- మొదటిగా కేరళలోని చొట్టనిక్కరలో ఉన్న శ్రీ అగస్త్య మహర్షి ఆలయం సందర్శన
- అగస్త్య ఆశ్రమంలో ఆయుర్వేద చికిత్స గురించి అడిగి తెలుసుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు

దక్షిణ భారతదేశ ఆలయాల పర్యటనకు శ్రీకారం చుట్టిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు బుధవారం ఉదయం కేరళ రాష్ట్రంలోని కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా చొట్టనిక్కరలోని శ్రీ అగస్త్య మహార్షి ఆలయానికి చేరుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి తో పాటు ఆయన తనయుడు శ్రీ అకిరా నందన్, టీటీడీ బోర్డు సభ్యుడు శ్రీ ఆనంద్ సాయి ఉన్నారు. అగస్త్య ఆలయం ట్రస్ట్ బోర్డు అధ్యక్షులు డాక్టర్ యోగిదాస్, ఇతర సభ్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికారు. కేరళ సంప్రదాయంతో ఆలయ పండితులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. తర్వాత ఆయనతో ఆలయ సంప్రదాయాలను అనుసరించి ప్రదక్షిణ చేశారు. అనంతరం శ్రీ అగస్త్య మహార్షి వారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంప్రదాయబద్ధంగా మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ఆవరణలో ఉన్న ఇతర మహా ఋషుల ఆలయాలను దర్శించుకున్నారు. ఆలయ ఆకృతిని, కట్టడాలను ఆసక్తిగా పరికించారు.
ఆశ్రమ వివరాలను ఆసక్తిగా తెలుసుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు
ప్రత్యేక పూజలు అనంతరం అగస్త్య ఆశ్రమంలో ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే మూలికలు, మొక్కల గురించి ఆశ్రమ వైద్యులు శ్రీ విష్ణు యోగి, శ్రీమతి మణి యోగి వివరించారు. అగస్త్య మహార్షి పురాణాల్లో, వేదాల్లో చెప్పినట్లుగా కీలకమైన మర్మ చికిత్సకు మూలికలు ఎలా ఉపయోగపడతాయి అన్నది కూడా అడిగి తెలుసుకున్నారు. కలరిపయట్టు యుద్ధకళ గొప్పదనం గురించి, ఆశ్రమం ఆవరణలోనే ఉన్న శివలింగం ప్రాసస్త్యాన్ని కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలుసుకున్నారు. లింగ శక్తి, శ్రీ శక్తి గురించి వివరించే పటాలను, చిత్రాలను పరికించారు. శివలింగం చెంతనే ఉన్న అఖండ జ్యోతికి నమస్కరించారు. అనంతరం అగస్త్య ఆశ్రమంలోనే ఉన్న గోశాలకు వెళ్లారు. ఆయుర్వేద చికిత్సలో గోవుల గొప్పతనాన్ని కూడా ఆశ్రమ నిర్వాహకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు.

ఆయుర్వేద వైద్యం గురించి అడిగి తెలుసుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు
సుదీర్ఘంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని బాధపెడుతున్న నడుము నొప్పి, స్పాండిలైటిస్ సమస్యకు ఆయుర్వేదంలో అవలంబించే చికిత్స విధానాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆశ్రమ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీ అగస్త్య మహార్షి దర్శనం అనంతరం ఆశ్రమంలో ప్రత్యేకంగా అందించే చికిత్సాలయాన్ని సందర్శించారు. శ్రీ అగస్త్య ఆశ్రమానికి సుదూర ప్రాంతాల నుంచి వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్స నిమిత్తం ప్రతి రోజు 200 మందికి పైగా వస్తుంటారు. సుమారుగా 100 పడకల ప్రత్యేక వైద్యశాల వీరికి ఉంది. దీనికోసం 12 మంది వైద్యులతోపాటు సిబ్బంది ఇక్కడ పని చేస్తుంటారు. వివిధ దీర్ఘకాలిక నొప్పులు అలాగే ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నవారికి వీరు ప్రత్యేకంగా ఆయుర్వేదంతోపాటు మర్మ చికిత్సను చేస్తారు. ఆయుర్వేదం మనిషిపై ప్రభావం చూపడానికి కాస్త సమయం తీసుకుంటుందిగాని, కచ్చితంగా దీర్ఘకాలంలో ఆరోగ్యానికి మంచిదని వైద్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు. దీంతోపాటు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆయుర్వేదంలో ఉన్న చికిత్స పద్ధతులను వివరించారు. అగస్త్య మహర్షి వేదాల్లో వివరించిన చికిత్స పద్ధతులు, సంప్రదాయాల గురించి ఆశ్రమ వైద్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు.

- తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో దోషులను అరెస్ట్ చేయడం సంతోషం
- భవిష్యత్తులో కూడా ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోవలసిన బాధ్యత ఉంది
- దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శన పూర్తిగా వ్యక్తిగత అంశం
- కేరళలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయ సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
‘తిరుమల బాలాజీకి దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారు. తిరుమలకు వచ్చే భక్తులు ఎంతో నమ్మకంగా, ఆధ్యాత్మిక చింతనతో వస్తుంటారు. అలా వచ్చే వారి మనోభావాలు గాయపడకూడదు అన్నదే నా ఆవేదన. తిరుమల లడ్డులో కల్తీ జరగడం నిజంగా దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు మళ్లీ భవిష్యత్తులో జరగకూడదు అన్నదే నా బలమైన ఆకాంక్ష’ అని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దక్షిణ భారతదేశ ఆలయాల యాత్రకు శ్రీకారం చుట్టిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు కేరళలోని చొట్టనిక్కరలో ఉన్న శ్రీ ఆగస్త్య మహర్షి ఆలయం, అగస్త్య ఆశ్రమం సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. “తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ వ్యవహారంపై ఏర్పాటు అయిన ప్రత్యేక దర్యాప్తు బృందం – ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న వాళ్ళని అరెస్టు చేయడం కేసు దర్యాప్తులో భాగం. సంతోషించదగిన విషయం. భవిష్యత్తులో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో కానీ, ఇతర వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు పాటించాలి.

ఇది నా వ్యక్తిగత పర్యటన
దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శన అనేది పూర్తిగా నా వ్యక్తిగత అంశం. రాజకీయాలకు సంబంధం లేదు. సుమారు నాలుగున్నర సంవత్సరాల క్రితం చెల్లించుకోవలసిన మొక్కుల నిమిత్తం… నా ఆరోగ్యం సైతం అంతగా సహకరించకున్నా రావాల్సి వచ్చింది. కేరళతో పాటు తమిళనాడులో ఉన్న ఆలయాలను దర్శించుకుంటున్నాను. ఎర్ర చందనాన్ని అక్రమ రవాణా చేస్తున్నప్పుడు పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఎర్రచందనం అమ్మకం విషయంలో దేశం మొత్తానికి నూతన విధానం తీసుకురావాలని కేంద్రాన్ని కోరాము” అని చెప్పారు.