
[31/08, 2025] (pvginox.com by PALLA VENUGOPAL )
దసరా నుంచి జనసేన ‘త్రిశూల వ్యూహం’
• కార్యకర్తలకు గుర్తింపు, నాయకత్వ సామర్థ్యం పెంపు, భద్రత అనేవి త్రిశూల్ ప్రధాన అంశాలు
• మెంబర్ షిప్ టూ లీడర్ షిప్ నినాదంతో ముందుకు వెళ్తాం
• ఆంధ్రప్రదేశ్ కు 15 సంవత్సరాల సుస్థిర ప్రభుత్వం అవసరం
• పాలనతోపాటు పార్టీ కోసం రోజూ 4 గంటల కేటాయింపు
• గ్రామ స్థాయి నుంచి జాతీయస్థాయి వరకు నాయకత్వం పెంపొందించడమే లక్ష్యం
• కార్యకర్తల సామర్థ్యం ఆధారంగా బాధ్యతలు అప్పగింత
• జనసేన వివిధ విభాగాల విస్తరణకు ఆలోచన
• కాలంతోపాటు రాజకీయ సిద్ధాంతాల్లో మార్పులు అనివార్యం
• విశాఖపట్నంలో నిర్వహించిన ‘సేనతో సేనాని’ కార్యక్రమంలో ప్రసంగించిన జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
పార్టీ కోసం నిస్వార్ధంగా కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు.. భవిష్యత్తు తరాలకు బలమైన నాయకత్వం అందించే వ్యూహం.. నిరంతరం పార్టీ కోసం పని చేసే వారికి భద్రత అనే మూడు అంశాల ప్రాతిపదికన ‘త్రిశూల వ్యూహం’ రూపొందిస్తున్నామనీ, దీన్ని దసరా నుంచి అమలు చేసేందుకు పకడ్భందీ ప్రణాళికను సిద్ధం చేస్తున్నామనీ, ఈ త్రిశూల్ వ్యూహం ద్వారా జనసేన పార్టీ సరికొత్త అధ్యాయం మొదలు కాబోతుందని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. అందుకోసం ఒక ప్రణాళికాబద్దమైన వ్యూహాన్ని సిద్ధం చేసినట్టు స్పష్టం చేశారు. శక్తి, ధర్మం, రహస్యాలకు ప్రతీకగా నిలిచే పరమ శివుడి త్రిశూలం మాదిరిగా ప్రతి క్రియాశీలక సభ్యుడికీ జనసేన పార్టీ గుర్తింపు, నాయకత్వం, భద్రత కల్పిస్తుందని తెలిపారు. పార్టీలో సభ్యులుగా మొదలు పెట్టి, పార్టీ ప్రస్థానంలో నిబద్దత, నిజాయతీతో భాగస్వామ్యమయ్యే ప్రతి జనసైనికుడు, వీర మహిళ శక్తివంతమైన నాయకుడిగా ఎదిగే పరిణామ క్రమమే మన దిశ.. మన త్రిశూల్.. మన జనసేన.. అని చెప్పారు. శనివారం విశాఖపట్నం వేదికగా ‘‘సేనతో సేనాని’’ జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొని పార్టీ క్రియాశీల కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకునే కార్యకర్తలు కిందిస్థాయిలోనే ఉండిపోకూడదు. వారివారి సామర్థ్యాన్ని బట్టి గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగాలన్నదే నా తదుపరి రోడ్ మ్యాప్. కింది స్థాయి నుంచి నాయకులు రావాలి. అందుకోసం ఒక ప్రణాళికాబద్దమైన వ్యూహం తయారు చేశాం. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా ఈ వ్యూహం అమలవుతుంది. త్రిశూల్ ప్రోగ్రాంలో భాగంగా పార్టీ కోసం పని చేయాలన్న ఆలోచన ఉన్న ప్రతి క్రియాశీలక సభ్యుడికీ ప్రత్యేక మెంబర్ షిప్ ఐడీ ఇస్తాం. ప్రతి క్రియాశీలక సభ్యుడు/సభ్యురాలు కేంద్ర కార్యాలయానికి అనుసంధానంగా పని చేసే విధంగా ఒక వ్యవస్థని ఏర్పాటు చేస్తాం. గ్రామ, వార్డు, నియోజకవర్గ, పార్లమెంటు, జిల్లా, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు బలమైన నాయకులు కావాలనుకునే వారి కోసం నేను రోడ్ మ్యాప్ సిద్ధం చేశాను.
• నాయకత్వం అంటే పదవి కాదు
మెంబర్ షిప్ టూ లీడర్ షిప్ మార్గమే మన విధానం. నాయకత్వం పదవి కాదు.. సేవతో, పోరాటాలతో సంపాదించే గౌరవం. అది బాధ్యతతో కూడుకున్నది. పదవుల కోసం కాకుండా ప్రజల పట్ల అంకితభావంతో ముందుకు వచ్చినవారే నాయకులు అవుతారు. దానికి మార్గం నేను వేస్తున్నాను. క్షేత్ర స్థాయి కార్యకర్తలను మెంబర్ షిప్ టూ లీడర్ షిప్ మార్గంలో తీర్చిదిద్దాలి. సామర్థ్యం ఉన్న కార్యకర్తలను గుర్తించాలి. కొత్తతరం నాయకులను తయారు చేయాలి. అందుకోసం ప్రతి కార్యకర్తని నిబద్ధత గల నాయకులుగా తీర్చిదిద్దే కచ్చితమైన వ్యవస్థని నిర్మించబోతున్నాం. నాయకత్వ శిక్షణ కార్యక్రమాలు, సైద్ధాంతిక శిక్షణ శిబిరాల ద్వారా క్షేత్ర స్థాయిలో పని చేసే అందరినీ ప్రభావవంతమైన నాయకులుగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం.
