

ఏ ధర్మాన్ని ఆచరిస్తారని అడిగి మరీ చంపేశారు
•పెహల్గాం ఉగ్రవాద చర్యను భారత దేశం ఎన్నటికీ మరువదు
• అత్యంత కిరాతకంగా, నిర్దయగా ప్రవర్తించారు
• ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా నిర్దాక్షణ్యంగా ఏరి పారేయాలి
• బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఇస్తుంది
• ఉగ్ర దాడిలో మృతి చెందిన కావలి వాసి శ్రీ మధుసూదనరావు సోమిశెట్టి గారి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
• కుటుంబ సభ్యులకు ఓదార్పు
‘పహల్గాంలో ఉగ్రవాదుల దాడులు దారుణం. ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా, టార్గెటెడ్ గా పర్యాటకుల్ని హతమార్చారు. ఎంతో పైశాచికంగా ప్రవర్తించారు. ఈ ఘటనను భారత దేశం ఎప్పటికీ మరచిపోదు. మనకి కనికరం, మంచితనం ఎక్కువయ్యాయి. ఇక ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా నిర్దాక్షణ్యంగా ఏరి వేయాలి’ అంటూ రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. గురువారం మధ్యాహ్నం శ్రీ పొట్టి శ్రీరామలు నెల్లూరు జిల్లా, కావలిలో పహల్గాం ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన శ్రీ సోమిశెట్టి మధుసూదన రావు గారి
భౌతిక కాయానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో కలసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకుని వారిని ఓదార్చారు. అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడుతూ.. “ఉగ్రవాదులు ఎంతో కిరాతకంగా దారుణంగా ప్రవర్తించారు. శ్రీ మధుసూదన రావు కుటుంబ సభ్యులను పరామర్శించినప్పుడు వారు పడిన క్షోభను తెలియజేశారు. వారి ఆవేదన వింటే మనసు వికలమైంది. మాట్లాడడానికి మాటలు రావడం లేదు.
విశాఖ వెళ్లి శ్రీ చంద్రమౌళి గారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించిన అనంతరం మంగళగిరిలో మీడియా సమావేశం నిర్వహించి అన్నీ వివరంగా మాట్లాడుతాను. ప్రభుత్వం అన్ని రకాలుగా మృతుల కుటుంబాలకు భరోసా ఇస్తుంది. వీరికి పరిహారం కంటే మనిషి చనిపోయిన బాధలో వారికి అండగా నిలవడం అవసరం. కశ్మీర్ లో పరిస్థితులు నాకు తెలుసు. 1986 నుంచి 1989 వరకు అక్కడ షూటింగ్ శిక్షణకు వెళ్లే వాడిని. కశ్మీర్ లో తూటాలు పేలితే ఆ ప్రభావం దేశం నలుమూలలా కనబడుతుంది అనడానికి పహల్గాంలో ఉగ్రదాడి ఉదంతమే నిదర్శనం. గత కొంత కాలంగా కశ్మీర్ లో ప్రశాంతం పరిస్థితులు ఏర్పడ్డాయని విహారానికి వెళ్లారు. శ్రీ మధుసూదన రావు కుటుంబానికి జరిగిన ఘటన ఇంకా నమ్మశక్యంగా లేదు. ఏ ధర్మాన్ని ఆచరిస్తారని అడిగి మరీ నిర్ధాక్షణ్యంగా చంపేశారు. రేపు, ఎల్లుండిల్లో మంగళగిరిలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు వివరిస్తామ”న్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీ సత్యకుమార్ యాదవ్, శాసన సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, శ్రీ దగుమాటి వెంకటకృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- అంతిమ యాత్రలో పాల్గొన్న మంత్రులు
శ్రీ మధుసూదన రావు గారి అంతిమ యాత్రలో రాష్ట్ర మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, శ్రీ సత్యకుమార్ గారు, కావలి ఎమ్మెల్యే శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.