మచిలీపట్నం సెప్టెంబర్ 7:—–pvginox.com
జిల్లాలో రైతులకు అవసరమైన అంత యూరియాను సర్వ చేస్తామని ఎవరో కూడా ఆందోళన చెందవద్దని ధైర్యంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ రైతులతో అన్నారు.
ఆదివారం మధ్యాహ్నం రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ , సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి పామర్రు, గూడూరు, మండలాల్లో పర్యటించి రైతులతో ముఖాముఖి మాట్లాడారు.
ఈ సందర్భంగా ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రైతులతో మాట్లాడుతూ వారికి యూరియా సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడుగగా వల్లూరు పల్లి గణేష్, కాకి నాగేంద్రరావు తదితర రైతులు మాట్లాడుతూ యూరియా సరిపడా రావడం లేదని, ఎండలు కావడంతో వాతావరణం మారడంతో కలుపు మొక్కలు తీయుటకు ఒక కట్ట యూరియా వాడుతున్నామని, అందువలన ఎకరాకు కనీసం 3 కట్టల యూరియా అవసరం ఉందన్నారు.
దీనిపై ప్రత్యేక ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ శాస్త్రీయంగా ఎకరాకు 2 కట్టల యూరియా సరిపోతుందని, 3 కట్టల యూరియా కావాలని ముందస్తు ప్రణాళికలు తయారు చేయలేదన్నారు.
అధికంగా యూరియా వాడటం వలన పంట నష్టమే కాకుండా భూసారం కూడా దెబ్బతింటుందని రైతులకు హితవు చెప్పారు. ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా గత సంవత్సరం కంటే ఒక లక్ష మెట్రిక్ టన్నుల యూరియా ఎక్కువగా రైతులకు సరఫరా చేశామన్నారు.
యూరియా పంపిణీలో రైతులకు ఇబ్బంది కలగకుండా గ్రామాల్లోనే పంపిణీ చేస్తున్నామని, ముఖ్యంగా ప్రాథమిక వ్యవసాయ సొసైటీల ద్వారా అందజేస్తున్నామన్నారు.
ప్రస్తుతం ఇంకా ఎంత యూరియా కావాలి అని ప్రత్యేక కార్యదర్శి అడుగగా రైతులు సమాధానం చెబుతూ వరి పైరు చివరి దశలో ఉందని, ఇంకా ఒక ఎకరాకు మూడో డోసు ఒక బస్తా యూరియా అవసరముందన్నారు.
ప్రస్తుతం 1,775 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, ఇంకనూ 400 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందని మండల వ్యవసాయ అధికారి శివ నాగమని కార్యదర్శికి వివరించారు. రైతులు ఈ మధ్య యూరియాని కలుపు మందుతో కలిపి ఎక్కువగా వాడడం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇటీవల చెప్పారని, ఎక్కువ వాడితే ఆరోగ్యంతో పాటు, భూసారానికి మంచిది కాదని స్పష్టం చేశారు.
వచ్చే రబి పంట కాలంలోనైనా కొంతవరకు రైతుల్లో మార్పు రావాలన్నారు.
ప్రకృతి వ్యవసాయం చేయడం అనేదే కాకుండా వరి పంట వేసే ముందు ఎరువుల రహిత సేద్యం చేపట్టాలని ఇదివరకు జీలుగా అనే ఒకే పంటను వేసే వారని, అలా కాకుండా 20 లేదా 30 రకాల విత్తనాలను చల్లి పంటలు పండిస్తే భూసారం పెరుగుతుందన్నారు. దాంతో రైతుకు ఆదాయం పెరగడమే కాకుండా ఎరువులు, నత్రజని వంటివి అవసరం లేదన్నారు.
అనంతరం ప్రత్యేక ముఖ్య కార్యదర్శి గూడూరు మండలం ఆకులమన్నాడు గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సందర్శించి అక్కడి రైతులతో ముఖాముఖి మాట్లాడారు.
ప్రత్యేక కార్యదర్శి మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా యూరియా ప్రభుత్వం సరఫరా చేసినప్పటికీ ఇంకా అవసరం ఉందంటున్నారు తేడా ఏమిటని రైతులను ప్రశ్నించగా రైతులు అంకం సోమరాజులు, శంకరు తదితరులు సమాధానం చెబుతూ గతంలో నాట్లు వేసేవారమని రెండు మూడు కట్టలు సరిపోయేదన్నారు. ప్రస్తుతం వెదజల్లే పద్ధతిలో సాగు చేయడం, వర్షాలు లేకపోవడం, కలుపు ఎక్కువగా ఉండడంతో 4 కట్టల యూరియా అవసరం వస్తుందన్నారు. అంతేకాకుండా ఒకసారి నాటిన తర్వాత వర్షాలు లేక ఎదుగుదల లేదని పంట దెబ్బతినడంతో మరల నాట్లు వేయాల్సి వచ్చిందన్నారు. దీంతో అధికంగా యూరియా వాడకం జరిగిందన్నారు. ప్రస్తుతం ఒకసారి మాత్రమే యూరియా కట్టలు సరఫరా చేశారన్నారు.
ఇంకా రెండు లోడ్డ్ల యూరియా అవసరముందని సరఫరా చేయాలని రైతులు కోరారు.
ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ రైతులందరికీ యూరియా సరఫరా చేస్తామని, ఎవరు కూడా మూడో డోసు కావాలని ముందుగానే తీసుకునేందుకు ఆత్రుత చూపవద్దని, ఎలాంటి ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు.
అనంతరం కార్యదర్శి రైతులతో ఇక వారికి నమ్మకం కలిగిందా అని అడగడంతో వారు మాట్లాడుతూ రైతులు మాట్లాడుతూ అధికారులందరూ వచ్చి చెప్పారు కాబట్టి తమకు పూర్తి నమ్మకం కలిగిందని సంతోషం వ్యక్తం చేశారు.
యూరియా పొందిన రైతులందరి నుండి ఈ కేవైసీ ఎలాంటి జాప్యం లేకుండా తీసుకుంటున్నారా లేదా అని, ఐఎఫ్ఎంఎస్ లో తాజాగా వివరాలు నమోదు చేస్తున్నారా లేదా అని ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, సొసైటీ కార్యదర్శి పెన్నేరు రామకృష్ణను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఎప్పటికప్పుడు రైతుల బయోమెట్రిక్ చేసుకుంటున్నామని కార్యదర్శి వివరించారు.