• పాలనతో పాటు పార్టీకి రోజుకు నాలుగు గంటలు కేటాయిస్తా
మారుమూల గ్రామాల్లో ఉన్న యువతను నాయకులుగా తీర్చిదిద్దే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు, సాధారణంగా చేసే సభ్యత్వ నమోదు ప్రక్రియను కూడా ఆపించేశా. ఇక మీదట పాలనాపరమైన బాధ్యతలు చూస్తూనే, ప్రతి రోజూ పార్టీ కోసం నాలుగు గంటలు కేటాయిస్తా. పాలనాపరమైన బాధ్యతలు విస్మరించకుండా ఆదివారం, సెలవు దినాలు వాడుకుంటూ 2029 నాటికి మీ నుంచి బలమైన నాయకులను తయారు చేస్తా. తెలంగాణ జనసేన శ్రేణులకు ఎంతో పోరాటశక్తి ఉంది. జనసేన భావజాలంతో మీరంతా బలపడండి. పవన్ కళ్యాణ్ ఎలా నిలబడి బలపడ్డాడో చెబుతాను అదే మీరు పాటించండి. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా ఇలా ఏ రాష్ట్రంలో ఉన్నవారికైనా ఇదే వర్తిస్తుంది.
• స్వతంత్ర ఆలోచన శక్తితో పని చేసే ఆడపడుచులు కావాలి
ప్రతి క్రియా వాలంటీర్ తన ప్రయాణాన్ని మీ నియోజకవర్గం, స్థానిక కమిటీ స్థాయిలో ప్రారంభించాలి. పార్టీ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించడం ద్వారా మీ నిజమైన ఎదుగుదల మొదలవుతుంది. ఇక మీదట ఆడపడుచుల్ని పక్కన ఉండమని చెప్పడానికి కుదరదు. ఆడపడుచులకు 33 శాతం రిజర్వేషన్ అని చెప్పాం. తెలంగాణలో శ్రీమతి కావ్య, శ్రీమతి శిరీష లాంటి బలమైన భావజాలం కలిగిన మహిళా కార్యకర్తలు రావాలి. పార్టీపరంగా మహిళల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తాం. పాలనలో భర్త చాటుగా ఉంటూ సంతకాలు పెట్టే మహిళలు కాకుండా, స్వతంత్రంగా ఆలోచించి ముందుకు సాగే ఆడపడుచులను తయారు చేసే బాధ్యత, నాయకత్వం పెంపొందించే శిక్షణ ఇస్తాం. సమర్థుడైన ప్రతి క్రియాశీలక సభ్యుడికీ పార్టీ నిర్మాణంలో ఎదగడానికి బలమైన మార్గం రూపొందిస్తున్నాం. సభ్యత్వంతో ప్రారంభించి పని చేస్తాను అనే వారిని వాలంటీర్, నియోజకవర్గ కో ఆర్డినేటర్, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, సెంట్రల్ లీడర్ షిప్ వరకు ఎదిగే అవకాశం ఇస్తాం. క్షేత్ర స్థాయి నుంచి కేంద్ర నాయకత్వం వరకు ఎవరికైనా అవకాశాలు త్రిశూల్ ద్వారా కల్పిస్తాం.
• పార్టీ విభాగాలపైనా దృష్టి పెడతాను
జనసేన పార్టీకి వివిధ రంగాల విభాగాలపైన ఇప్పటి వరకు దృష్టి పెట్టలేదు. అయితే ఇక మీదట కార్మిక, కర్షక విభాగాలతోపాటు ముఖ్యమైన విభాగాల నిర్మాణంపైనా దృష్టిపెడతాను. ఆయా విభాగాల్లో కీలకమైన వ్యక్తులను తీసుకొచ్చేలా ప్రయత్నం చేస్తాం. అలాగే త్రిశూల్ వ్యూహంలో భాగంగా క్రియాశీల కార్యకర్తలు రంగాల వారీగా తమకు ఆసక్తి ఉన్న విభాగాల్లో పనిచేయాలనుకుంటే, వారి అభిప్రాయం తెలుసుకొని ప్రోత్సహిస్తాము. ఆయా రంగాల్లోని అంశాలపై పూర్తి శిక్షణ, అధ్యయనం, విజ్ఞానం, విషయ పరిజ్ఞానం పెంపొందించుకునేలా చూస్తాం. క్రమశిక్షణ, నిబద్దత చూపిన కార్యకర్తలను ముందుగా గుర్తిస్తాం. తదుపరి పార్టీ వారిని ముందుకు తీసుకువెళ్తుంది. మొదట నేను జనసేనలో ఒక వ్యవస్థను నిర్మిస్తాను. తర్వాత ఆ వ్యవస్థ పార్టీని ముందుకు తీసుకు వెళ్తుంది. మన కార్యకర్తల భద్రత కోసం ఇప్పటికే ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. భారతదేశంలో ఒక రాజకీయ పార్టీగా 2020లో ఈ బీమాను తీసుకొచ్చాం. అది ఇక మీదట కూడా ముందుకు సాగుతుంది. రాజకీయాలు వ్యాపారం కాదు. డబ్బు సంపాదించేందుకు మార్గం అంతకంటే కాదు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదో ఒకటి చేయాలన్న తపన ఉన్న వారి కోసమే నా వెతుకులాట. అలాంటివాళ్లు నాకు కావాలి. రాజకీయాల్లో కులం, మతం, ప్రాంతం రంగు పులిమి లబ్ది పొందే పరిస్థితులు ఉండకూడదు. నేను కులం కోసం ప్రయాణం సాగిస్తే కుల నాయకుడిగా మిగిలిపోయేవాడిని. నేను జాషువా విశ్వనరుడు స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను.
• సైద్ధాంతిక బలమే జనసేనను జాతీయ పార్టీ స్థాయికి తీసుకెళ్తుంది
జనసేనలో చేరతామని ఈ మధ్య తమిళనాడు నుంచి కొంత మంది వచ్చారు. మహారాష్ట్రలోని లాతూర్, షోలాపూర్, ఒడిశాల నుంచి కూడా వచ్చి పార్టీలో చేరతామంటున్నారు. మీరు బలంగా నిలబడాలంటే ముందుగా సమస్యలపై పోరాటం చేయాలి. దశాబ్ద కాలం తర్వాత ఈ రోజున నేను ఇంత మంది ఎమ్మెల్యేలతో వచ్చా. ఏ రాష్ట్రం వారు అయినా భవిష్యత్తులో ఆ స్థాయికి వెళ్లాలి అంటే ముందుగా పోరాటం చేయాలి. మీకు అవసరం అయిన సైద్ధాంతిక బలం, వనరులు మాత్రమే నేను సమకూర్చగలను. మీకు మానసిక స్థిరత్వం, స్థైర్యం ఉంటే సిద్ధాంతాలను నమ్మి ముందుకు వెళితే ఒక రోజున జనసేన జాతీయ పార్టీ స్థాయికి వెళ్తుంది. అది మనమంతా కలసి నిలబడితే అవుతుంది. ప్రతి ఒక్కరు పదవి, అధికారం అన్న ఆలోచన మాని మన దేశం, మన మూలాలను పరిరక్షించుకోవాలన్న భావన పెంపొందించుకోవాలి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే త్రిశూల్ ప్రోగ్రాం పెట్టాం.
• పుష్కర కాలం… ఎన్నో అవరోధాలు
సగటు మనిషి కోపం, ఆవేశం, ఆక్రోశాల నుంచే జనసేన పార్టీ పురుడుపోసుకుంది. జనసేన పార్టీ ఏర్పడి వచ్చే ఏడాది మార్చి 14నాటికి పుష్కర కాలం పూర్తవుతుంది. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. కుటుంబానికి సమయం కేటాయించలేకపోయాను. సినిమాలపై దృష్టి సారించలేకపోయాను. కానీ సమాజం, దేశంపై ఏనాడూ ప్రేమ తగ్గలేదు. దాని ఫలితంగానే దేశ రాజకీయ చరిత్ర ఎవరూ సాధించలేని విధంగా 100 శాతం స్ట్రైక్ రేట్ తో 2024 సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించాం. 2014లో 150 మందితో మొదలైన జనసేన పార్టీ ప్రయాణం నేడు 12 లక్షల పైచిలుకు క్రియాశీల కార్యకర్తలకు చేరింది. పార్టీ భావజాలాన్ని నమ్మి నాతో పాటు దశాబ్ద కాలపాటు ప్రయాణం చేసిన జన సైనికులు, వీరమహిళలే రియల్ హీరోస్. వాళ్ల పోరాటం ఫలితంగానే 21 మంది శాసనసభ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో ఘన విజయం సాధించాం.
• జన సైనికులు, వీర మహిళలే అన్ సంగ్ హీరోస్
పోరాటాల పురుటిగడ్డ తెలంగాణలో జనసేన పార్టీ ప్రయాణం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ లో నిలదొక్కుకున్నాం. ఈ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. పార్టీ ప్రారంభించిన మొదటి రోజు ఏ ఉద్వేగంతో ఉన్నానో… ఈ రోజుకు అదే ఉద్వేగంతో ఉన్నాను. దశాబ్దకాల ప్రయాణంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి. తగిలిన ప్రతి దెబ్బకు రాటుదేలాను తప్ప విశ్వాసం కోల్పోలేదు, నడక తడబడలేదు. తగిలిన ప్రతి దెబ్బ నన్ను మరింత బలవంతుడిని చేసింది. ఈ ప్రయాణంలో నాతో పాటు నిలబడిన మీరంతా అన్ సంగ్ హీరోసే. నిజాయతీతో భవిష్యత్తు గమనాన్నే మార్చొచ్చు అని మీరంతా నిరూపించారు. యుద్ధరంగంలో కాలం, సహనమే బలమైన ఆయుధాలు. అలాంటి సహనాన్ని గుండెల్లో పెట్టుకున్న రియల్ హీరోస్ జన సైనికులు, వీర మహిళలు.
• ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం సరైనదే
జనసేన పార్టీ జాతి ఆశలను ముందుకు తీసుకెళ్లే పార్టీ. ఈ పార్టీ గురించి ఒక రోజు దేశమంతా మాట్లాడుకోవాలని కలలు కన్నాను. అది నిజమైనందుకు గర్వపడుతున్నాను. బంగారం లాంటి భవిష్యత్తు వదిలేసి రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లానని నాకు ఏనాడు అనిపించలేదు. ఉద్ధానం కిడ్నీ బాధితులకు అండగా నిలబడినప్పుడు, గిరి శిఖర గ్రామాలకు రోడ్లు వేస్తున్నప్పుడు వారి కళ్లల్లో ఆనందం చూసి నా నిర్ణయం సరైనదే అనిపించింది. జనసేన పార్టీ ఉనికి లేకపోయినా మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి ప్రజలు తరలివచ్చి మేము కూడా జనసేనలో భాగస్వాములు అవుతాం అని అడుగుతున్నారు. వారందరికి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను.
• కాలంతో పాటు మార్పు అనివార్యం
సరైన రాజకీయ వ్యూహం లేకుండా సిద్ధాంత బలం మాత్రమే మాట్లాడి అడవుల్లో హతమైన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. రాజకీయాల్లో సిద్ధాంత బలంతోపాటు వాటిని సంపూర్ణంగా నమ్మి అమలు చేసే శక్తి ఉండాలి. అప్పుడే కోరుకున్న మార్పు వస్తుంది. జనసేన పార్టీ ఏడు మూల సిద్దాంతాలను ప్రతిపాదించినప్పుడు చాలా మంది అవహేళనగా మాట్లాడారు. నిలకడలేని రాజకీయాలు అంటూ అపహాస్యం చేశారు. ఆ రోజు నన్ను నిజంగా నమ్మింది జనసైనికులు, వీరమహిళలే. ఆనాడు కమ్యూనిజం అంటూ మాట్లాడిన సోవియట్ రష్యా.. డెమోక్రటిక్ దేశంగా మారింది. మావోయిజం అని మాట్లాడిన చైనా క్యాపిటలిజంలోకి వచ్చింది. కఠినమైన నిబంధనలు పాటించే సౌదీ అరేబియా ఆడవాళ్లకు ఓటు హక్కు కల్పించింది. ప్రపంచమే క్రమక్రమంగా మారుతోంది. కాలంతోపాటు మార్పులు అనివార్యం. కమ్యూనిజం, సోషలిజం, క్యాపిటిలిజం ఇలా అన్ని సిద్ధాంతాలపై అవగాహన పెంచుకున్న తరువాతే పార్టీ పెట్టాను. సినిమాల్లో నటించినంత మాత్రాన అవగాహన లేదని అనుకోవద్దు. ప్రతి సిద్ధాంతంపై సంపూర్ణ అవగాహనతోనే మాట్లాడతాను. నేను ప్రతిపాదించిన సిద్ధాంతాలకు నేను దశాబ్ద కాలంపాటు నలిగి నిలబడ్డాను కాబట్టే 100 శాతం స్ట్రైక్ రేట్ తో విజయం సాధించాను. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. గిరిజన గ్రామాలకు రోడ్లు వేయడానికి తుపాకులే పట్టుకోనక్కరలేదు. సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో మనం పట్టుకున్న పార్టీ జెండానే ఆయుధంగా మారుతుంది. మన మాటే తూటా అవుతుంది.
• మనం నిలబడ్డాం.. రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములయ్యాం
మనం బలంగా నిలబడ్డాం.. పోరాడాం కాబట్టే రాష్ట్రంలో సుస్థిరపాలనకు బీజాలు పడ్డాయి. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ వద్దేవద్దు అని మొదట గళమెత్తింది జనసేన పార్టీ. విశాఖ స్టీల్ ప్లాంటు ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక అని కేంద్ర పెద్దల దృష్టికి బలంగా తీసుకెళ్లింది జనసేన పార్టీ. మనం అండగా నిలిచాం కాబట్టే కేంద్రం విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ నిలుపుదల చేసి, ఆర్థికంగా ఆదుకునేందుకు నిధులు విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.8,622 కోట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,295 నిధుల విడుదలకు పచ్చజెండా ఊపింది. విశాఖ స్టీల్ ను గాడిన పెట్టే చర్యలు వేగంగా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వానికి కేంద్రం అందిస్తున్న సహకారం వెలకట్టలేనిది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.12,157 కోట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.5,936 కోట్లు అందించి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేందుకు చొరవ తీసుకవడం సంతోషం.
కూటమి ప్రభుత్వం దీపం-2 పథకం కింద ప్రతి ఒక్కరికీ ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించే పథకాన్ని అమలు చేస్తోంది. దీనికి అయిదేళ్లలో రూ.13,422 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ ఆగస్టు 15 నుంచి స్త్రీశక్తి పథకం కింద 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తోంది. దీనికోసం రూ.2 వేల కోట్లను వెచ్చించనుంది.
