Uncategorized

జనసైనికులు, వీరమహిళల ప్రేరణే జనసేన పార్టీకి శ్వాస …. డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్

Spread the love

జన సైనికులు, వీర మహిళల ప్రేరణే జనసేన పార్టీకి శ్వాస

  • జనసేన పార్టీకి కార్యకర్తల బలమే ప్రధాన శక్తి
  • పార్టీ కార్యకర్తలంతా నా ఆత్మ బంధువులు
  • క్రియాశీలక సభ్యుల బీమా పరిహారం సొమ్ము పెంచాలన్న ఆలోచన ఉంది
  • ఉపాధి శ్రామికులకు బీమా అందించడం వెనుక జనసేన స్ఫూర్తి ఉంది
  • కార్యకర్తలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎన్నడూ వమ్ము చేయను
  • క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీలో సేవలు అందించిన వాలంటీర్లతో సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు, ఉపముఖ్యమంత్రివర్యులు

శ్రీ పవన్ కళ్యాణ్ గారు

‘జన సైనికులు, వీర మహిళల ఆశయమే జనసేన పార్టీకి ప్రేరణ. వారి ఆకాంక్షలు, అభిమానమే పార్టీకి ఇంధనం. వారి నమ్మకం సమాజహితమే పార్టీకి ఆస్తి’ అని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీపవన్ కళ్యాణ్ గారు అన్నారు. ప్రాంతాలు, మతాలు, కులాలు, సంస్కృతులను దాటి భిన్నమైన వాతావరణంలో పెరిగిన ఓ సమూహం తాలూక బలమైన ఆశయానికి జనసేన పార్టీ వేదిక అని చెప్పారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీలో స్వచ్ఛందంగా భాగస్వాములైన వారితో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళవారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “నేను మానవత్వాన్ని నమ్ముతాను. కొన్ని కొన్ని సార్లు కులాలు, మతాల ప్రస్తావన నా మాటల్లో వచ్చినా అంతిమంగా మాత్రం ప్రతి ఒక్కరూ బాగుండాలని, మనిషికి మనిషి తోడ్పడాలి అన్నదే నా అంతరార్ధం. శ్రీ గుర్రం జాషువా గారు చెప్పినట్టు విశ్వ నరుడిగా బతకాలన్నది నా ఆకాంక్ష. కులం, మతం, ప్రాంతం దాటి మనిషిగా బతకాలన్నదే నా ఆకాంక్ష.

  • పోయిన ప్రాణాన్ని తీసుకురాలేం.. ఆపదలో భరోసా ఇవ్వగలం

పార్టీ క్రియాశీలక సభ్యులకు రూ. 5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నాం. ఈ ఆలోచన వచ్చినప్పుడు ఎలా ముందుకు వెళ్లగలం అనే భావన రాలేదు. మంచి సంకల్పంతో ఎంతో మందికి బీమా సొమ్మును అందించగలిగాం. బీమా పరిహార సొమ్మును మరింత పెంచాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. దీని సాధ్యాసాధ్యాలను బీమా కంపెనీలతో మాట్లాడుతున్నాము. పాలనలో కూడా జాతీయ ఉపాధి హామీ పథకం శ్రామికులకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ ప్రేరణతోనే ప్రమాద బీమా చేయిస్తున్నాం. ఉపాధి శ్రామికులకు కూడా బతుకు భరోసా ఇవ్వాలి అనేది పార్టీ నుంచి స్ఫూర్తి పొందిన గొప్ప విషయం.

పెహల్గాం ఘటనలో మృతి చెందిన 26 మందిలో క్రియాశీలక జనసైనికుడు ఉంటాడని నేను ఊహించలేదు. వారికి తగిన విధంగా పార్టీ నుంచి సహాయం చేయగలిగాం. మనం ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము గాని, ఆపదలో వారికి ఆర్ధిక భరోసా అందించే బాధ్యతను తీసుకున్నాం.

  • దేశమంటే విపరీతమైన అభిమానం

జనసేన పార్టీ ప్రారంభించినప్పుడు సమాజానికి ఏదైనా చేయాలన్న బలమైన సంకల్పం తప్ప మరో ఆలోచన లేదు. దేశమంటే చిన్నప్పటి నుంచి ఎందుకో విపరీతమైన అభిమానం. చరిత్ర చదువుతున్నప్పుడల్లా ఎందరో బలిదానాలు, ఆత్మత్యాగాలు మీద మనం బతుకుతున్నామన్న గొప్ప అనుభూతి నాకు ప్రతిసారి కలుగుతుంది. దేశం నుంచి తీసుకోవడం కాదు. ఏదైనా ఇవ్వాలన్న బలమైన సంకల్పంతోనే పార్టీని స్థాపించాము. ఓటమిలో ఎదిగిన పార్టీ జనసేన పార్టీ. జనసేనకు కార్యకర్తలే బలం. సమాజానికి ఏదైనా చేయాలన్న తపన, దేశానికి ఏదైనా ఇవ్వాలన్న ఉత్సాహం ఓ సమూహంలో ఉంటే వారందరి ఒకే రకమైన ఆలోచనా విధానం అయితే అది జనసేన పార్టీ అవుతుంది. నేను ఒక్కడినే వేసిన అడుగుకు లక్షలాది మంది పదం కదిపారు. అది మహా సంకల్పంగా మారింది. ఇంత మంది నాపై పెట్టుకున్న భరోసాను ఎప్పుడూ వమ్ము చేయను. మీకు నచ్చని పని చేయను. ముందుగా నా జీవితాన్ని రిస్కులో పెట్టుకుంటాను తప్ప మీ జీవితాన్ని రిస్కులో పెట్టను. మీరంతా నా ఆత్మ బంధువులు. మీ స్థానం నా మనసులో పదిలంగా ఉంటుంది” అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *