

మీరొచ్చాక మా సమస్యలు తీరాయి
• ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలిపిన పిఠాపురం ప్రజలు
• ప్రజలతో మమేకమై వారి ఆకాంక్షలు, సమస్యలు తెలుసుకొన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు
‘మీరొచ్చాక మా సమస్యలు తీరాయి సర్.. ఇళ్ల పట్టాలు ఇప్పించి నాలుగు దశాబ్దాల మా కల నెరవేర్చారు.. మీకు చెప్పగానే మా కాలనీకి కుళాయి వచ్చింది. కాస్త ఎక్కువ సమయం నీరిస్తే మా నీటి కష్టాలు తీరినట్టే..’ రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం పర్యటనలో ప్రజా స్పందన ఇది. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సమస్య చెప్పుకున్న వెంటనే పరిష్కారం అయ్యిందన్న ఆనందంలో కొందరు ఉంటే.. ఇంకొందరు తమ ఆకాంక్షలు, సమస్యలు తెలియచేసేందుకు బారులు తీరారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటన సమాచారం తెలుసుకున్న ప్రజలు ఆయనతో స్వయంగా మాట్లాడేందుకు రోడ్ల వెంబడి బారులు తీరారు. అర్జీతో రోడ్డుపై నిలబడిన ప్రతి ఒక్కరి వద్ద ఆగి తన నియోజకవర్గ ప్రజల సమస్యలు ఆలకించారు. పరిష్కారం కోరుతూ అప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని వాకతిప్ప గ్రామ పరిధిలోని కాలనీలో తాగు నీటి సమస్య ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చింది. ఎన్నికల ముందు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో కొంత మంది మహిళలు కాలనీలోకి తీసుకువెళ్లి తమ ఇబ్బందులు తెలియపరిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఇచ్చిన మాట నేరవేర్చుకున్నారు. ఆ కాలనీలో పైపులు వేసి కుళాయిలు ఏర్పాటు చేశారు. తమ కాలనీకి కుళాయిలు వచ్చాయన్న ఆనందాన్ని కాలనీ మహిళలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఎదుట వ్యక్తపరచారు. అయితే అరగంట మాత్రమే నీరు వస్తోందని, ఎక్కువ సమయం నీరిస్తే తమ నీటి కష్టాలు తీరినట్టేనని తెలిపారు. ఆ కాలనీలో నీటి సరఫరా కోసం ఉద్దేశించిన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం పూర్తి అయినందున, వారం రోజులలోపు ఆ కాలనీకి పూర్తి స్థాయిలో నీరు అందించే ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు.
పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని 16 వార్డు రధాలపేటకు చెందిన మహిళలు నాలుగు దశాబ్దాల ఇళ్ల పట్టాల కల నెరవేర్చినందుకు పూల వర్షం కురిపిస్తూ ధన్యవాదాలు తెలిపారు. శాసన సభ్యునిగా తొలి పర్యటనలో ఇళ్ల పట్టాల సమస్య ఆయన దృష్టిలో పెట్టామని, వెంటనే స్పందించి పట్టాలు ఇప్పించారంటూ ఆనందం వ్యక్తం చేశారు.
కొత్తపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో బీసీ సామాజికవర్గానికి చెందిన పలువురు తమ గ్రామ పరిధిలో బీసీల కోసం కమ్యునిటీ హాల్ నిర్మించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు తమ గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తే చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు కూడా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. పిఠాపురం 15వ వార్డు మోహన్ నగర్ వాసులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని, మున్సిపాలిటీ అధికారులు ఇచ్చే ట్యాంకర్లలో నీరు రంగు మారి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన ఆ సమస్య పరిష్కస్తానని హామీ ఇచ్చారు. శ్రీమతి రెడ్డి వరలక్ష్మి అనే మహిళ తనకు ఇంటి స్థలం కావాలని అర్జీ ఇవ్వగా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ వీధిలో విద్యుత్ తీగలు ఇళ్ల మీదుగా వెళ్లడం వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు పలువురు అర్జీలు ఇచ్చారు. వీరితోపాటు దారిపొడవునా వ్యక్తిగత సమస్యలపైనా, తమ గ్రామ సమస్యలపైనా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అర్జీలు ఇచ్చారు.