Uncategorized

అప్పు మిగిల్చారు… జగన్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్

Spread the love

[29/08, 15:14] (pvginox.com PALLA VENUGOPAL )

ఆదాయం పోగొట్టి … అప్పు మిగిల్చారు

• నాలుగు బ్లాకులకే రూ.453 కోట్ల ప్రజాధనం వృథా చేశారు
• అంచనా వ్యయం కంటే నాలుగింతలు ఖర్చు చేశారు
• నిబంధనలకు పాతర వేసి పర్యావరణ విధ్వంసం
• ప్రభుత్వానికి గుదిబండలా రుషికొండ భవనాల నిర్వహణ
• విద్యుత్ బిల్లులకే ఏడాదికి రూ.కోటిన్నరకు పైగా ఖర్చు
• నిరుపయోగంగా మారిన రుషికొండ ప్యాలెస్ ను ఆదాయ వనరుగా మార్చాలి
• ఎం.ఐ.సి.ఇ.(మైస్) డెస్టినేషన్, డెస్టినేషన్ వెడ్డింగ్ లకు వేదికగా మార్చాలని సూచనలు
• గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపాదనలు పంపిస్తాం
• శీతాకాల సమావేశాలలోపు నిర్ణయం తీసుకుంటాం
• రుషికొండ భవనాల నిర్మాణాలను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

‘రుషికొండ భవనాల నిర్మాణం కోసం రూ.453 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. 69 ఎకరాల్లో 7 బ్లాకులుగా నిర్మించాలని పనులు ప్రారంభించారు. రూ.164 కోట్ల అంచనా వ్యయంతో మొదలైన పనులు… నాలుగు బ్లాకులు పూర్తయ్యే సరికే రూ. 453 కోట్లకు చేరింది. గతంలో ఏడాదికి రూ.7 కోట్లు ఆదాయం వచ్చే రిసార్టులను కూల్చేసి ఇప్పుడు కోటిన్నర రూపాయలు కేవలం విద్యుత్ బిల్లులకే వెచ్చించే స్థితికి వైసీపీ నాయకులు తీసుకొచ్చార’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలియచేశారు. గత వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి నివాసంగా వినియోగించుకొనేందుకు వీటిని విలాసవంతంగా నిర్మించారని, నిర్వహణ సరిగా లేక భవనాలు పెచ్చులూడుతున్నాయని అన్నారు. వచ్చే సమావేశాల్లోపు భవనాలపై ఒక నిర్ణయం తీసుకునేలా ప్రయత్నం చేస్తామని చెప్పారు.
విశాఖలో మూడు రోజుల పాటు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో పాల్గొంటున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు శుక్రవారం ఉదయం మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, శ్రీ కందుల దుర్గేష్ గారు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి రుషికొండ భవనాలను పరిశీలించారు. నిర్మాణాల నాణ్యత, నిర్మాణ ఖర్చు, ప్రస్తుత నిర్వహణ ఖర్చులపైనా అధికారులతో చర్చించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పార్టీ మంత్రులు, శాసనసభ్యులతో రుషికొండ భవనాల నిర్వహణ, తదుపరి కార్యాచరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “రుషికొండ భవనాల వినియోగంపై సూచనలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కోరారు. అందుకే రుషికొండ భవనాలను పరిశీలించడానికి వచ్చాం. బిల్డింగ్ లోపల చూస్తే పెచ్చులు ఊడిపోతున్నాయి. నీళ్లు లీకవుతున్నాయి. ఈ భవనాల వల్ల ప్రభుత్వానికి లాభం లేకపోయినా చేసిన ఖర్చు రూ 453 కోట్లు. ఈ పెట్టుబడికి బ్రేక్ ఈవెన్ ఎప్పుడు వస్తుందనేది ముఖ్యం. ఎం.ఐ.సి.ఇ.(మైస్) డెస్టినేషన్, డెస్టినేషన్ వెడ్డింగ్ లకు వేదికగా తీర్చిదిద్దాలని పలువురు సూచనలు చేశారు. అందరి సూచనలతో భవనాల వినియోగంపైన తాము ముఖ్యమంత్రిగారికి త్వరలోనే ప్రతిపాదనలు పంపిస్తాం. అయితే అంతకంటే ముందు భవనాలకు చేయాల్సిన మరమ్మత్తులు పూర్తి చేసి ఆదాయ వనరుగా ఎలా మార్చాలి అన్న దానిపై ఆలోచన చేస్తున్నాం
• రూ.7 కోట్ల ఆదాయం పోయి… కోటిన్నర ఖర్చు మిగిలింది
గత ప్రభుత్వ హయాంలో రుషికొండపై ఉన్న హరిత రిసార్ట్ ని అభివృద్ధి చేస్తామని అనుమతులు ఇచ్చారు. అన్ని రకాల నిబంధనలు అడ్డగోలుగా అతిక్రమించారు. అనుమతులకు మించి రుషికొండను తవ్వేశారు. పర్యావరణాన్ని దారుణంగా దెబ్బ తీశారు. చివరికి న్యాయ స్థానాలను కూడా తప్పుదోవ పట్టించారు. ఏడాదికి రూ.7 కోట్లు ఆదాయం వచ్చే రిసార్టుని కూల్చేసి, రూ.453 కోట్లు వెచ్చించి ప్యాలెస్ కట్టారు. ఈ ప్యాలెస్ నిర్వహణకు సంవత్సరానికి కేవలం కరెంట్ బిల్లులకు ఏడాదికి రూ.కోటిన్నర వ్యయం అవుతుంది.
• ఇంటీరియర్ డెకరేషన్ కోసం రూ.39 కోట్లు
రిసార్ట్ పేరు చెప్పి గత ముఖ్యమంత్రి నివాసం, కార్యాలయం కోసం ఇంత ప్రజా ధనాన్ని వృథా చేశారు. ఏడు బ్లాకుల్లో ఒక్కొక్క బ్లాక్ 20 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఇంటీరియర్ డెకరేషన్ కోసం రూ.39 కోట్లు ఖర్చు చేశారు. ట్రాన్స్ కో, జీవీఎంసీ, హార్టికల్చర్, పర్యాటక శాఖల నిధులను దారిమళ్లించి భవనాల నిర్మాణం కోసం వెచ్చించారు. 8.48 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మట్టిని తవ్వేసి అమ్ముకొని పర్యావరణాన్ని విధ్వంసం చేశారు. దాని విలువ లెక్క కట్టాల్సి ఉంది. ఈ తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ లో కేసులు నడుస్తున్నాయి. గౌరవ సుప్రీం కోర్టు హరిత హోటల్స్ కూల్చివేసిన స్థలాల్లో మాత్రమే నిర్మాణాలు జరపమని ఆదేశించింది. రుషికొండ నిర్మాణాల వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని అంచనా వేయమని హైకోర్టు సూచించింది. నిపుణుల బృందం రుషికొండ భవనాల ప్రాంతాన్ని పరిశీలించి తీవ్రమైన ఉల్లంఘనలు జరిగినట్లు నిర్ధారించారు. దీనిపై తీర్పు వెలువడాల్సి ఉంది” అన్నారు.


రుషికొండ భవన సముదాయాలను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

• రూ.లక్షల విలువ చేసే బాత్ టబ్… ఆటోమేటిక్ డోర్ కర్టెన్స్… విసన కర్రలను పోలిన రెక్కలతో డిజైన్ చేసిన సీలింగ్ ఫ్యాన్స్
• రూ.453 కోట్ల వ్యయంతో విలాస భవనాలు

రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రుషికొండపై గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను పరిశీలించారు. విలాసవంతమైన భవనాలు, సువిశాల ప్రాంగణాలు, అత్యాధునిక వసతులు, ఖరీదైన ఫర్నిచర్ తో కూడిన నిర్మాణాలను చూసి ప్రజా ధనాన్ని ఏ విధంగా మళ్లించేశారో అని విస్తుపోయారు. విశాఖ పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం జనసేన పార్టీ మంత్రులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులతో కలసి గత ముఖ్యమంత్రి నివాసం కోసం నిర్మించుకున్న ప్యాలెస్ లను ఆసక్తిగా తిలకించారు. ఆద్యంతం అత్యాధునిక వసతులతో కూడిన భవనాలు, బెడ్ రూమ్స్, ఖరీదైన ఫర్నిచర్ తో కూడిన బాత్ రూములను పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో రుషికొండపై ఉన్న హరిత రిసార్ట్ స్థానంలో నిబంధనలకు విరుద్దంగా నాలుగు బ్లాకుల్లో భవనాలు నిర్మించిన విషయం విదితమే. విజయనగర, బొబ్బిలి కళింగ, గజపతి పేరిట ఇవి నిర్మితమయ్యాయి. వాటిలో విజయనగర బ్లాక్ ను నాటి ముఖ్యమంత్రి నివాసం ఉండేందుకు అత్యంత విలాసవంతంగా నిర్మించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు రుషి కొండ సందర్శనలో భాగంగా మొదట 20 వేల చదరపు మీటర్లలో నిర్మించిన విజయనగర బ్లాక్ ని పరిశీలించారు. భవనం లోనికి అడుగుపెడుతూనే అత్యంత ఖరీదైన లైటింగ్ సెట్స్, సువిశాలమైన హాలు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. స్విచ్ వేస్తే తెరుచుకునే విధంగా ఆటోమేటిక్ డోర్ కర్టెన్స్, విసన కర్రలను పోలిన రెక్కలతో డిజైన్ చేసిన సీలింగ్ ఫ్యాన్స్ ను అధికారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చూపారు.
• ప్రత్యేక ఆకర్షణగా హిల్ వ్యూ.. సీ వ్యూ..
అత్యాధుక వసతులు, హిల్ వ్యూ కనబడేలా మాస్టర్ బెడ్ రూమ్ నిర్మించినట్టు నిర్మాణంలో పాలుపంచుకున్న అధికారి ఒకరు తెలిపారు. ఆ గదిలో ఏర్పాటు చేసిన మంచాలతో పాటు సువిశాలమైన బాత్ రూమ్స్ ను మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, శ్రీ కందుల దుర్గేష్ గారు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి తిలకించారు. విజయనగర బ్లాక్ జీ ప్లస్ వన్ కి అనుమతి పొంది జీ ప్లస్ టూ నిర్మాణం చేపట్టిన విషయాన్ని అధికారులు ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకున్నారు. కొరియన్ స్టయిల్లో నిర్మించిన బాత్ రూమ్స్, రూ. 12 లక్షలు విలువ చేసే అత్యంత ఖరీదైన బాత్ టబ్ లను ఆసక్తిగా పరిశీలించారు. భవనం లివింగ్ రూమ్స్ నుంచి, టాప్ నుంచి హిల్ వ్యూ, సీ వ్యూలను తిలకించారు.
