Uncategorized

మరో 50వేల మెట్రిక్ టన్నులు యూరియా…. మంత్రి అచ్చెన్నాయుడు

Spread the love

రాష్ట్రానికి మరో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా

ఫలించిన సీఎం చంద్రబాబు విశేష కృషి

రైతాంగం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నయుడు

(అమరావతి, సెప్టెంబర్ 8 :pvginox.com by PALLA VENUGOPAL )

రాష్ట్రానికి మరో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపు జరగడం పట్ల రైతాంగం హర్షం వ్యక్తం చేసింది. ఈ యూరియా కేటాయింపు వెనుక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విశేష కృషి ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సెప్టెంబర్ నెలలో యూరియా వినియోగం ఎక్కువగా ఉండే దృష్ట్యా, అధిక మొత్తంలో యూరియా దిగుమతి జరగడం రైతులకు ఉపశమనం కలిగిస్తుందని అన్నారు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి కృషి వల్లే సాధ్యమైందని రైతు సంఘాలు ప్రశంసించాయని చెప్పారు. గత ఆగస్టు నెలలో కేటాయించిన 81,000 మెట్రిక్ టన్నులకు అదనంగా ప్రస్తుతమిది 50,000 మెట్రిక్ టన్నుల కేటాయింపు అని వెల్లడించారు. రాబోయే రెండు రోజుల్లో కాకినాడ, విశాఖ, మంగళూరు, జైగర్ నౌకాశ్రయాలకు యూరియా సరఫరా చేరుకోనున్నట్లు తెలిపారు. నౌకాశ్రయాల నుండి రాష్ట్రానికి తక్షణమే రైల్వే గూడ్స్ రేకుల ద్వారా ఎరువులు సరఫరా అయ్యేలా కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు దిశానిర్దేశం చేసినట్టు వివరించారు.

దేశవ్యాప్తంగా యూరియా సరఫరాలో ఏర్పడిన ప్రతిష్టంభన సమయంలో రాష్ట్ర రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా కేంద్ర ప్రభుత్వంతో, ముఖ్యంగా కేంద్ర ఎరువుల రసాయనిక మంత్రి నడ్డా గారితో చర్చలు జరిపారు. ఆ కృషి ఫలితంగా 50,000 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపుగా లభించింది. రాష్ట్ర రైతాంగం తరఫున గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

👉 కాకినాడ పోర్టుకు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ద్వారా 17,294 మెట్రిక్ టన్నులు,
👉 మంగళూరు పోర్టుకు ఇండియన్ పొటాష్ లిమిటెడ్ ద్వారా 5,400 మెట్రిక్ టన్నులు,
👉 జైగర్ పోర్టుకు నర్మదా కంపెనీ నుండి 10,800 మెట్రిక్ టన్నులు,
👉 విశాఖ పోర్టుకు నేషనల్ ఫెర్టిలైజర్స్ ద్వారా 15,874 మెట్రిక్ టన్నులు చేరుకోనున్నాయని వెల్లడించారు.

ఇప్పటివరకు 41,183 మెట్రిక్ టన్నులు రైతుసేవ కేంద్రాలకు సరఫరా అయ్యాయని, మిగతా 40,968 మెట్రిక్ టన్నులు రవాణాలో ఉన్నాయని తెలిపారు. రైతులు ధైర్యంగా ఉండాలని, ఎటువంటి ఎరువుల కొరత లేదని హామీ ఇచ్చారు. శాస్త్రీయంగా, తక్షణ అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ అధికారుల సూచనల మేరకు మాత్రమే యూరియా వాడాలని సూచించారు. గ్రామస్థాయిలో ఎరువుల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయ సంచాలకులు డిల్లీ రావుకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రానికి సమృద్ధిగా ఎరువులను కేటాయించేలా చేసిన కృషికి మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మంత్రి అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *