
వేసవి నీటి ఎద్దడి సవాళ్లను ప్రణాళికాబద్దంగా అధిగమిద్దాం
• నీటి కొరత ఉన్న ప్రాంతాలను మ్యాపింగ్ చేయండి
•తాగు నీటి సరఫరాపై రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో వార్ రూమ్స్ ఏర్పాటు చేయాలి
• గ్రామ స్థాయిలో నీటి ప్రణాళికలను సిద్ధం చేయాలి
• నీటి సంరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలి
• ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులతో సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
గ్రామీణ ప్రాంతాల్లో వేసవిలో ఎదురయ్యే తాగు నీటి సరఫరా సవాళ్లను ఎదుర్కొనేందుకు అధికారులు పూర్తి స్థాయి సంసిద్ధతతో ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. నీటి కొరత ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. నీటి సంరక్షణ పట్ల ప్రజల్లోనూ అవగాహన కల్పించాలని చెప్పారు. తాగు నీటి సరఫరాపై రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక వాటర్ వార్ రూమ్ లు ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రోజువారీ నీటి సరఫరా వ్యవస్థను పర్యవేక్షించాలని ఆదేశించారు. వేసవిలో నీటి ఎద్దడిపై గురువారం మంగళగిరిలో ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఒక్క చుక్క వర్షపు నీటిని వృథా చేయకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలి. వర్షపునీటి సేకరణపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి. ఇంటింటికీ, కమ్యూనిటి భవనాలకు వర్షపు నీటి హార్వెస్టింగ్ పద్ధతులు ఏర్పాటు చేయాలి. తాగు నీటి అవసరాల కోసం, భవిష్యత్తు తరాల కోసం నీటి నిల్వను పెంచేలా చర్యలు తీసుకోవాలి. ఉపాధి హామీ పథకం ద్వారా వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతి గ్రామంలో ఫిల్టర్ బెడ్లను పరిశీలించి, అవసరమైన మరమ్మత్తులు చేసి శుద్ధమైన నీటిని ప్రజలకు అందించే ఏర్పాటు చేయాలి. ఆర్వో ప్లాంట్లు సక్రమంగా పని చేస్తున్నాయా.? లేదా అనే విషయాన్ని క్షేత్ర స్థాయిలో అధికారులు పరిశీలించాలి. వాటర్ టెస్టింగ్ ల్యాబ్స్ ద్వారా నీటి నమూనాలను పరీక్షించి ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీటిని అందించాలి. ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కాకుండా చూడాలి. పారదర్శకతతో కూడిన ప్రణాళికలు అమలు చేయాలి. నీటి పరిరక్షణపై పాఠశాల, కాలేజీ విద్యార్థులతో అవగాహన ర్యాలీలు నిర్వహించి ప్రచారం చేయాలి. ప్రకృతి నుంచి వచ్చే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకునే ఏర్పాటు చేయాలి. వేసవిలో విద్యార్థులకు, యువతకు నీటి సంరక్షణలో అవగాహనా కార్యక్రమాల్లో భాగం చేసే విధంగా మన ప్రణాళికలు ఉండాలి. వారికి వేసవి ఇంటర్న్ షిప్ ద్వారా గౌరవ వేతనాలు, సర్టిఫికెట్లు ఇచ్చి ప్రోత్సహించాలి నీటి సంరక్షణ, నీటి వనరుల పర్యవేక్షణ తాగునీటి సమస్యలను ఎదుర్కొనే ప్రక్రియలో వీరి సహకారం తీసుకుందాం.
వేసవిలో నీటి ఎద్దడి నుంచి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైతే నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని ప్రతి ఇంటికి సరఫరా చేయాలి. ప్రతి ఒక్కరు బాధ్యతగా నీటిని వినియోగించేలా చర్యలు చేపట్టాలి. గ్రామ గ్రామానికి ప్రత్యేకమైన సమగ్ర తాగునీటి ప్రణాళిక రూపొందించాలి” అన్నారు.