అనంతరం సీఎంఓ కోసం నిర్మించిన కళింగ బ్లాక్ కి వెళ్లారు. 300 మందితో సమావేశం నిర్వహించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన సమావేశ మందిరం, వీడియో కాన్ఫరెన్స్ గది, 50 మంది చొప్పన కూర్చుని చర్చించుకునేలా నిర్మించిన నాలుగు సమావేశ మందిరాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు. సమావేశ మందిరంలో సీలింగ్ పైపెచ్చు ఊడిపడడాన్ని, వస్తు సామాగ్రి నిరుపయోగంగా పడి ఉండడాన్ని గమనించారు. నిర్వహణ లేక దుమ్ము కొట్టుకుపోయిన కిటకీలను చూసి, కనీసం పారిశుధ్య నిర్వహణ చేయించాలని అధికారులకు సూచనలు చేశారు. మొత్తం నిర్మాణ అంచనా వ్యయం, ఖర్చు చేసిన మొత్తం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలసి రుషికొండ భవనాల వినియోగంపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
రుషికొండ భవనాల వినియోగంపై జనసేన లెజిస్లేటివ్ పార్టీ తీర్మానం
ప్రజాధనంతో నిర్మితమైన ఈ భవనాల సద్వినియోగంపై జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం తీర్మానం చేసింది.
ప్రజలు పన్నులు చెల్లించడం ద్వారా వచ్చిన ప్రభుత్వ ఆదాయానికి సంరక్షకులుగా ఉండాల్సిన బాధ్యత పాలకులదనీ.. రుషికొండపై విలాస భవంతుల కోసం అంచనాలు పెంచి రూ.453 కోట్లు వై.ఎస్.ఆర్.సి.పి. పాలకులు రాళ్ళ పాల్జేశారని ఈ సమావేశం అభిప్రాయపడింది. పేరు… టూరిజం రిసార్ట్స్, కానీ ఈ భవంతులు చూస్తే ప్రజల పట్ల బాధ్యత లేని నాటి ముఖ్యమంత్రి తన కుటుంబం ఉండేందుకు రూ.వందల కోట్లు ప్రజా ధనాన్ని విలాసవంతమైన ప్యాలెస్ కోసం మళ్లించేశారనీ, పర్యావరణ విధ్వంసానికి ఒడిగట్టారని తీర్మానంలో ప్రస్తావించారు. నియంతృత్వ పోకడలతో గత పాలకుడు రూ.453 కోట్లు ప్రభుత్వ నిధులను తన చిత్తానికి తగ్గట్టు వెచ్చించి భవనాలు నిర్మింపచేశారని పేర్కొన్నారు.
ఈ భవనాలను సరైన వినియోగంలోకి తీసుకువచ్చి ప్రభుత్వ ఖజానాకుపడిన గండిని పూడ్చాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ. MICE (Meetings, Incentives, Conferences and Exhibitions) బిజినెస్ టూరిజం ద్వారా ఈ భవనాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా విశాఖపట్నానికి ఓ ఐకాన్ గా మార్చవచ్చని జనసేన లెజిస్లేటివ్ సమావేశంలో ఆలోచన చేశారు. ఈ ఆలోచనను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళాలని నిర్ణయించారు. రుషికొండపై నిర్మితమైన ఈ భవనాల నిర్వహణ, నాణ్యతా ప్రమాణాలు, సేఫ్టీ ఆడిట్ పై సమీక్ష చేయాలని అభిప్రాయం వ్యక్తపరుస్తూ, ఈ భవనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ప్రతిపాదించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారు బలపరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *