిగిలాయి తప్ప, సమస్యకు పరిష్కారం రాలేదు. మత్స్యకారులకు సంబంధించిన పిఠాపురం నియోజకవర్గంలోని సమస్యకు పరిష్కార మార్గం రాష్ట్రం మొత్తం మీద ఓ రోల్ మోడల్ కావాలి. దీన్ని రాష్ట్రమంతటా అమలు చేసేలా సర్వ ఆమోదిత మార్గం తీసుకొస్తాం. జనసేన పార్టీ విధానం కూడా పర్యావరణానికి చేటు చేయని అభివృద్ధి ప్రస్థానం. దాన్ని కచ్చితంగా అమలు చేస్తాం. తెలంగాణ తరహాలో పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను పూర్తిస్థాయిలో శుద్ధి చేసే ప్రణాళికను పటిష్టంగా అమలు చేస్తాం. దానికి ముందున్న మార్గాలను వెతుకుతాం. - తీర ప్రాంత రక్షణ గోడను నిర్మించే బాధ్యత తీసుకుంటాను
ఉప్పాడ ప్రాంతంలో మరో కీలకమైన సమస్య తీర ప్రాంత కోత నివారణ. ఏటా 20 నుంచి 25 మీటర్ల ప్రాంతం కోతకు గురవుతోంది. దీనిపై ఇప్పటికే దృష్టి సారించాం. వేగంగా తీర ప్రాంతం కోతకు గురవుతున్న నేపథ్యంలో కోస్టల్ రెగ్యూలేటరీ అథారిటీ అధికారులు కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. దానికి పరిష్కార మార్గాలను సూచించారు. అధికారులు తీర ప్రాంతం రక్షణ గోడ నిర్మాణ నిమిత్తం రూ.323 కోట్లు అవసరం అవుతుందని ప్రతిపాదనలు పంపారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు సమావేశాలు అయ్యాయి. ఈ నెల 14వ తేదీన మరో సమావేశం ఉంది. కచ్చితంగా కేంద్ర పెద్దలను ఒప్పించి అయినా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణాన్ని ప్రారంభించే బాధ్యత నేను తీసుకుంటాను. అయితే భారీ స్థాయి నిధులు కావడంతో దశలవారీగా వచ్చేలా చూస్తాను. దీనిపై కేంద్రం సానుకూలంగానే ఉంది. దీంతో పాటు రూ.5.65 కోట్ల నిధులతో ఉప్పాడ – కోనపాపపేట మార్గం నిర్మాణం త్వరలో జరగనుంది. సముద్ర రక్షణ గోడ నా హయాంలోనే పూర్తవుతుంది. నా మీద నమ్మకం ఉంచండి. నేను మీలో ఒకడిగానే ఇక్కడి సమస్యలను పరిష్కరించేలా దృష్టి పెడతాను’’ అన్నారు.
ఈ సమావేశంలో కాకినాడ ఎంపీ శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు, శాసనమండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ వనమాడి కొండబాబు గారు, ఎమ్మెల్సీ శ్రీమతి కర్రి పద్మశ్రీ గారు, డీసీసీబీ ఛైర్మన్ శ్రీ తుమ్మల బాబు గారు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్ గారు, పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నేత శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరావు గారు, పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి శ్రీ ఎస్వీఎస్ఎన్ వర్మ గారు పాల్గొన్నారు.
మత్స్యకార సమస్యల పరిష్కారానికి 100 రోజుల్లో రోడ్ మ్యాప్
- సమస్యలపై ప్రాథమిక పరిష్కార మార్గాలు అన్వేషిస్తాం
- రెండు, మూడేళ్లలో ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం పూర్తి చేసేలా అడుగులు
- ఫిషింగ్ హార్బర్ డిజైన్ మార్పులకు ప్రత్యేక కమిటీ
- కాలుష్య కారక పరిశ్రమల్లో పొల్యూషన్ ఆడిట్… వారంలోగా నివేదిక
- పొల్యూషన్ ఆడిట్ పారిశ్రామికవేత్తలను భయపెట్టేందుకు కాదు.. సమస్య తీవ్రత తెలుసుకునేందుకు
- త్వరలో మత్స్యకారులతో కలసి సముద్ర జలాల్లో కాలుష్యం పరిశీలన.కాకినాడ కలెక్టరేట్ లో మత్స్యకారులతో మాటా మంతి కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
‘మత్స్యకారుల జీవితాలకు భరోసా కల్పించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తుంది. తూతూ మంత్రం చర్యలు కాకుండా మత్స్యకారుల సమస్యలను పరిష్కరించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తాం. 100 రోజుల్లో మత్స్యకారులు చెప్పిన ప్రతి సమస్యకు ప్రాథమిక పరిష్కార మార్గాలు చూపే విధంగా రోడ్ మ్యాప్ రూపొందిస్తామ’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. తీరంలో కాలుష్య సమస్యకు పరిష్కారం చూపే దిశగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పని చేస్తామని చెప్పారు. అందుకోసం తన అధ్యక్షతన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయిలో నూతన పొల్యూషన్ పాలసీ తీసుకురానున్నట్టు తెలిపారు. అంతకు ముందే సమస్య ఉన్న పరిశ్రమల్లో పొల్యూషన్ ఆడిట్ నిర్వహించనున్నట్టు చెప్పారు. గురువారం కాకినాడ కలెక్టరేట్ లో మత్స్యకార సోదరులతో మాట… మంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. యు.కొత్తపల్లి మండల పరిధిలోని తీర ప్రాంత గ్రామాల నుంచి వచ్చిన మత్స్యకార ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సుమారు 15 మంది తమ సమస్యలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. మత్స్యకారులు చెప్పిన ప్రతి సమస్యను ఓపికగా విని అన్నింటినీ నోట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా వేటకు వెళ్లి మృతి చెందిన మత్స్యకారులకి సంబంధించిన బీమా చెక్కులను రూ.5 లక్షల చొప్పున 18 కుటుంబాలకి విడుదల చేశారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “మత్స్యకార సోదరులు పలు సమస్యలు నా దృష్టికి తీసుకువచ్చారు. అందులో తీర ప్రాంతం కోతకు గురవుతున్న అంశం ముఖ్యమైనది. ఉప్పాడ తీర ప్రాంతం ఏటా సుమారు 25 మీటర్ల మేర కోతకు గురై సాగరంలో కలసిపోతుంది. ఇది ప్రకృతి విపత్తు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భావించాం. జిల్లా కలెక్టర్ గారితోపాటు ఉన్నతాధికారుతో సమస్యపై చర్చించాం. కోత సమస్య నివారణకు రక్షణ గోడ నిర్మాణం అవసరం ఉంది. దానికి రూ. 300 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని సి.ఆర్.జెడ్. చెన్నై అధికారులు తెలిపారు. అయితే తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిధిలో ఉంది. ఉప్పాడ తీరంలో రక్షణ గోడ నిర్మాణం కోసం గౌరవ కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారికి విన్నవించాము. అక్కడ నుంచి సానుకూల స్పందన వచ్చింది. వచ్చే రెండు, మూడేళ్లలో ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం పూర్తి కావాలని కోరుకుంటున్నాం. అందుకోసం అవసరం అయితే మరోసారి ఢిల్లీ వెళ్ళి మాట్లాడుతా. ఈ గోడ నిర్మాణం పూర్తయితే 50 ఏళ్ల పాటు అది మన తీర ప్రాంతానికి రక్షణ కవచంగా ఉంటుంది. అప్పటి వరకు రూ. 6 కోట్లు ఖర్చు చేసి తాత్కాలిక రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే రూ. 60 లక్షలు ఖర్చు చేసి మూలపేట వద్ద తాత్కాలిక రక్షణ పనులు ప్రారంభించాం. సీఎస్ఆర్ నిధులు, ప్రభుత్వం నిధులతో సౌకర్యాలు కల్పిస్తున్నాం.
- హార్బర్ డిజైన్ లో లోపాల సవరణకు నిపుణుల కమిటీ
గత ప్రభుత్వ హయాంలో హార్బర్ నిర్మాణానికి డిజైన్ చేశారు. డిజైన్ లోపాల కారణంగా సముద్రపు అలల అలజడికి బోట్లు, వలలు ధ్వంసం అవుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి డిజైన్ లో మార్పులు చేయాల్సి ఉంది. అందుకోసం చెన్నై ఐఐటీ వారితో చర్చిస్తున్నాం. హార్బర్ డిజైన్ మార్పులపై నిపుణుల కమిటీ వేసి పరిష్కార మార్గాలు అన్వేషిస్తాం. ఉపముఖ్యమంత్రి పేషీ నుంచి దాన్ని పర్యవేక్షిస్తాం. - ప్రజల కోసం పని చేసేటప్పుడు పార్టీలు చూడం
మీ సమస్యపై ప్రభుత్వం మీద ధైర్యంగా గళం విప్పడం ఆనందాన్నిచ్చింది. ప్రభుత్వాలు పార్టీలకతీతంగా ప్రజల కోసం పని చేయాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి వచ్చే నిధులు అన్ని పంచాయతీలకు సమంగా పంపిణీ చేశాం. వైసీపీ సర్పంచులు అని ఎక్కడా ఆలోచించలేదు. రూ. వెయ్యి కోట్ల 15వ ఆర్ధిక సంఘం నిధులు పంచాయతీల ఖాతాల్లో వేశాం. ప్రజల కోసం పని చేసేప్పుడు ఏ పార్టీ అని చూడకుండా కూటమి ప్రభుత్వం పారదర్శకతతో వ్యవహరిస్తుంది.
తీర ప్రాంత కాలుష్యం గురించి మత్స్యకార సోదరులు చెబుతున్నది ఒక్కటే. పరిశ్రమలను మేము వ్యతిరేకించడం లేదు.. కానీ మా జీవనోపాధి పరిస్థితి ఏంటి? అని అడుగుతున్నారు. నేను ఓ మత్స్యకారుడినైతే అన్న కోణంలో ఆలోచన చేసి ఈ సమస్యకు పరిష్కారం చూపుతా. అభివృద్ధి కావాలి అంటే అది ఎంతోకొంత పర్యావరణ సమతుల్యతను దెబ్బ తీస్తుంది. అమెరికాలోని మిషిగాన్ ప్రాంతంలో 1969లో సరస్సులు కాలుష్యం బారిన పడుతున్నట్టు గుర్తించారు. అప్పట్లోనే ఒక చెరువుని తిరిగి శుద్ధి చేసుకున్నారు. 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న మన రాష్ట్ర అభివృద్ధి మొత్తం పరిశ్రమల మీదే ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి కృష్ణా, గోదావరి జిల్లాల్లో వందల సంఖ్యలో ఆక్వా హ్యాచరీస్ ఉన్నాయి. మన రాష్ట్రంలో ఆక్వా పరిశ్రమ ప్రత్యక్షంగా 3.78 లక్షల మందికి, పరోక్షంగా 15 లక్షల మందికి ఉపాధి ఇస్తుంది. ఆక్వా పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి రూ.1.3 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. అయితే గతంలో ఆ జిల్లాల్లో తాగునీటి కొరత లేదు. ఇప్పడు సీసాల్లో నీరు కొనుక్కుని తాగాల్సి వస్తుంది. ఒక పర్యావరణ ప్రేమికుడిగా నన్ను ఇది బాధించింది. అలా అని ఆక్వా కల్చర్ ఆపేయమంటే సుమారు 24 లక్షల కుటుంబాల మీద దాని ప్రభావం పడుతుంది. దివీస్ పరిశ్రమ ఏర్పాటు సమయంలో గొడవ జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతానికి వెళ్తే అసలు ప్రొడక్షనే మొదలుపెట్టకుండా వ్యర్ధాల గురించి ఎలా మాట్లాడతామని అడిగారు. మేము ఆలోచించేది ఒక్కటే. పరిశ్రమలు రావాలి. ఉపాధి రావాలి. చుట్టు పక్కల గ్రామాల ప్రజల జీవనోపాధి దెబ్బ తినకుండా చూడాలి. అలా అని గొడవ పడితే సమస్య పరిష్కారం కాదు. - సమస్యకు కచ్చితమైన పరిష్కారం వెతుకుతాం
మత్స్యకార సోదరులతో మాట్లాడే సమయంలో రెండు పరిష్కార మార్గాలు ప్రస్తావించారు. వ్యర్ధాలను శుద్ధి చేసి వదలాలి. లేదా చేపలు గుడ్లు పెట్టే రెండు నెలలు వ్యర్ధాలు సముద్రంలోకి వదలకుండా ఆపాలి అని అడిగారు. ఈ అంశాలపై అధ్యయనం చేసేందుకు ఒక కమిటీ వేస్తాం. గత ప్రభుత్వం మాదిరి మేము పారిశ్రామికవేత్తలను భయపెట్టి, బ్లాక్ మెయిల్ చేసి తర్వాత డబ్బు తీసుకుని సమస్యను గాలికి వదిలేయం. సమస్యకు కచ్చితమైన పరిష్కారం వెతుకుతాం. పరిశ్రమలు ఎంత మేర వ్యర్ధాలను విడుదల చేస్తున్నాయి. శుద్ధి చేయకుండా వదులుతుంటే వారికున్న సమస్య ఏంటి? తదితర అంశాలపై పొల్యూషన్ ఆడిట్, ఎన్విరాన్మెంట్ ఆడిట్ నిర్వహిస్తాం. ఆడిట్ అనగానే పారిశ్రామికవేత్తలు భయపడతారు. ఇది భయపెట్టడానికి కాదు. ఎక్కడ పరిశ్రమలు స్థాపించినా కాలుష్యం ఎంత వస్తుంది? ఎంత శుద్ధి చేసి వదులుతున్నారు? అనే అంశాలు తెలుసుకోవాలి. ప్రస్తుతం ఉప్పాడ తీరంలో సమస్య ఉన్న పరిశ్రమలపై వారం రోజుల్లో పొల్యూషన్ ఆడిట్ నిర్వహించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించాం.