అలాగే నేను నిర్వర్తించే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా ఒకే రోజున 13,326 పంచాయతీల్లో గ్రామసభలను నిర్వర్తించి రికార్డు నెలకొల్పాం. గ్రామసభల్లో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేలా పల్లె పండుగ పేరుతో 4 వేల కిలోమీటర్ల రోడ్లు, 22,500 గోకులాలు, 1.50 లక్షల నీటితొట్టెలు వంటి కార్యక్రమాలను అమలు చేశాం. 75 లక్షల ఉపాధి శ్రామికులకు రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు ప్రమాద బీమాను అమలు చేశాం. అడవితల్లి బాట పేరుతో రూ.1005 కోట్ల నిధులతో 625 గిరిజన గ్రామాలను అనుసంధానం చేస్తూ, 1069 కిలోమీటర్ల రోడ్లను వేయగలిగాం. జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా 5 కొత్త ప్రాజెక్టులను తీసుకొచ్చి, రూ.7,910 కోట్లతో 1.20 కోట్ల మందికి 30 ఏళ్ల పాటు తాగునీటి కొరత లేకుండా చేయగలిగాం. ఇవన్నీ కూడా దేశం గురించి ఆలోచించి, రాష్ట్ర పురోగతి గురించి రాజకీయ ప్రయాణం చేస్తే లభించిన గొప్ప మైలురాళ్లు. రాష్ట్రానికి 15 ఏళ్ల పాటు సుస్థిరమైన ప్రభుత్వ పాలన ఉంటేనే మళ్లీ ఆంధ్రప్రదేశ్ సరికొత్తగా వెలుగులీనుతుంది. గత ప్రభుత్వ అరాచక పాలన మళ్లీ ఈ రాష్ట్రంలో రాకుండా జాగ్రత్త పడాలి. ఈ దసరా నుంచి దేశం కోసం పనిచేసే సరికొత్త సేనను నిర్మిద్దాం. ఈ క్రతువులో ప్రతి ఒక్కరూ పోరాట శక్తిలా తయారు కావాలి.’’ అన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్, శ్రీ కందుల దుర్గేష్, ఎంపీలు శ్రీ వల్లభనేని బాలశౌరి, శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ శ్రీ కె.నాగబాబు, ప్రభుత్వ విప్ లు శ్రీ పిడుగు హరిప్రసాద్, శ్రీ అరవ శ్రీధర్, శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, శ్రీ బొమ్మిడి నాయకర్, శాసన సభ్యులు శ్రీ సిహెచ్.వంశీకృష్ణ శ్రీనివాస్, శ్రీ పంచకర్ల రమేశ్ బాబు, శ్రీ కొణతాల రామకృష్ణ, శ్రీ సుందరపు విజయ్ కుమార్, శ్రీ నిమ్మక జయకృష్ణ, శ్రీ పంతం నానాజీ, శ్రీ దేవ వరప్రసాద్, శ్రీ బత్తుల బలరామకృష్ణ, శ్రీ గిడ్డి సత్యనారాయణ, శ్రీ పులపర్తి రామాంజనేయులు, శ్రీ పత్సమట్ల ధర్మరాజు, శ్రీ చిర్రి బాలరాజు, శ్రీ మండలి బుద్ధప్రసాద్, శ్రీ ఆరణి శ్రీనివాసులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, టీటీడీ బోర్డు సభ్యులు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, తెలంగాణ రాష్ట్ర నాయకులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జీవీఎంసీ ఉప మేయర్, కార్పొరేటర్లు, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పార్టీ నియోజకవర్గ ఇంచార్జులు, పీఓసీలు తదితర నాయకులు పాల్గొన్నారు.
మా ధైర్యం.. మా స్థైర్యం.. మా సేనాని
• శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాం
• సేనతో సేనాని వేదికపై జన సైనికులు, వీర మహిళల మనోగతం
రాష్ట్ర భవిష్యత్తు కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు. కష్టాల్లో జనానికి అండగా నిలిచే విధంగా జనసైన్యాన్ని మలచారు. రబ్బరు చెప్పులు వేసుకొనేవారితో రాజకీయాలు చేయించి చూపారు. మహిళల్లో అర్థరాత్రి ఒంటరిగా పోరాడే ధైర్యం నింపారు. మీ పార్టీ ఎక్కడ అనే స్థాయి నుంచి 100 శాతం స్ట్రయిక్ రేట్ విజయంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఆ నాయకుడి స్ఫూర్తే మమ్మల్ని ముందుకు నడిపిస్తోంది. విశాఖ మహా నగరంలో శనివారం జనసేన పార్టీ నిర్వహించిన సేనతో సేనాని వేదికపై జనసైనికులు, వీర మహిళల మనోగతం ఇది. ఈ కార్యక్రమాన్ని గోపాలపట్నం ప్రాంతానికి చెందిన శ్రీమతి గోవిందమ్మ చేతుల మీదుగా ప్రారంభించారు. ఆమె జ్యోతి ప్రజ్వలన చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనవాణి నిర్వహించే నిమిత్తం విశాఖ వచ్చిన సందర్భంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం చేసిన దమనకాండకు ఎదురు నిలిచి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావంగా అర్ధరాత్రి మొత్తం చంటి బిడ్డతో నోవాటెల్ హోటల్ ఎదురుగా పార్టీ జెండా పట్టుకుని తెగువ చూపిన వీర మహిళ శ్రీమతి గోవిందమ్మ. ఆమెను గౌరవిస్తూ “సేనతో సేనాని” విస్తృత స్థాయి సమావేశం జ్యోతి ప్రజ్వలన ఆమెతో గావించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు ప్రారంభోపన్యాసంతో మొదలైన ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన పలువురు జనసైనికులు, వీర మహిళలు పార్టీ ప్రస్థానంలో తమ అనుభవాలను వేదికపై నుంచి పంచుకున్నారు.
• “దేశ స్వాతంత్ర్య సాధన కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందు ఫౌజ్ స్థాపిస్తే.. మన రాష్ట్ర భవిష్యత్తు కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసైన్యాన్ని తయారు చేశారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి జనసైనికుడు సిద్ధంగా ఉండాలి. జనసైన్యం నుంచి నాయకుల్ని తయారు చేసేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు. ఆయన సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లేందుకు మనమంతా సిద్ధంగా ఉండాలి. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లినట్టే.. మన ప్రభుత్వం చేస్తున్న మంచిని కూడా అందరికీ తెలియపర్చాలి”.
- శ్రీ కొప్పురావూరి రామారావు, గురజాల
• “అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసిన పార్టీ జనసేన. కొన్నేళ్ల క్రితం రాయలసీమలో మీ పార్టీ ఎక్కడ అని అడిగే వారు. ఈ రోజు అదే రాయలసీమలో పులివెందుల కంటే అత్యధిక మెజారిటీ సాధించిన నియోజకవర్గంగా జనసేన బరిలోకి దిగిన తిరుపతి నిలిచింది. చేతిలో అధికారం లేకున్నా ప్రజలకు సేవ చేసిన పార్టీ జనసేన. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులోనూ మనమంతా ముందుకు తీసుకువెళ్లాలి”. - శ్రీ శ్రీకాంత్, విశాఖపట్నం
• “2019లో యురేనియం సమస్యపై శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మొదటి సారి కలసినప్పుడు ఆయన ఇచ్చిన ధైర్యమే మా సమస్యకు పరిష్కారం చూపింది. ఆనాడు ఆయన ఇచ్చిన ధైర్యంతోనే ఇప్పటి వరకు సమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నాను. అందుకే నల్లమల చెంచు బిడ్డలంతా మా ఆరాధ్య ధైర్యం శ్రీశైల మల్లన్న, శ్రీ లక్ష్మీనరసింహస్వామి, గౌరమ్మలను పూజిస్తాం.. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని గౌరవిస్తాం. కొంత మంది తెలంగాణలో పార్టీ బలంగా లేదు అంటారు. నల్లమల అటవీ ప్రాంతంలో గుడిసె మీద కూడా జనసేన జెండా ఎగురుతుంది. అదే జెండా ఒకరోజు తెలంగాణ శాసన సభలో ప్రజా సమస్యలు లేవనెత్తే రోజు వస్తుంది”. - శ్రీ శివ, నల్లమల అటవీ ప్రాంతం (తెలంగాణ)
• “వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యం అయిన స్థానిక సంస్థలకు కూటమి ప్రభుత్వంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు జీవం పోశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఒకే రోజు 13326 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి గ్రామస్వరాజ్యం అంటే ఏంటో చూపించారు. డోలీ మోతలు లేని గిరిజన గ్రామాలే లక్ష్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేశారు” - శ్రీమతి విజయలక్ష్మి, భీమవరం
• “2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ తో అఖండ విజయం సాధించింది అంటే దాని వెనుక శ్రీ పవన్ కళ్యాణ్ గారి దశాబ్ధ కాలంగా పడిన కష్టం ఉంది. ఉద్ధానం సమస్యను ప్రపంచానికి తెలిసేలా చేశారు. ఆక్వా రైతులకు అండగా నిలబడ్డారు. కౌలు రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపారు” - శ్రీమతి విష్ణు ప్రియాంక, శ్రీకాకుళం
• “ఒక చేత్తో చంటి బిడ్డను పట్టుకొని మరో చేత్తే కత్తి పట్టి యుద్ధం చేసిన ఝాన్సీ లక్ష్మీబాయిని స్ఫూర్తిగా తీసుకొని మహిళలు రాజకీయాల్లో రావాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చాను. ఆయన ఇచ్చిన ధైర్యంతో గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం” - శ్రీమతి శిరీషా రెడ్డి, కాకినాడ
• “అకౌంటెంట్ గా పనిచేసుకుంటున్న నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. విజయనగరం జిల్లాలో కొన్ని కుటుంబాలకే పరిమితమైన రాజకీయాలను సామాన్యులకు చేరువ చేసి మండలాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించి ఉన్నతమైన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు” - శ్రీ వెంకటేష్, చీపురుపల్లి
• “ఓపిక, సహనంతో మనసా వాచా కర్మణా జనసేన పార్టీలో ప్రయాణం చేస్తే నాయకుడిగా ఏ స్థాయికైనా ఎదగవచ్చు. అది మనకు మన నాయకుడు ఇస్తున్న భరోసా. రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన పార్టీని స్థాపించారు. కష్టాల్లో జనానికి అండగా నిలిచే విధంగా పార్టీ శ్రేణులను మలచారు.” - శ్రీ డేగల సతీష్, రామచంద్రపురం
• “పోరాటయాత్రలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు అరకు వచ్చి బురద రోడ్లలో నడినప్పుడు అధికారంలోకి వచ్చాక కొత్త రోడ్లు వేయిస్తానని మాటిచ్చారు. మా గిరిబిడ్డలు ఎవ్వరూ నమ్మలేదు. ఓ ముసలావిడ మాత్రం బలంగా నమ్మింది. ఆ నమ్మకం నేడు నిజం అయ్యింది. మా గిరిజన ప్రాంతాల్లో బురద రోడ్లను బీటీ రోడ్లుగా మార్చిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆ బీటీ రోడ్లతో విద్య, వైద్యం, రవాణా సదుపాయాలు మెరుగయ్యాయి” - శ్రీ చెట్టి ఆనంద్, అరకు
• జనసేన పార్టీ స్థాపన సమయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట రబ్బరు చెప్పులు వేసుకున్న వారితో రాజకీయాలు చేయిస్తాను అని. అందుకు నేనే నిలువెత్తు ఉదాహరణ. మా గ్రామంలో ఎంపీటీసీగా పోటీ చేసి 13 ఓట్ల తేడాతో ఓడిపోయాను. ఓడినా నన్ను నమ్మి 912 మంది మా గ్రామస్తులు నాకు ఓట్లు వేశారు. నాలాంటి సామాన్యులతో రాజకీయాలు చేయించే సత్తా జనసేనకే సాధ్యం” - శ్రీ సేనాపతి శేషు, నర్సీపట్నం
• ప్రజా పోరాటయాత్రలో మొట్టమొదటి సారి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలసినప్పుడు నేను ఒక ఆకతాయిని. నాడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటలు నాలో స్ఫూర్తిని నింపాయి. అదే స్ఫూర్తితో ఈ రోజు బాగా చదువుకుని మంచి ఉద్యోగం సాధించాను. శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పది నిమిషాల సంభాషణ ఓ ఆకతాయి యువకుడిని నెలకు లక్షన్నర సంపాదించే యోగ్యుడిగా తీర్చిదిద్దింది” - శ్రీ హరీష్, నర్సీపట్నం
• “వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలను చూస్తే ప్రజలు ఇరిటేట్ అయ్యేవారు. మన ప్రభుత్వంలో ఎమ్మెల్యేలను చూసి ఇన్సిప్రేషన్ ఫీలవుతున్నారు. మహిళల భద్రత విషయంలోనూ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ముందు, తర్వాత తేడా ఉంది. గతంలో మహిళలు భద్రత కోసం పోరాడేవారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఆశయాలు, హక్కుల కోసం పోరాడే రోజులు వచ్చాయి. ప్రతి బిడ్డా అన్యాయాలను స్వయంగా ఎదుర్కొనే ధైర్యం వచ్చింది. వారాహి యాత్రలో వాలంటీర్ గా పని చేసేందుకు తణుకు వెళ్లి తిరిగి వెళ్తున్న నాపై కొంత మంది దాడి చేశారు. జనసేన జెండా పట్టుకున్నందుకు ఆడదానివని కూడా చూడకుండా చంపేస్తామన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ధైర్యంతో అర్ధరాత్రి ఒంటరిగా పోరాటం చేశా. ఒక్క ఫోన్ కాల్ తో పార్టీ వాలంటరీ టీమ్ వచ్చి నాకు అండగా నిలబడింది. అలాంటి నాయకత్వాన్ని ఇంకా తయారు చేయాలి” - శ్రీమతి రియా, పాలకొల్లు
- జనసేనకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటే వేదం
- నిస్వార్థంగా నిజాయతీ గల నాయకుడి వెంట నడుద్దాం
- కష్టపడిన ప్రతి ఒక్కరినీ అధ్యక్షుల వారు గుర్తుంచుకుంటారు
- పాలనలో పట్టు కోసమే పార్టీ కార్యక్రమాల్లో గ్యాప్ వచ్చింది
- గత వైసీపీ విధ్వంస పాలనలో ప్రజలు విసిగిపోయారు
- సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి
- కూటమి ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- విశాఖలో జరిగిన సేనతో సేనాని కార్యక్రమంలో మాట్లాడిన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
నాయకుడిని నమ్మి, ఆయన కష్ట సమయంలో అండగా నిలవాలని మూడేళ్ల చంటి బిడ్డతో విశాఖ సముద్ర తీరాన పట్టుదలగా పార్టీ జెండా పట్టుకొని నిలబడిన వీర మహిళ శ్రీమతి గోవిందమ్మ గారు. ఆమె తెగువ, ఓర్పు మనందరికీ స్ఫూర్తి. అలాంటి ఎన్నో గుండెల సమూహమే జనసేన పార్టీ. అందుకే శ్రీమతి గోవిందమ్మ గారి లాంటి వీర మహిళతో ‘‘సేనతో సేనాని’’ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇది కార్యకర్తలందరికీ దక్కిన గౌరవం. పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడే ప్రతి ఒక్కరికీ గుర్తింపును ఇచ్చే పార్టీ జనసేన పార్టీ. పోరాటాలు, పట్టుదల, ఉద్యమాలు, ఉద్వేగాల సమ్మేళనం జనసేన పార్టీ. జనసైనికులు, వీర మహిళల్లో కనిపించే ఈ లక్షణాలే పార్టీని ముందుకు నడిపించే రథ చక్రాలుగా పనిచేస్తాయని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. పుష్కరకాల జనసేన ప్రస్థానం ఆది నుంచి ప్రజా పంథాలో, ప్రజలతో మమేకమై సామాన్యుడి అస్త్రంగానే ముందుకు సాగిందన్నారు. జనసేన పార్టీ విశాఖపట్నం వేదికగా శనివారం నిర్వహించిన ‘‘సేనతో సేనాని’’ బహిరంగసభలో శ్రీ మనోహర్ గారు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ‘‘ పరిమిత వనరులతో బ్రిటీషు వారి గుండెల్లో అగ్గిపిడుగులా మారి దడ పుట్టించిన మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తితో సభా ప్రాంగణానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన పేరునే పెట్టారు. అల్లూరి స్ఫూర్తిని జనసైనికులు, వీర మహిళలు అందిపుచ్చుకోవాలి. వారి కృషి ఫలితంగానే జనసేన రిజిస్టర్ పార్టీ నుంచి గుర్తింపు పొందిన పార్టీగా ఉద్భవించింది. ప్రజా పోరాటాన్ని ఓ సమూహంలో నింపి, వారిని సరైన దశలో ముందుకు తీసుకెళ్లిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. - పట్టించుకోవడం లేదు అనుకోవద్దు
పార్టీ మీద విపరీతమైన అభిమానం, శ్రీ పవన్ కళ్యాణ్ గారంటే విపరీతమైన ఇష్టం ఉన్న కొందరు ఈ మధ్యకాలంలో అవగాహన లేకుండా ఆవేశంతో సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. ఇది బాధించే అంశం. అందరికీ తగిన గుర్తింపును ఇవ్వాలన్నదే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. 14 నెలల కూటమి పాలనలో పాలనపరమైన అంశాలను తెలుసుకునేందుకు, దానిపై పూర్తిగా దృష్టి సారించేందుకు కాస్త సమయం పట్టింది. దీన్నే చూపుతూ పార్టీ మీద ఇష్టానుసారం మాట్లాడటం మంచిది కాదు. పాలనలో పట్టు తెచ్చుకోవడం ప్రధానం. ఏదైనా పథకం లేదా కార్యక్రమం చేయాలన్నా సామాన్యుడి పంథాలో ఆలోచించి ముందుకు వెళ్లడం శ్రీ పవన్ కళ్యాణ్ గారి నైజం. క్షేత్రస్థాయిలో ఆయన చూసిన సమస్యలు, వేదనలు అన్ని గుర్తుంచుకొని పథకాలకు, కార్యక్రమాలకు రూపకల్పన చేయడం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేకత. గత వైసీపీ హయాంలో ప్రజలంతా విసిగిపోయి కూటమి ప్రభుత్వానికి ఘన విజయం ఇచ్చారు. అప్పటి అరాచక, అవినీతి పాలన ప్రజలందరికీ ఇప్పటికే గుర్తే. ఓ అహంకార పాలనకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతోనే వైసీపీని ఇంటికి పంపి, కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. ప్రజలు పెట్టుకున్న ఈ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిలో ముందుకు వెళ్తూ పని చేస్తుంది. జనసైనికులు, వీర మహిళలు ఈ ప్రభుత్వం మనది.. మనందరిదీ అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలి. సామాజిక, వర్తమాన విషయాలు, ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలపై విస్తృత అవగాహన పెంచుకోండి. - రుషికొండ భవనాలు పెచ్చులూడిపోతే సెట్టింగ్ అంటూ విష ప్రచారం
గత ప్రభుత్వంలో ఓ నాయకుడు ప్రజాధనంతో సొంత ప్యాలెస్ ను కట్టుకోవడానికి విశాఖలో రుషికొండపై విధ్వంసం సృష్టించాడు. రూ.453 కోట్లను వెచ్చించి అత్యాధునిక భవనాలను నిర్మించి, ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డాడు. ఆ భవనాలను చూసేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మేము నిన్న అక్కడకు వెళితే భవనాల సీలింగ్ పెచ్చులూడిపోయిన దృశ్యాన్ని పరిశీలిస్తున్న చిత్రాలను పత్రికల్లో, సోషల్ మీడియాలో వేస్తూ ఓ వర్గం విష ప్రచారం మొదలుపెట్టింది. పెచ్చులూడిన సీలింగ్ ముక్కలు సరైన ప్రదేశంలో పడలేదని, సెట్టుంగులు అంటూ విషం కక్కుతున్నారు. భవనాలను పరిశీలిస్తున్న సమయంలో పెచ్చులూడిన పోయిన ప్రదేశాన్ని చూస్తున్నపుడు తీసిన చిత్రాలతో ఉంచి సోషల్ మీడియా వేదికగా విషం చిమ్ముతున్నారు. ఇలాంటి వారిని ఏమనాలి..? ప్రజల డబ్బు రూ.453 కోట్లతో సొంత భవనం నిర్మించుకున్న వ్యక్తి ప్రజలకు సమాధానం చెప్పాలి. రుషికొండపై ఎందుకు ప్రతాపం చూపారో ప్రజలకే బహిరంగంగా జవాబు ఇవ్వాలి. జరిగే ప్రతి తప్పును జనసేన పార్టీ ప్రజల ముందు పెడుతుంది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెడుతుంది. ఇలాంటి సోషల్ మీడియా విష ప్రచారాలపై జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యక్తిగతంగా సోషల్ మీడియా వేదికగా మహిళల మీద చేస్తున్న వికృత చేష్టలను తిప్పికొట్టాలి. - అంతా ఒకే మాట మీద ముందుకు వెళ్దాం
జనసేన పార్టీలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటే నాయకులు, జనసైనికులు, వీర మహిళకు వేదం కావాలి. ఆయన అడుగులో అడుగు వేస్తూ, చెప్పే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వింటూ ముందుకు వెళ్లాలి. క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదలతో సమష్టిగా కదలుదాం. అంకితభావంతో పార్టీ కార్యక్రమాలను నిర్వహిద్దాం. నేను, శ్రీ పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడుకునే సమయంలో జనసేన పార్టీ ప్రస్థానం పదవుల కోసమో, అధికారం కోసమో కాదని స్పష్టంగా అనుకునేవాళ్లం. ఈ ప్రయాణం దేశం కోసం, దేశానికి అవసరమయ్యే నిజాయతీ గల నాయకత్వాన్ని అందించడం కోసమని భావించాం. ఒకే మాట మీద కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు నిలబడదాం. 12.34 లక్షల క్రియాశీలక సభ్యత్వాన్ని పార్టీకి అందించిన గొప్ప యంత్రాంగం మనకుంది. దీన్ని మరింతగా విస్తృతం చేద్దాం. కూటమి స్ఫూర్తిని నిలబెట్టి, కూటమిలోని ఇతర పార్టీల నాయకులను గౌరవిద్దాం. మనం గౌరవం పొంది మన నాయకుడికి తోడునీడగా నిలుద్దాం’’ అన్నారు.
