Uncategorized

పర్యావరణ హితం.. మన అభిమతం కావాలి..,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Spread the love

(AMARAVATHI, pvginox.com by PALLA VENUGOPAL )

భావి తరాలకు సాధ్యమైనంత స్వచ్ఛమైన గాలి, నీరు అందించడమే లక్ష్యం

  • కాలుష్య నియంత్రణ మండలి చట్టబద్ధమైన సంస్థ… మండలిని బలోపేతం చేయాలి
  • పెట్టుబడులను ప్రోత్సహిస్తూనే… కాలుష్యాన్ని నియంత్రించేలా ముందుకు వెళ్ళాలి
  • కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది… విధులు సమగ్ర నివేదిక సిద్ధం చేయండి
  • మండలి విధులు, నిధులు, ప్రస్తుత పరిస్థితి ప్రజలకు తెలియాలి
  • అటవీ, పర్యావరణ ముఖ్య కార్యదర్శితో సమావేశమైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

‘మనకు మన పెద్దలు అందించినంత స్వచ్ఛమైన గాలి, నీరు భావి తరాలకు ఇవ్వగలమా? సాధ్యమైనంత స్వచ్ఛంగా ప్రకృతి వనరులను అందించే లక్ష్యంతో పని చేయాలి. గోదావరి పరీవాహక ప్రాంతంలో సైతం నీటిని కొనుక్కొని తాగాల్సి వస్తోంది.. అక్కడి నీరు కలుషితం కావడానికి ఆక్వా రంగం, పేపర్ మిల్లులు కారణంగా ఉన్నాయి అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. సోమవారం మధ్యాహ్నం శాసన సభ కార్యక్రమాలు నడుస్తున్న సందర్భంలో తన ఛాంబర్ లో అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ కృష్ణ తేజతో సమావేశమయ్యారు.
కాలుష్య నియంత్రణ మండలిపై టిడిపి ఎమ్మెల్యే శ్రీ బొండా ఉమామహేశ్వర రావు చేసిన ఆరోపణల క్రమం, మండలి సిబ్బంది, బాధ్యతలపై చర్చించారు. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి అనేది చట్టబద్ధమైన సంస్థ అనీ, ఈ మండలి విధుల నిర్వహణలో ప్రభుత్వ పర్యవేక్షణ పాక్షికంగా ఉంటుందని అధికారులు వివరించారు. పంచాయతీరాజ్ లాంటి శాఖలపై ప్రభుత్వం నేరుగా పర్యవేక్షించి, నియంత్రణ ఉంటుందని… పీసీబీ నిర్ణయాలు, విధుల నిర్వహణపై పర్యవేక్షణలో కొన్ని పరిమితులు ఉంటాయని, పీసీబీ కార్యనిర్వహక మండలికి చట్టబద్ధంగా అధికారాలు ఉంటాయని తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులకు దిశానిర్దేశం చేస్తూ – ‘రాష్ట్రానికి పెట్టుబడులకు ప్రోత్సహిస్తూనే కాలుష్య నియంత్రణకు సంబంధించిన నిబంధనలు అమలు చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆ పేరిట పారిశ్రామికవేత్తలను పారిపోయే పరిస్థితి తీసుకురాకూడదు. గత ప్రభుత్వంలో అలాంటి తప్పిదాలే చోటు చేసుకున్నాయి.
ఎల్జీ పాలిమర్స్ లాంటి సంస్థలలో చోటు చేసుకున్న ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. విశాఖ ప్రాంతంలో ఉన్న ఫార్మా సంస్థలు ఉన్నాయి. వాటిలో కాలుష్య నియంత్రణ నిబంధనలు అమలుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. నిబంధనల అమలులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి. కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించిన తొలి రోజుల్లోనే పీసీబీపై సమీక్షించి దిశా నిర్దేశం చేశాము’ అన్నారు.

  • ఈ ప్రశ్నలపై సమగ్ర నివేదిక ఇవ్వాలి
    ఈ సందర్భంగా– అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి ముందు ఉప ముఖ్యమంత్రివర్యులు కొన్ని ప్రశ్నలు ఉంచారు.
    కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది ఎందరు, వారి విధులు ఏమిటి? అందులో రెగ్యులర్ ఉద్యోగులెందరు? సిబ్బంది కొరత ఎంత? కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఏ మేరకు ఉన్నారు… వారికి అప్పగిస్తున్న విధులేమిటి? అంశాలతోపాటు విధుల నిర్వహణకు మండలికి ఉన్న మౌలిక సదుపాయాలూ, వారికి ఇచ్చే ఆర్ధిక వనరులు, ఆడిట్ ఏ విధంగా చేస్తున్నారు, ఆడిట్ లో గుర్తించిన అంశాలేమిటి? కాలుష్య నియంత్రణ మండలి ఇప్పటి వరకూ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంశంపై ఏ మేరకు దృష్టి సారించింది, వాటి ఫలితాలు ఏమిటి, అనుసరిస్తున్న సాంకేతికత ఏమిటి, కాలుష్య నియంత్రణ మండలి వెబ్ సైట్ పని తీరు ఎలా ఉంది? ప్రాంతాలవారీగా జల, వాయు, శబ్ద కాలుష్యాల వివరాలు అప్ డేట్ చేస్తున్నారా? ప్రజలకు ఏ మేరకు సమాచారం అందుబాటులో ఉంటోంది లాంటి పలు ప్రశ్నలను ముఖ్య కార్యదర్శి ముందు ఉంచారు.
    ఈ ప్రశ్నలపై సమగ్ర వివరణతో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. పీసీబీతో తొలి సమావేశంలో ఈ అంశాలు ప్రస్తావించానని, అసెంబ్లీలో ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు అక్కడే వివరాలు అందించామని ఉప ముఖ్యమంత్రివర్యులు ప్రస్తావించారు. అధికారులు సమగ్ర నివేదిక అందించాక… అవగాహన కలిగేలా పూర్తి వివరాలు ప్రజలకు తెలియచేద్దాము అన్నారు.
    రాష్ట్రంలో కాలుష్య, పర్యావరణ కార్యక్రమాల్లో యువతను, విద్యార్థులను భాగస్వాములను చేయడం ద్వారా క్షేత్ర స్థాయి వరకూ అవగాహన పెరుగుతుందన్నారు. పరిశ్రమల నిర్వాహకులను, అకడమిక్ రంగంతో అనుసంధానిస్తే కాలుష్య నియంత్రణలో ఆర్ అండ్ డి అభివృద్ధి చెందుతుందన్నారు. పీసీబీని అడ్డుపెట్టుకొని వ్యక్తిగత ప్రయోజనాల్ని పొందాలని భావించేవారి విషయంలో జాగరూకతతో వ్యవహరించాలని అధికారులకి ఉప ముఖ్యమంత్రివర్యులు దిశా నిర్దేశం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *