


పెహల్గామ్ బాధితుల వేదన చూస్తే మాట రావడం లేదు
- ఉగ్రవాద దుశ్చర్యలను ఖండించేందుకు అంతా ఏకతాటి పైకి రావాలి
- మతం అడిగి మరీ కాల్చి చంపడం అత్యంత హేయం
- పెహల్గామ్ ఘటనలో మృతి చెందిన విశాఖ వాసి శ్రీ చంద్రమౌళి గారి భౌతికకాయాన్ని సందర్శించి, మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
‘దేశ ప్రజలంతా ఉగ్రవాదంపై గళం విప్పాల్సిన సమయం వచ్చిందని, ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా కూకటి వేళ్ళతో పెకిలించాల్సిన సమయం ఆసన్నం అయింద’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కాశ్మీర్ లో పరిస్థితులు చక్కబడుతున్న వేళ కావాలని కొన్ని మతవాద సంస్థలు అక్కడ అల్లకల్లోలం సృష్టించడానికి రక్తపాతం సృష్టిస్తున్నాయని అన్నారు. కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దుశ్చర్యలో ప్రాణాలు కోల్పోయిన విశాఖపట్నం, పాండురంగాపురం వాసి శ్రీ చంద్రమౌళి భౌతిక కాయానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు బుధవారం రాత్రి నివాళులర్పించారు. కావలిలో బుధవారం ఉదయం శ్రీ మధుసూదన్ రావు గారి భౌతిక కాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన అనంతరం ఆయన నేరుగా తిరుపతి విమానాశ్రయానికి వెళ్లి అక్కడ నుంచి విశాఖపట్నం వెళ్లారు. నేరుగా విశాఖపట్నం ఆసుపత్రిలో ఉన్న మార్చురీ లోని శ్రీ చంద్రమౌళి భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ…
“పెహల్గాం ఘటన దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. దేశంలో ఎంతో ఐక్యమత్యం గా ఉన్న హిందువులు, ముస్లింల మధ్య గొడవలు రాజేసేందుకు ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. పెహల్గం ఘటన అత్యంత క్రూరమైనది. భార్య కళ్ళ ఎదురుగానే భర్తను కాల్చి చంపుతుంటే వారి వేదన ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బాధితుల కుటుంబాలతో మాట్లాడుతుంటే, వారి వేదన వింటే మాటలు రావడం లేదు. ఎన్నో ఆకాంక్షలు ఆశలతో జీవన ప్రయాణాన్ని సాగిస్తున్న వారి జీవితాల్లో ఈ ఘటన కల్లోలం రేపింది.
మతం అడిగి కాల్చి చంపడం హేయం
కాశ్మీర్లో పర్యాటకుల మీద ఎప్పుడు ఇలాంటి దారుణమైన దుర్ఘటనలు జరగలేదు. దుశ్చర్యకు పాల్పడే సమయంలో ఉగ్రవాదులు బాధితుల మతం అడిగి హిందువా కాదా అని కాల్చి చంపడం అత్యంత హేయమైన చర్య. ఇలాంటి దారుణమైన సంఘటన జరిగిన సమయంలో దేశ ప్రజలందరూ ఒకే తాటి పైకి రావలసిన సమయం వచ్చింది. దేశ సమగ్రతను దెబ్బతీసేలా మతాల మధ్య గొడవలు పెట్టేలా ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్లు చేసిన, మాట్లాడిన వారి మీద ఈ సమయంలో కఠిన చర్యలు తీసుకోవాలని దేశ హోమ్ మంత్రి శ్రీ అమిత్ షా గారిని కోరుతున్నాను. దేశ విభజన సమయంలోను సుమారు మూడు లక్షల మంది హిందువులు మృతి చెందారు. అలాంటి దుర్ఘటనలు మళ్లీ జరగకూడదని కోరుకుంటున్నా. కాశ్మీర్లో ఉన్న మతవాద సంస్థలు పదేపదే అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి. కాశ్మీర్ లో తెలుగు సినిమా షూటింగులు ఎక్కువగా జరిగేవి. నేను కూడా చాలాసార్లు అక్కడికి వెళ్లేవాడిని. చాలా అద్భుతమైన ప్రాంతం కాశ్మీర్. నేను అక్కడికి వెళ్లే సమయంలో కాశ్మీర్ పండిట్స్ పని చేసేవారు. వారు కూడా అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా మేమే ఇక్కడ ఉండలేకపోతున్నామని గోడు వెళ్ళబోసుకునేవారు. మీరు కూడా రావద్దు అని చెప్పేవారు. అయితే గత కొంతకాలంగా కాశ్మీర్లో పరిస్థితులు చక్కబడుతున్నాయి. అక్కడ పర్యాటకం కొత్త మెరుగులు దిద్దుకుంటుంది. ఇలాంటి సమయంలో కావాలనే కాశ్మీర్ పర్యాటకాన్ని దెబ్బతీసేందుకు కొందరు ఉగ్రవాదులు ఇలా కుట్ర పన్నడం సహేతుకమైన చర్య కాదు. ఇలాంటి అమానవీయ పరిస్థితుల్లో దేశ ప్రజలంతా ఒకే మాటపై, ఒకే ఏకతాటి పైకి రావాలి” అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డి.బి.వి. స్వామి గారు, ఎంపీ శ్రీ ఎం.భరత్ గారు, ఎమ్మెల్యేలు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు, శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు తదితరులు పాల్గొన్నారు.