పరిశ్రమల కాలుష్యం సముద్ర జలాల్లో కనబడుతుందని మత్స్యకార సోదరులు చెప్పారు. మూడు రోజుల్లోపు బోటులో సముద్రంలోకి వస్తాను. పరిశ్రమల కాలుష్య ప్రభావాన్ని ప్రత్యక్షంగా పరిశీలిస్తాను. కాలుష్యం ఎక్కడ ఉందో చూపండి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు క్లీన్ అండ్ గ్రీన్ ఏపీ… హ్యాపీ ఏపీ అని చెప్పారు. . అందరూ ఆనందంగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. చిన్న చిన్న పరిశ్రమల వ్యర్ధాలు పంట కాలువల్లో కలిపేస్తున్నారు. ఈ విషపూరిత సైకిల్ ని ఎక్కడో ఒక చోట బ్రేక్ చేయాలి. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నా నాయకత్వంలో కాలుష్యం మీద ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం. రాష్ట్రానికి కొత్త పొల్యూషన్ పాలసీ తీసుకువస్తాం.
ఇతర ప్రాంతాల్లో వేట, ఫిష్ ల్యాండింగ్ సమస్యల మీద మచిలీపట్నం, అంతర్వేది మత్స్యకారులతో మాట్లాడుతున్నాం. ఈ సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం చూపుతాం. అన్ని సమస్యలకు ప్రాథమిక పరిష్కార మార్గాలు వెతికేందుకు 100 రోజుల సమయం ఇవ్వండి” అన్నారు. - 18 మత్స్యకార కుటుంబాలకు బీమా పరిహారం చెక్కులు
కాకినాడ జిల్లా పరిధిలో వేటకు వెళ్లి సముద్రంలో మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల చొప్పున ఆర్ధిక సాయం శ్రీ పవన్ కళ్యాణ్ గారు విడుదల చేశారు. ఇందులో గత ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్ లో ఉన్న బీమా చెక్కులు కూడా ఉన్నాయి. ఈ రోజు మొత్తం 18 కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. 90 లక్షల బీమా పరిహారం విడుదల అయ్యింది. అందులో ఉప్పాడ తీర ప్రాంతానికి చెందిన ఐదుగురు మత్స్యకారుల కుటుంబాలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మాటా మంతి కార్యక్రమంలో చెక్కులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంటు సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు, శాసన మండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, శాసన సభలో విప్ లు శ్రీ దాట్ల సుబ్బరాజు గారు, శ్రీమతి యనమల దివ్య గారు, శ్రీ బొమ్మడి నాయకర్ గారు, శాసన మండలి సభ్యులు శ్రీమతి కర్రి పద్మశ్రీ గారు, శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారు, శాసన సభ్యులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు, శ్రీ వనమాడి కొండబాబు గారు, శ్రీ పంతం నానాజీ గారు, డీసీసీబీ ఛైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి గారు, సివిల్ సప్లయ్స్ కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ తోట సుధీర్ గారు, పిఠాపురం జనసేన ఇంఛార్జ్ శ్రీ మరెడ్డి శ్రీనివాస్ గారు, కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీ షణ్మోహన్ సగిలి గారు, ఎస్పీ శ్రీ బిందు మాధవ్ గారు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ కృష్ణ తేజ గారు, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి శ్రీ శరవణన్ గారు, మత్స్యశాఖ కార్యదర్శి శ్రీ రామశంకర నాయక్ గారు, విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ శ్రీ ప్రఖర్ జైన్ గారు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
